అడవుల్లో సీక్రెట్​ సర్వే.. అసలేం జరుగుతోంది?

  • 19 టీంలతో కలిసి ‘పోడు’ లెక్క తేలుస్తున్న ఐటీడీఏ
  • జీపీఎస్​ ఆధారంగా మ్యాప్​ల తయారు
  • ఫారెస్ట్​ సర్వే ఆఫ్ ​ఇండియాకు రిపోర్టు
  • పాత అప్లికేషన్లకు పట్టాలిచ్చేందుకేనా?
  • చెప్పకపోవడంతో అడ్డుకుంటున్న ఆదివాసీలు
  • చెప్తే గొడవలవుతాయని భయం

భద్రాచలం, వెలుగు: దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూములను ఫారెస్ట్​ అధికారులు స్వాధీనం చేసుకొని ట్రెంచ్​లు ఏర్పాటు చేయడం, అడ్డొచ్చిన వారిపై కేసులు పెట్టడం లాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు వ్యతిరేక ప్రకటనలు చేశారు. అవసరమైతే ప్రతిదాడులు చేస్తామని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు హెచ్చరికలు కూడా చేశారు. ఈ విషయం సీఎం వరకూ వెళ్లింది. దీంతో సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారం చూపిస్తారనుకుంటున్న వేళ ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​తో కలిసి ఐటీడీఏలోని ఆర్‍ఓఎఫ్ఆర్‍ వింగ్​ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల సర్వేను గుట్టుగా చేపట్టింది.  దీనిగురించి ఎక్కడా బయటకు చెప్పడం లేదు. దీంతో తమ భూముల విషయంలో భయపడుతున్న గిరిజనులు ఆఫీసర్లను అడ్డుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట టేకులపల్లి మండలం బర్లగూడెం, దుమ్ముగూడెం మండలంలోని కమలాపురం వంటి కొన్ని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సర్వేలను అడ్డగించారు.

పాత అప్లికేషన్ల పరిష్కారానికా?

రెండేండ్ల కింద.. అడవుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలంటూ కేంద్రం ఓ జీఓ తీసుకువచ్చింది. తరతరాలుగా అడవితోనే తమ జీవితం ముడిపడి ఉందంటూ ఆదివాసీలు ఆందోళన చేయడంతో పాటు కొందరు సుప్రీంకోర్టులో పిల్​ వేశారు. కేంద్ర ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములపై రైట్స్​ ఇచ్చిందని,  అలాంటప్పుడు తమను ఎలా ఖాళీ చేయిస్తారని వాదించారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో 2008 నుంచి 2011 మధ్యకాలంలో పోడు భూముల పట్టాల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య, వివరాలు చెప్పాలని కోర్టు కోరింది. ఈ విషయాలన్నీ రాష్ట్రంలో ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆర్‍ఓఎఫ్ఆర్‍ (రికగ్నైజేషన్​ఆఫ్​ ఫారెస్ట్​ రైట్స్) విభాగం చూస్తున్నందున స్టేట్​ట్రైబల్‍ కమిషనర్​వారికే బాధ్యతను అప్పగించారు. ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​తో కలిసి సర్వే చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నెల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 19 మంది సర్వేయర్లు ఫారెస్టు ఆఫీసర్ల సాయంతో సర్వే చేస్తూ పోడు భూముల సరిహద్దులు గుర్తిస్తున్నారు. కానీ ఇదంతా సీక్రెట్​గా చేస్తున్నారు. 2008-–11 మధ్య కాలంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సుమారు 20 వేల మంది తమ పోడు భూములకు పట్టాలివ్వాలని అప్లై చేసుకోగా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వాటికి పరిష్కారం చూపే అవకాశం ఉన్నందునే సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే అనర్హులు కూడా తమను హక్కుదారులుగా గుర్తించాలని ఆందోళన చేసే అవకాశం ఉందని చెప్పడం లేదంటున్నారు.

