మీ నోరు బాగుంటే.. గుండె బాగుంటుందంట

నోరు మంచిదైతే.. ఊరు మంచిదైతది’ అని మన పెద్దోళ్లు చెప్తుంటరు. కానీ నోరు బాగుంటే మన గుండె కూడా బాగుంటదంటున్నారు సౌత్ కొరియా సైంటిస్టులు! రోజూ కనీసం మూడు సార్లైనా బ్రష్ చేస్కుంటూ, నోరు క్లీన్ గా ఉంచుకుంటేనే గుండెకు ముప్పు తక్కువుంటదని వాళ్లు చెప్తున్నారు.  అదేందీ? బ్రష్ చేయడానికి, గుండె మంచిగ పనిచేయటానికి మధ్య లింకుందా? అని సర్ ప్రైజ్ అవుతున్నరా! అవును. ఉందనే అంటున్నారు సైంటిస్టులు. చాలామంది పొద్దున్నే లేవంగనే బ్రష్ చేస్తరు. మళ్లీ మరుసటి రోజుదాకా బ్రష్ ముట్టుకోరు. కొందరు మాత్రం రాత్రి నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేస్తుంటరు. అలా కాకుండా రోజూ మూడు సార్ల కంటే ఎక్కువ బ్రష్​ చేసేటోళ్లకు గుండె ఫెయిల్ అయ్యే రిస్క్ తక్కువగా ఉంటుందని సౌత్ కొరియాలోని ‘ఎవా ఉమెన్స్ యూనివర్సిటీ’ రీసెర్చర్లు చెప్తున్నారు.

బ్రషింగ్ కు, గుండెకు ఉన్న లింకు ఇదే..

నోటిని క్లీన్ గా ఉంచుకోకపోతే చెడు బ్యాక్టీరియా పెరుగుతుందని, అది శరీరంలోని వివిధ భాగాలకు, రక్తంలోకి ఇన్​ఫ్లమేషన్ (వాపు లేదా మంట) సమస్యను సృష్టిస్తదని ఇదివరకే పలు పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ ఇన్​ఫ్లమేషన్ వ్లల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం (ఆట్రియల్ ఫైబ్రిలేషన్), హార్ట్ బీట్ లయ తప్పడం, చివరికి గుండె ఫెయిల్ కావడానికి కూడా దారి తీసే ప్రమాదం ఉందని కొరియన్ రీసెర్చర్లు పేర్కొంటున్నారు. రీసెర్చ్ లో భాగంగా  ‘కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్’ ఆధ్వర్యంలో 40 నుంచి 79 ఏండ్ల మధ్య ఉన్న1,61,286 మంది ఆరోగ్యవంతులను వాలంటీర్లుగా ఎంపిక చేసుకున్నారు. వీరికి ఆట్రియల్ ఫైబ్రిలేషన్, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు లేవని నిర్ధారించుకుని, స్టడీ మొదలు పెట్టారు.

నోరు బాగుంటే.. 12% రిస్క్ తగ్గుతది  

మొదటగా 2003లో వీరికి ఏడాది పాటు అనేక పరీక్షలు చేస్తూ, ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. హైట్, వెయిట్, ఆరోగ్యం, లైఫ్​స్టైల్, నోటి ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలన్నీ పరిశీలించారు. ఆ తర్వాత పదేళ్లపాటు వీరిని అబ్జర్వేషన్ లో పెట్టారు. దీంతో పదేళ్ల తర్వాత ఫాలో అప్ చేయగా.. వీరిలో 4,911 మంది (3%)కి ఆట్రియల్ ఫైబ్రిలేషన్, 7,971 (4.9%) మందికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వచ్చినట్లు తేలింది. అయితే రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు బ్రష్​చేసినవారికి ఆట్రియల్ ఫైబ్రిలేషన్ ముప్పు 10 శాతం, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 12 శాతం తగ్గినట్లు గుర్తించామని రీసెర్చర్లు తెలిపారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మంచిదని, అలాగని దంతాలపై ఎనామిల్ అరిగిపోయేంతలా బ్రష్ తో రుద్దాల్సిన పని లేదని వారు సూచించారు. వీరి రీసెర్చ్ పేపర్ ఇటీవల ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్​ప్రివెంటివ్ కార్డియాలజీ’లో పబ్లిష్​చేశారు.

Latest Updates