తప్పు జరిగిన 9 ఏళ్లకు సెబీ యాక్షన్

Sebi imposes Rs 79 lakh fine on MD, 6 directors of Ranklin Solutions
  • అప్పటి ప్రమోటర్లు గాయబ్
  • చేతులు కాల్చుకున్న చిన్న ఇన్వెస్టర్లు
  • రాంక్లిన్ సొల్యూషన్స్ 79 లక్షల జరిమానా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :చిన్న ఇన్వెస్టర్ల హక్కులను పరిరక్షించాల్సిన నియంత్రణా సంస్థల వైఖరి ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. చిన్న ఇన్వెస్టర్ల హక్కుల పరిరక్షణలో భాగంగా పబ్లిక్‌‌‌‌ కంపెనీలలో పారదర్శకత పెంచడంతోపాటు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందో వాటాదారులకు తెలిసేలా అటు స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌లు, ఇటు సెక్యూరిటీస్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (సెబీ)లు పర్యవేక్షిస్తుంటాయి. ఆక్వాకల్చర్‌‌‌‌, ఫ్లోరీకల్చర్‌‌‌‌, గ్రానైట్‌‌‌‌, నాన్‌‌‌‌బ్యాంకింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌, ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ రంగాలలోని బూమ్‌‌‌‌ను ఆసరాగా చేసుకుని ఎంతో మంది ఎంట్రప్రెనూర్లు తెలుగు రాష్ట్రాల నుంచి పబ్లిక్‌‌‌‌ ఇష్యూలు చేసి తాము కోటీశ్వరులై, చిన్న ఇన్వెస్టర్ల నెత్తిన శఠగోపం పెట్టారనేది తెలుసున్న విషయమే. అలాంటి చాలా కంపెనీల, వాటి యజమానుల అడ్రెస్‌‌‌‌లు కూడా నియంత్రణా సంస్థల వద్ద అందుబాటులో లేవంటే మన పర్యవేక్షణ ఎంత గొప్పగా ఉందో అర్ధమవుతుంది. ఒక హైదరాబాద్‌‌‌‌ లిస్టెడ్‌‌‌‌ కంపెనీ విషయంలో మంగళవారం నాడు సెబీ జారీ చేసిన ఉత్తర్వులు చూస్తే, ఈ విషయమే స్పష్టమవుతోంది.

హైదరాబాద్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ కంపెనీ రాంక్లిన్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌, దాని డైరెక్టర్లపై తాజాగా రూ. 79 లక్షల జరిమానా (ఫైన్‌‌‌‌)ను సెబీ విధించింది. డిస్‌‌‌‌క్లోజర్‌‌‌‌ నిబంధనలను పాటించకపోవడంతోపాటు, ఇన్‌‌‌‌సైడర్‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ జరిమానా విధించారు. ఫిబ్రవరి  2010– జనవరి 2011 మధ్య కాలానికి సంబంధించి జరిపిన దర్యాప్తులో రాంక్లిన్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఎంజేవీవీడీ ప్రకాష్‌‌‌‌ టేకోవర్‌‌‌‌ నిబంధనల ప్రకారం చేయాల్సిన డిస్‌‌‌‌క్లోజర్స్‌‌‌‌ను చేయలేదని, అంతేకాకుండా కంపెనీలో తన వాటా నిబంధనల కంటే పెరిగినా ఓపెన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ప్రకటించడంలో విఫలమయ్యారని సెబీ తన నివేదికలో పేర్కొంది. సబ్‌‌‌‌స్టాన్షియల్‌‌‌‌ ఎక్విజిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ షేర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టేకోవర్స్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఏఎస్‌‌‌‌టీ) నిబంధనల ప్రకారం ఒక పరిమితికి మించి ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ వాటాలు పెరిగినప్పుడు తప్పనిసరిగా ఓపెన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ప్రకటించాలి. జూన్‌‌‌‌ 29, 2010 నాటికి రాంక్లిన్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌లో ప్రకాష్‌‌‌‌ వాటా 14.60 శాతం. అప్పుడు ప్రకాష్‌‌‌‌ మరో 35 వేల షేర్లను కొనుగోలు చేయడంతో అతని వాటా 15.29 శాతానికి పెరిగిందని సెబీ మంగళవారం నాడు విడుదల చేసిన ఉత్తర్వులు వెల్లడించాయి.

