జనవరి 2 నుండి పల్లె ప్రగతి 2వ విడత

జనవరి 2 నుండి పల్లె ప్రగతి 2వ విడత

హైదరాబాద్ : జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం  చేయాలని సూచించారు. 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో  సమావేశం నిర్వహించారు. తర్వాత  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఎర్రబెల్లి.

పల్లె ప్రగతి మొదటి దశ విజయవంతంగా నిర్వహించారని, రెండవ విడత పల్లె ప్రగతి విజయవంతానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పల్లెప్రగతి నిర్వహణతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని, రెండవ విడత నిర్వహణకు సంబంధించి జిల్లా స్ధాయి సమావేశాల నిర్వహణను వెంటనే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

గ్రామ పంచాయతీల కోసం ప్రతి నెల రూ. 339 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు మంత్రి. గ్రామాలలోని యువకులను, మహిళలను, పెన్షనర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల వారిగా చేపట్టిన, చేపట్టపోయే పనులు, కార్యక్రమాల వివరాలపై బుక్ లెట్ అందించాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్ ల కొనుగోలుకు చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. తమ గ్రామాలను తామే పరిశుభ్రంగా ఉంచుకునే స్పూర్తి కలిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

గ్రామాల్లో నర్సరీల పెంపకం, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులకు స్ధలసేకరణ, నాటిన మొక్కల సంరక్షణ, శిధిల గృహాల తొలగింపు, పాతబావుల పూడ్చివేత, డస్ట్ బిన్ల సరఫరా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు జనవరి 2 న నిర్వహించే గ్రామ సభలలో పాల్గొనాలన్నారు. గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సరియైన రీతిలో పల్లె ప్రగతిని నిర్వహించేలా చూడాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై  చర్యలు తీసుకోవడంతో పాటు.. మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి.