18వ లోక్​సభకు విస్తృత ఏర్పాట్లు..పేపర్​లెస్ విధానంలో కార్యకలాపాలు

18వ లోక్​సభకు విస్తృత ఏర్పాట్లు..పేపర్​లెస్ విధానంలో కార్యకలాపాలు

న్యూఢిల్లీ, వెలుగు: కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్ సభ కోసం సెక్రటేరియెట్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ లెస్ విధానంలో కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో కొత్త సభ్యుల రిజిస్ట్రేషన్ నుంచి అన్నింటిని డిజిటల్ పద్ధతిలోనే చేపట్టనుంది. నూతన పార్లమెంట్ లోకి వెళ్లేందుకు వీలుగా ఫేస్ రికగ్నైషన్ ద్వారా కేంద్రీకృత ఐడీని రూపొందించింది.

పార్లమెంట్ ప్రాంగణంలో డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. అలాగే తొలిసారి ఎంపికైన వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గైడ్ పోస్ట్ పెట్టింది. లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చే వారి కోసం రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అలాగే వీరికోసం వెస్ట్రన్ కోర్టు హాస్టల్, హోటల్ అశోకా, ఎం ఎస్ ప్లాట్స్ లలో తాత్కాలిక విడిది ఏర్పాట్లు చేసింది.