రెండో టీ-20: బంగ్లాపై భారత్ ఘనవిజయం

టార్గెట్‌‌ ఛేజ్‌‌లో వీరోచితంగా చెలరేగిన టీమిండియా.. రెండో టీ20లో విజయం సాధించింది. రోహిత్‌‌ హాఫ్‌‌ సెంచరీకి తోడు.. ధవన్‌‌ (31) సమయోచితంగా ఆడటంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌ 20 ఓవర్లలో 6  వికెట్లకు 153 పరుగులు చేసింది. మహ్మద్‌‌ నయీమ్‌‌ (36), సౌమ్య సర్కార్‌‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 30), మహ్ముదుల్లా (21 బంతుల్లో 4 ఫోర్లతో 30) రాణించారు. తర్వాత ఇండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 రన్స్‌‌ చేసి మరో 26 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. రోహిత్‌‌కు ఇది వందో టీ20 మ్యాచ్‌‌ కావడం విశేషం. దీంతో ఇండియా తరఫున ఈ ఫీట్‌‌ సాధించిన తొలి క్రికెటర్‌‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌గా రెండో స్థానంలో ఉన్నాడు. షోయబ్‌‌ మాలిక్‌‌ (111) టాప్‌‌లో ఉన్నాడు. రోహిత్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది. మూడో టీ20 ఆదివారం నాగ్‌‌పూర్‌‌లో జరుగుతుంది.

రిషబ్‌‌ అత్యుత్సాహం..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్లు లిటన్‌‌ దాస్‌‌ (21 బంతుల్లో 4 ఫోర్లతో 29), నయీమ్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.  ఖలీల్‌‌ వేసిన రెండో ఓవర్‌‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన నయీమ్‌‌.. నాలుగో ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లు రాబట్టాడు. అయితే ఐదో ఓవర్‌‌లో రిషబ్‌‌ చూపిన అత్యుత్సాహం ఇండియాకు వికెట్‌‌ దక్కకుండా చేసింది. చహల్‌‌ వేసిన మూడో బాల్‌‌ను ఫ్రంట్‌‌ఫుట్‌‌కొచ్చి షాట్‌‌ కొట్టబోయిన లిటన్‌‌ లైన్‌‌ మిస్సయ్యాడు. బంతిని అందుకున్న రిషబ్‌‌ స్టంపౌట్‌‌ కూడా చేశాడు. కానీ బాల్‌‌ రాకముందే పంత్‌‌.. అడ్వాన్స్‌‌గా వికెట్ల ముందరకు చేతులు చాపడంతో టీవీ అంపైర్‌‌ ‘నోబాల్‌‌’గా ప్రకటించాడు. తర్వాతి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టిన లిటన్‌‌.. 13 రన్స్‌‌ రాబట్టాడు. పవర్‌‌ప్లే ముగిసేసరికి బంగ్లా స్కోరు 54/0కి చేరింది. తర్వాతి ఓవర్‌‌ (సుందర్‌‌) మూడో బంతిని.. లిటన్‌‌ స్లాగ్‌‌ స్వీప్‌‌ చేయగా టాప్‌‌ ఎడ్జ్‌‌ తీసుకొని గాలిలోకి లేచింది. కానీ దూబే, పంత్‌‌, రోహిత్‌‌ క్యాచ్‌‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 8వ ఓవర్‌‌లో చహల్‌‌ వేసిన గూగ్లీని కవర్స్‌‌లోకి నెట్టిన లిటన్‌‌ రనౌటవడంతో  బంగ్లా 60 రన్స్‌‌ వద్ద తొలి వికెట్‌‌ కోల్పోయింది. 11వ ఓవర్‌‌లో సుందర్‌‌ గుడ్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌తో నయీమ్‌‌ను ఔట్‌‌ చేశాడు. దీంతో  రెండో వికెట్‌‌కు 23 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 12వ ఓవర్‌‌లో సౌమ్య తొలి సిక్సర్‌‌తో టచ్‌‌లోకి రాగా, తర్వాతి ఓవర్‌‌లో చహల్‌‌ డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. ఆరు బంతుల తేడాలో గత మ్యాచ్‌‌ హీరో ముష్ఫికర్‌‌ (4), సౌమ్యను పెవిలియన్‌‌కు పంపాడు. ఫలితంగా బంగ్లా 103 రన్స్‌‌కు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మహ్ముదుల్లా వేగంగా ఆడగా, అఫిఫ్‌‌ (6)ను  బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఒత్తిడికి లోనైన అఫిఫ్‌‌.. 17వ ఓవర్‌‌లో క్యాచ్‌‌ ఇచ్చాడు. చివర్లో మొసాద్దెక్‌‌ (7 నాటౌట్‌‌), అమినుల్‌‌ (5 నాటౌట్‌‌) నిలకడతో  బంగ్లా మంచి స్కోరును సాధించింది.

సిక్సర్లే.. సిక్సర్లు..

టార్గెట్‌‌ ఛేజ్‌‌లో రోహిత్‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ధవన్‌‌ రెండు ఫోర్లతో స్టార్ట్‌‌ చేస్తే.. ముస్తాఫిజుర్‌‌ నాలుగో ఓవర్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌తో 15 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లు వచ్చాయి. 32 బంతుల్లోనే టీమిండియా 50 పరుగులకు చేరింది.  షఫీయుల్‌‌ బౌలింగ్‌‌లో సిక్సర్‌‌ కొట్టిన రోహిత్‌‌.. ఎనిమిదో ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌తో 23 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. మొసాద్దెక్‌‌ వేసిన పదో ఓవర్‌‌లో వరుసగా మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌‌ప్లేలో 63/0తో ఉన్న స్కోరు పది ఓవర్లలో 113కి చేరింది. కానీ 11వ ఓవర్‌‌లో అమినుల్‌‌ బంతిని ఫ్రంట్‌‌ఫుట్‌‌ ఆడిన ధవన్‌‌ క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. వన్‌‌డౌన్‌‌లో రాహుల్‌‌ (8 నాటౌట్​) టచ్‌‌లోకి రావడానికి టైమ్‌‌ తీసుకున్నా.. రోహిత్‌‌ మాత్రం వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 13వ ఓవర్‌‌లో అమినుల్‌‌ బంతిని డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లోకి పంపగా, మిథున్‌‌ క్యాచ్‌‌ అందుకున్నాడు. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (24 నాటౌట్​) వచ్చి రావడంతో సిక్స్‌‌ కొట్టి జోరు చూపెట్టాడు. ఆ వెంటనే చకచకా ఫోర్లు కొట్టడంతో ఇండియా అలవోకగా టార్గెట్​ను అందుకుంది.

Latest Updates