కరోనా దెబ్బకు డెంగీ పరార్..ఈ సీజన్ లో ఒక్క కేసు నమోదు కాలే

నల్గొండ, వెలుగునల్గొండ జిల్లాలో సీజనల్​ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. కరోనా ​ నియంత్రణలో భాగంగా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలే సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా అడ్డుకోగలిగాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది ఇదే రోజుల్లో డెంగీ, చికున్ గున్యా, మలేరియా, వైరల్​ ఫీవర్స్​ విజృంభించాయి. కానీ ప్రస్తుతం వరుసగా వర్షాలు పడుతున్నా సీజనల్​ వ్యాధుల ప్రభావం మాత్రం అంతగా కనిపించడం లేదు. కరోనా​ను అరికట్టేందుకు గ్రామాలు, పట్టణాల్లో శానిటైజేషన్​ చేయడంతో పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలూ చేపట్టారు. దీంతో డెంగీ, మలేరియా వంటి రోగాలు సోకడం లేదని అధికారులు చెబుతున్నారు.

జాడలేని డెంగీ

వచ్చిపోయే వైరల్​ ఫీవర్స్​ కంటే డెంగీ జ్వరం అత్యంత ప్రమాదకరమైందని వైద్యాధికారులు అంటున్నారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్​ వరకు 79 డెంగీ కేసులు నమోదయ్యాయి. 32 చికున్ గున్యా, 18 స్వైన్​ ఫ్లూ, మరో 16,285 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్​ వరకు 16 డెంగీ కేసులే నమోదుకాగా, ముగ్గురికి చికున్ గున్యా సోకింది. ఈ కేసులు కూడా జనవరి నుంచి ఏప్రిల్​ వరకు నమోదైనవే. ఆ తర్వాత మే నుంచి ఇప్పటివరకు జిల్లాలో డెంగీ, చికున్ గున్యా కేసులు నమోదు కాలేదు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సీజనల్ ఫీవర్స్​ వానాకాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. గతేడాది మార్చి, ఆగస్టు, సెప్టెంబర్​లోనే ఎక్కువ మంది డెంగీ బారినపడ్డారు. వైరల్​ ఫీవర్స్​ కూడా ఈ రెండు నెలల్లోనే ఏడు వేల మందికి సోకాయి. స్వైన్​ ఫ్లూ కేసులు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయనే చెప్తున్నారు.

సెల్ఫ్ ప్రొటెక్షన్ తోనే రోగాలు మాయం..

కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా పాటిస్తున్న జాగ్రత్తలతోనే రోగాలు మాయం అవుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలకుండా మాస్కులు ధరించడంతో పాటు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం అలవాటు చేసుకున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇండ్లు, అపార్ట్ మెంట్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటున్నారు. దీంతో దోమల వ్యాప్తి తగ్గి డెంగీ, మలేరియా జ్వరాలు కంట్రోల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

కరోనాతో కలిపి ట్రీట్ మెంట్

వైరల్​ ఫీవర్స్​ కాకుండా సాధారణ జ్వరాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ సీజన్​ లో ఇప్పటివరకు సుమారు ఏడు వేల కేసులు నమోదయ్యాయి. జనవరి, ఫిబ్రవరి, జులై, ఆగస్టులోనే జ్వరం కేసులు రికార్డయ్యాయి. అయితే ఇవన్నీ కూడా సాధారణ జ్వరాల కిందనే ట్రీట్​ చేస్తున్నారు. టైఫాయిడ్​ జ్వరంతో వచ్చిన రోగులు 363 మంది ఉన్నారు. కరోనా సింప్టమ్స్ లో జ్వరం, దగ్గు, జలుబు కూడా ఉండడంతో అన్నింటికీ కలిపి ఒకటే ట్రీట్ మెంట్ ​ ఇస్తున్నారు. అంటే జ్వరంతో వచ్చిన వారిని రెండు, మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఆ తర్వాత కరోనా టెస్టులకు సిఫార్సు చేస్తున్నారు. ఎక్కువ మంది పేషెంట్లలో సాధారణ జ్వరంతో వచ్చిన వాళ్లే ఉన్నారని డాక్టర్లు చెప్తున్నారు. మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లా ప్రజలు కరోనాతోనే పోరాడుతున్నారు. ఇప్పటివరకు 14 వేల పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదు వేల కేసులు యాక్టివ్ ​గా ఉన్నాయి. రికవరీ పర్సంటేజీ మెరుగ్గానే ఉన్నప్పటికీ రోజుకు మూడు వేల మందికి టెస్టులు చేస్తున్నారు. కనీసం 300 మందికి పాజిటివ్​ వస్తోంది. ఈ వైరస్​లో భాగంగానే జ్వరం, ఫ్లూ లక్షణాలు కూడా ఉన్నాయి.

అందరికీ ట్రీట్ మెంట్ ఇస్తున్నాం

కరోనా సింప్టమ్స్ తో వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా జ్వరం కేసులే ఉంటున్నాయి. అలాంటి వాళ్లందరికీ మూడు, నాలుగు రోజులు స్పెషల్ గా ట్రీట్ మెంట్ ఇస్తున్నాం. సాధారణ జ్వరం అయితే మూడు, నాలుగు రోజుల్లో మార్పు కనిపిస్తోంది. ఏరియా హాస్పిటల్స్ లో కరోనా టెస్టులు కూడా తగ్గాయి. ప్రజల్లో చైతన్యం పెరిగింది. వాళ్లు అలర్ట్ గా ఉండడంతోనే డెంగీ, చికున్ గున్యా వంటి రోగాలు కూడా కంట్రోల్​ లో ఉన్నాయి.

– డాక్టర్​ మాతృనాయక్, డీసీహెచ్ ​ఎస్​

 

Latest Updates