విశ్వంలో ఐదో శక్తిని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిజిక్స్​ పరంగా ఇప్పటిదాకా నాలుగు శక్తులే

కొత్త శక్తిని కనుగొన్న హంగరీ ఫిజిక్స్​ సైంటిస్టులు

దాని బరువు 17 మెగాఎలక్ట్రాన్​వోల్టులు

మనల్ని డార్క్​మ్యాటర్​తో కలుపుతున్నది అదేనన్న భావన

భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. మనం చెప్పుకునే పంచభూతాలు. మన బతుకుకు అవే ఆధారం. కానీ, ఎన్నెన్నో రహస్యాలను కడుపులో దాచుకున్న విశ్వాన్ని మాత్రం ఫిజిక్స్​ పరంగా చెప్పుకుంటే కేవలం నాలుగు శక్తులే శాసిస్తున్నాయి. అది ఇప్పటిదాకా. ఇకపై ఆ నాలుగు శక్తులకు ఇంకో శక్తి జత కాబోతోంది. అవును, విశ్వంలో కొత్తగా మరో శక్తిని సైంటిస్టులు కనుగొన్నారు. ప్రస్తుతం గురుత్వాకర్షణ (గ్రావిటీ) శక్తి, విద్యుదయస్కాంత శక్తి (ఎలక్ట్రోమాగ్నెటిజం), బలహీనమైన అణు శక్తి (వీక్​ న్యూక్లియర్​ ఫోర్స్​), బలమైన శక్తి (స్ట్రాంగ్​ ఫోర్స్​)లే విశ్వంలో ఉన్నాయి. మరి, ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన ఆ కొత్త ఐదో శక్తి ఏంటి? అది ఎక్కడి నుంచి పుడుతోంది? దాని ప్రభావమేంటి?

అదో పార్టికల్

హంగేరియన్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ (ఆటమ్కీ)లోని న్యూక్లియర్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టులు ఆ ఐదో శక్తిని కనుగొన్నారు. ఎటిలీ క్రాష్నాహోర్కే నేతృత్వంలోని సైంటిస్టులు ఆ శక్తేంటో వివరించారు. దానిని ‘ఎక్స్​17’ అని పిలుస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడిన హీలియం, అది క్షీణించే కొద్దీ లైట్​గా ఎలా మారుతోందో తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అది ఫిజిక్స్​కు అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఆ హీలియం నుంచి పార్టికల్స్​ వెలువడుతున్నాయని గుర్తించినా అవేంటో వివరించలేకపోతున్నారు. ఆ పార్టికల్స్​ అసాధారణ రీతిలో 115 డిగ్రీల కోణంలో స్ప్లిట్​ అవుతున్నట్టు తేల్చారు. కానీ, తాజా పరిశోధనల్లో ఆ హీలియం నుంచి విడిపోతున్న వాటి నుంచే ఈ ఎక్స్​17 అనే కొత్త పార్టికల్​ను కనుగొన్నారు. దానికి ‘17’ అని జత చేయడానికి కారణం ఉంది. ఆ పార్టికల్​ 17 మెగాఎలక్ట్రాన్​వోల్టుల ద్రవ్యరాశి (బరువు)తో ఉందట. అందుకే ఏంటో తెలియని ఆ పార్టికల్​కు ‘ఎక్స్​17’ అని పేరు పెట్టేశారు. ఆ ఎక్స్​17 పార్టికలే మనకు కనిపించే ప్రపంచాన్ని, కనిపించని సుదూర విశ్వంలో ఉన్న డార్క్​మ్యాటర్​తో కలుపుతోందని భావిస్తున్నారు.

2016 నుంచే పరిశోధనలు

సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2016లో హంగేరియన్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ సైంటిస్టులే ఈ ఐదో శక్తిపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పుడు బెరీలియం–8 అనే ఐసోటోప్​ కేంద్రంగా స్టడీలు చేశారు. ఆ బెరీలియం–8 నుంచి ఎలక్ట్రాన్లు, పొజిట్రాన్లు అసాధారణ రీతిలో 140 డిగ్రీల కోణంలో విడిపోతున్నట్టు గుర్తించారు. అయితే, ఆ కొత్త పార్టికల్​ను ఎవరూ ఒప్పుకోలేదు. దాన్ని బలంగా నమ్మించడం కోసం పార్టికల్​ ఫిజిక్స్​ ‘స్టాండర్ట్​ మోడల్​’ లేనే లేదంటూ కొందరు కొట్టిపారేశారు. దానిని మరింత విశ్లేషించాల్సి ఉందని చెప్పారు. అందుకే మరింత లోతుగా ఆ పార్టికల్స్​పై పరిశోధన చేశారు. అలా చేస్తున్న సందర్భంలోనే ఈ ఎక్స్​–17 పార్టికల్​ ఆనవాళ్లను గుర్తించారు. అయితే, క్రాష్నాహోర్కే కనిపెట్టిన ఆ కొత్త పార్టికల్​ విషయాలు కొత్తగా ఉండడంతో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా ఫిజిక్స్​ అండ్​ ఆస్ట్రానమీ ప్రొఫెసర్​ జొనాథన్​ ఫెంగ్​ దానిని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి క్రాష్నాహోర్కే పరిశోధనలను ఆయన ఫాలో అవుతూనే ఉన్నారు.

ఫొటోఫోబిక్ ఫోర్స్

ఇప్పటివరకూ చూడని ఈ కొత్త శక్తిని ఫొటోఫోబిక్​ ఫోర్స్​ అనీ సైంటిస్టులు భావిస్తున్నారు. వెలుతురు అంటే భయపడేదని దాని అర్థం. దీనిపై చాలా మంది సైంటిస్టులు పెదవి విరిచారు. ఇప్పుడు కొందరు న్యూక్లియర్​ సైంటిస్టులు ఇది ఐదో శక్తి కాదు అని కొట్టిపారేయడానికి లక్షల కోట్లలో ఒక వంతు చాన్స్​ మాత్రమే ఉందని ఫెంగ్​ అంటున్నారు. ఈ బెరీలియం, హీలియం అణువులకు తోడుగా మూడో రకం కొత్త పార్టికల్​ను వేరే సైంటిస్టులు కనిపెడితే ఈ పరిశోధన మరింత ముందుకు కదులుతుందని అంటున్నారు. ఇక, దీనికి పేరు పెట్టేందుకూ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ కొత్త పార్టికల్​ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకునే ప్రయత్నాలూ సాగుతున్నాయి. ఇదివరకు ఐన్​స్టీన్​ లాంటి మేధావి దీనిపై దృష్టి పెట్టి తెలుసుకోలేకపోయిన పార్టికల్​ను క్రాష్నాహోర్కే టీం కనిపెట్టిందని కొనియాడుతున్నారు. ఇంకో ట్విస్ట్​ ఏంటో తెలుసా..? విశ్వం కేవలం ఐదో శక్తితోనే ఆగిపోదని, అందులో ఆరు, ఏడు, ఎనిమిది.. ఇంకా ఇంకా శక్తులు ఉండే ఉంటాయని క్రాష్నాహోర్కే టీం అంటోంది.

Latest Updates