ప్రకాష్‌‌‌‌ వాటా కంపెనీలో 15 శాతానికి మించడంతో ఓపెన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ప్రకటించడం తప్పనిసరి. కానీ, ఓపెన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ప్రకటించడంలో విఫలమైనట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు, షేర్‌‌‌‌ ధరను ప్రభావితం చేసే రహస్య సమాచారాన్ని అట్టే పెట్టుకున్న ప్రకాష్‌‌‌‌ , షేర్ల ట్రేడింగ్‌‌‌‌కు పాల్పడ్డారని కూడా సెబీ తేల్చింది. షేర్ల ధరలను ప్రభావితం చేసే ప్రతీ అంశాన్నీ లిస్టెడ్‌‌‌‌ కంపెనీలు తప్పనిసరిగా ముందుగా స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌లకు తెలపాలని నిబంధనలున్నాయి. ఐతే, గత మూడు దశాబ్దాలుగా చాలా లిస్టెడ్‌‌‌‌ కంపెనీలు ఈ నిబంధనలను యధేచ్చగా తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ముందుగా తమకు మాత్రమే అందుబాటులో ఉండే సమాచారంతో తమ ప్రయోజనాలను చూసుకున్నాకే ప్రమోటర్లు, ఆ సమాచారాన్ని బయటకు చెబుతారనే ప్రచారం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. నిబంధనలను ఎంత కఠినతరం చేసినా, ఏదో రూపంలో వాటిని అధిగమించే మార్గాలను ప్రమోటర్లు వెతుక్కుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌లు, సెబీ చిన్న ఇన్వెస్టర్ల రక్షణకు సరైన చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందలాది కంపెనీలు పబ్లిక్‌‌‌‌ ఇష్యూలు చేసి వేల కోట్ల రూపాయలకు ప్రజలను ముంచేసి ముఖం చాటేసినా, నియంత్రణా సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ముమ్మాటికీ సమంజసం కాదని విమర్శిస్తున్నారు.

ఈ పెనాల్టీ కట్టేదెవరు?

రాంక్లిన్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌ అప్పటి మేనేజింగ్‌ డైరెక్టర్‌‌‌‌ ప్రకాష్‌ మీద రూ. 49లక్షలు, మరో ఆరుగురు డైరెక్టర్లు పీ వెంకటేశ్వర రావు, ఎం జోత్స్న లక్ష్మి, జేవీవీ రాఘవ కుమార్‌‌‌‌, ఎం సతీష్‌ కు మార్‌‌‌‌, కేఎస్‌ చక్రవర్తి, కే విజయరామ రాజులుఒక్కొక్కరి పై రూ. 5 లక్షల చొప్పున సెబీజరిమానా వేసింది. ఇక్కడ గమ్మత్తేమంటే,మేనేజింగ్‌ డైరెక్టర్‌‌‌‌ ప్రకాష్‌ సహా ఇతర ఆరుగురి లో ఎవరూ కూడా ప్రస్తుతం రాంక్లిన్‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌ లో డైరెక్టర్లుగా లేరు.ఎప్పుడో 2010 సంవత్సరంలో చోటుచేసుకున్న పరిణామాలపై సెబీ దర్యాప్తుఎంత వేగంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక మరోపక్క 2011 తర్వాత యాన్యువల్‌‌‌‌ రిపోర్టులు ఫైల్‌‌‌‌ చేయకపోయినా, 2015 ఏప్రిల్‌‌‌‌ దాకా రాంక్లిన్ సొల్యూషన్స్‌‌‌‌ లిమిటెడ్‌ లో స్టాక్‌‌‌‌ ఎక్స్చేంజ్‌ లలో ఎందుకు ట్రేడింగ్ కు అనుమతించారో మానవ మాత్రుడికి అర్ధం కాదు. 2014 దాకా డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ (వాటాదారుల వివరాలు)ను మాత్రం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ కు కంపెనీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2014 నాటి డేటా ప్రకారం చూస్తే రాంక్లిన్ సొల్యూషన్స్‌‌‌‌లో ప్రమోటర్లు ప్రకాష్‌ , జ్యో త్స్న లక్ష్మి, ఆకుల నారాయణ మూర్తిలకు కలిపి కేవలం 10శాతం వాటాలున్నాయి . అంటే అప్పటికే వారి షేర్లను అమ్మేసి చిన్న ఇన్వెస్టర్లకు అంటకట్టేశారని భావించొచ్చు. మరో 10శాతం షేర్ల బాడీ కార్పొ రేట్ల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 80% వాటాలు బకరాలైన చిన్న ఇన్వెస్టర్ల వద్దే ఉన్నట్లు కదా.

Latest Updates