భారత్‌లో కంట్రోల్ అవుతున్న కరోనా: చలికాలంలో సెకండ్ వేవ్ భయం

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ చీఫ్ వీకే పాల్ అన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని రకాల వసతులు, సౌకర్యాలు దేశంలో అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కొత్త కేసుల నమోదు, మరణాలు బాగా తగ్గాయని ఆయన చెప్పారు. అయితే చలి కాలంలో వైరస్ మళ్లీ విజృంభించి సెకండ్ వేవ్ కనిపించే చాన్స్ లేకపోలేదని అన్నారు. కరోనా పరిస్థితులపౌ ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో గడిచిన మూడు వారాలుగా కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిందన్నారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు మూడు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఇంకా కరోనా కేసుల నమోదులో రోజు రోజుకీ పెరుగుదల కనిపిస్తోందని, మెజారిటీ రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాలు బాగా పడిపోయాయని చెప్పారు.

ఇండియా కరోనా కేసుల్లో సెప్టెంబర్ నాటికి పీక్ దశను దాటేసిందని, క్రమంగా వైరస్ వ్యాప్తి పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చేస్తోందని వీకే పాల్ అన్నారు. ప్రజలంతా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వస్తే 2021 మొదటి రెండు మూడు నెలల్లో కల్లా కరోనా కంట్రోల్ అవుతుందన్నారు. చలి కాలం మొదలవడం, వరుసగా పండుగలు వస్తుండడంతో మళ్లీ కరోనా కేసులు పెరిగి మరో పీక్ చూసే అవకాశం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్‌లోనూ పలు దేశాలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయని వీకే పాల్ చెప్పారు. అయితే ఆ దేశాలతో పోలిస్తే భారత్ చాలా బెటర్ పొజిషన్‌లోనే ఉంటుందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే దశలోనే ఉన్నామని, ప్రజలు పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తేనే మహమ్మారి మరోసారి విజృంభించకుండా కట్టడి చేయొచ్చని వీకే పాల్ చెప్పారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం వంటి జాగ్రత్తల విషయంలో ఏ మాత్రం ఏమరపాటు పనికిరాదన్నారు. ఈ జాగ్రత్తల విషయంలో లైట్ తీసుకుంటే కరోనా కేసులు అనూహ్యమైన స్థాయిలో పెరగవచ్చని చెప్పారు. పండుగలకు ఆంక్షలను భారీగా సడలించి, జనం గుంపులుగా చేరేందుకు వీలు కల్పిస్తే తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సీజన్ మార్పు కూడా దీనికి తోడైతే ఒక్కొ నెలలో 26 లక్షల కేసులు వరకూ రికార్డ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరోనాను అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు పక్కాగా పాటిస్తే 2021 ఫిబ్రవరి కల్లా యాక్టివ్ కేసుల సంఖ్య అతి తక్కువ స్థాయికి చేరుతాయని వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే దేశంలో 30 శాతం జనాభాకు కరోనాను ఎదుర్కోగలిగే ఇమ్యూనిటీ పవర్ వచ్చిందని చెప్పారాయన. వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగానే ఉన్నాయని, ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యి వ్యాకిన్ రెడీ అయితే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన రిసోర్సెస్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Latest Updates