నీటి కొరత.. విద్యార్థినుల జుట్టు కోత

మంచిగా జడలు వేసుకుని స్కూలుకి వెళ్లాలని విద్యార్ధినిలు కోరుకుంటారు. అయితే నీటి కొరత అక్కడి విద్యార్థుల ఆశలను నిరాశ చేసింది. విద్యార్థినులు..అబ్బాయిల్లా కటింగ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. హాస్టల్‌లో నీటి కొరత ఏర్పడడంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రిన్సిపాల్ అరుణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నీళ్ల ఆదా కోసం బాలికల జుట్టు కత్తిరించారు. సాధారణంగా అమ్మాయిలు తల స్నానం చేయడానికి ఎక్కువ నీరు అవసరం. నీటిని పొదుపు చేయడానికి ప్రిన్సిపాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఆరు తరగతులు ఉన్నాయి. ఇందులో 180 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హాస్టల్‌ల్లో కూడా నీటి సమస్య తలెత్తడంతో.. ప్రిన్సిపాల్ అరుణ బాలికలందరికీ బాయ్స్ కట్ చేయించారు. బక్రీద్ సందర్భంగా సోమవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లిదండ్రులు పిల్లల్ని చూడటానికి హాస్టల్‌కి వచ్చారు. బాయ్ కటింగ్ లో కన్పించిన తమ పిల్లలను చూసిన తల్లిదండ్రులు షాకయ్యారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ఇలాంటి పని చేయడమేంటని.. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించారు. అయితే.. హాస్టల్‌లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు ప్రిన్సిపాల్.

Latest Updates