సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి కూల్చివేతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయమే భారీగా పోలీసు బలగాలను మొహరించి జేసీబీలు.. ప్రొక్లెయినర్లతో కూల్చివేత ప్రారంభించారు. కూల్చివేతను అడ్డుకుంటారేమోననే అనుమానంతో.. ముందు జాగ్రత్తగా సెక్రెటరేట్ దారులన్ని మూసేశారు. ఖైరతాబాద్, ట్యాంక్బండ్ మింట్ కాపౌండ్ వైపుగా సెక్రెటరేట్ కు వెళ్లే దారులన్నీ మూసివేసి ట్రాఫిక్ వేరే రూట్లలో మళ్లిస్తున్నారు.

సెక్రటేరియట్ కూల్చివేతకు తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని హైకోర్టు వ్యతిరేకించని విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టకుండా అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కూల్చివేత కు లైన్ క్లియర్ అయినట్లు ప్రభుత్వం నిర్ణయించుకుంది.

కొత్త సెక్రటేరియట్ కు భూమిపూజ చేసిన ఏడాది తర్వాత పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. 132 ఏండ్ల ఘన చరిత్రకలిగిన ఈ సెక్రెటరేట్  నిజాం నవాబుల పాలనా కేంద్రంగా ఉండేది.  సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో  ప్రసిద్ధికెక్కిన ఈ సెక్రటేరియట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రంగా కూడా నిలిచింది. ఆనాటి ఉమ్మడి రాష్ట్రం మొదలు ఇప్పటి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయం  25 ఎకరాల విస్తీర్ణంలో.. 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 132ఏండ్ల కాలంలో 10బ్లాకుల నిర్మాణం జరిగింది. అతిపురాతన మైన జి బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మాణం జరిగింది. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చరిత్రగతిలో కలసిపోతోంది.

హైకోర్టు తీర్పుతో పాత సచివాలయాన్ని కూల్చివేయడం చేపట్టిన ప్రభుత్వం అన్ని హంగులతో కొత్త సచివాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఐదు వందల కోట్ల వ్యయంతో… ఆరులక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయం నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేశారు. సిఎం అధికారులు,  మంత్రులతో  సమావేశం కోసం అధునాతన హాల్స్, మంత్రుల  పేషీలోని ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్ లు అన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక హంగులు.. సరికొత్త టెక్నాలజీతో భారీ ఎత్తున నిర్మించనున్నారు.

Latest Updates