తలనొప్పిగా మారిన సర్వే

2008-–11 మధ్య కాలంలో రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు ఇప్పుడు ఐటీడీఏ, ఫారెస్ట్ ఆఫీసర్లకు తలనొప్పిగా మారాయి. అటవీహక్కుల చట్టం-2006  ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టాల కోసం వాస్తవంగా 68,470 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో వ్యక్తిగత ఆప్లికేషన్లు 67,790 ఉండగా, గ్రూపులుగా పోడు వ్యవసాయం చేసేవారు 680 మంది ఉన్నారు. మొత్తంగా 3,92,495 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో అప్పటి రాష్ట్ర సర్కారు గ్రామ, డివిజన్‍, జిల్లా లెవెల్​కమిటీలను ఏర్పాటు చేసింది. డిసెంబరు 13, 2005 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కమిటీలు సిఫార్సు చేసిన అర్హులైన వ్యక్తులకు కూడా ఇవ్వొచ్చని చెప్పారు. ఈ కమిటీల్లో ఉన్న మెంబర్స్ ​లోకల్ పొలిటికల్ ​లీడర్లు కావడంతో వారికి నచ్చని అప్లికేషన్లు పక్కన పెట్టారు. ఇవి అనర్హులతో కలిపి 35,642 అప్లికేషన్లుగా లెక్క తేలింది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో18,635, ఖమ్మం జిల్లాలో 2004 మందిని ఆర్‍ఓఎఫ్ఆర్‍ రికార్డుల ప్రకారం అర్హులుగా తేల్చారు. ఇప్పుడు సర్వే చేసి 20, 639 మందికి పట్టాలిస్తే మిగిలిన 15 వేల మంది ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది.

అసలు విషయం చెప్తే ఏమవుతుందోనని..

రిజెక్టయిన అప్లికేషన్‍లోని పేరు ఆధారంగా సర్వేయర్లు, ఫారెస్ట్​ఆఫీసర్లు స్పాట్​కు వెళ్లాలి. అక్కడ జీపీఎస్‍ ఆధారంగా భూమి సరిహద్దుల వివరాలు నమోదు చేసి మ్యాప్‍ను రూపొందించి ఫారెస్ట్ సర్వే ఆఫ్​ ఇండియాకు పంపాలి. దీనికోసం గతంలో రిజెక్ట్ అయిన అప్లికేషన్ల వివరాల ఆధారంగా ఫారెస్ట్​, రెవెన్యూ అధికారులు భూముల దగ్గరకు పోతున్నారు. అయితే ఇదంతా చూస్తున్న ఆదివాసీలు సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రిజెక్టయిన పాత అప్లికేషన్ల ఆధారంగా సర్వే చేస్తున్నామని చెప్తే గొడవలు అవుతాయని గ్రహించి, తమ ఫారెస్ట్​ భూముల హద్దులు తేల్చేందుకు వచ్చామని చెబుతున్నారు. దీంతో తమ పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్​భూములు ఎంతున్నాయో లెక్క చూడడం ఏమిటని ఆదివాసీలు అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ కోసం ఐటీడీఏ పీవో గౌతమ్‍పోట్రును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు

ఆదివాసీలను మోసం చేయాలని, వారికి అన్యాయం చేయాలని చూస్తే సహించం. ఏళ్ల తరబడి సాగులో ఉన్న గిరిజనుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఆంధ్రాలో ఇప్పటికే పట్టాలిచ్చారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ దాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడేమో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో గూడాల్లోకి సర్వేకు వస్తున్నారు. మాయమాటలు చెబుతున్నారు. అసలు అప్లికేషన్లు ఎందుకు రిజెక్ట్ చేశారు? కారణం చెప్పాల్సిందే.గిరిజనుల నుంచి ఇంచు భూమిని లాక్కున్నా ప్రతిఘటిస్తాం.

-సోంది వీరయ్య, గోండ్వానా సంక్షేమ పరిషత్​వ్యవస్థాపక అధ్యక్షుడు, భద్రాచలం

For More News..

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ-స్మార్ట్​గా బిజినెస్.. స్మార్ట్ ఫోన్‌‌తోనే కొంటూ, అమ్ముతూ లక్షల్లో సంపాదన

పాల డెయిరీలో రూ. 50 కోసం గొడవ.. యువకుడు మృతి

Latest Updates