బీఆర్కే భవన్‌‌‌‌కు రిపేర్లు షురూ

  • కేసులు విచారణలో ఉండగానే వేగంగా ఏర్పాట్లు
  • వచ్చే వారంలో సెక్రటేరియట్​  షిఫ్టింగ్​ మొదలయ్యే చాన్స్

సెక్రటేరియట్​ షిఫ్టింగ్​ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. బీఆర్కే భవన్ కు శాఖలను తరలించనున్న నేపథ్యంలో అక్కడ మరమ్మతులు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడి శాఖల తరలింపు చివరి దశకు చేరింది. ఖాళీ అయిన 6వ ఫ్లోర్ లో పెయింటింగ్ చేస్తున్నారు. లిఫ్ట్ ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.90 లక్షలు విడుదల చేసింది. ఈ భవనంలో 6 లిఫ్ట్ లు ఉండగా రెండే పనిచేస్తున్నాయి. ఓ లిఫ్ట్ ను వీవీఐపీలకు.. మరో లిఫ్ట్ ను సిబ్బంది, జనం కోసం ఉపయోగిస్తున్నారు. పలు శాఖల ఐఏఎస్ అధికారులు, కార్యదర్శుల కార్యాలయాలు ఇక్కడికి షిఫ్ట్​ కానున్నందున మిగతా లిఫ్ట్ లకు మరమ్మతులు చేస్తున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్​ కోసం కేబుళ్లు, డేటా కోసం ప్రత్యేక సర్వర్లు, సర్వర్ రూమ్, పార్కింగ్ సౌకర్యం కోసం బీఆర్కే భవన్​లో పలు రిపేర్లు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి శాఖల షిఫ్టింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

చివరి దశకు షిఫ్టింగ్

బీఆర్కే భవన్ లోని శాఖల షిఫ్టింగ్ చివరి దశకు చేరింది. 8వ ఫ్లోర్ లోని మైనింగ్ శాఖతోపాటు చేనేత జౌళి శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సామగ్రి తరలింపు శనివారం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో ఫ్లోర్ లోని భూసేకరణ పునరాశ్రయ అధికారిక సంస్థ షిఫ్టింగ్ పక్రియ వచ్చే మంగళవారం వరకు పూర్తవుతుందని సిబ్బంది తెలిపారు. నలుగురు ఈఎన్సీలతో ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ నివేదిక రాకపోవటం వల్లే షిఫ్టింగ్ స్టార్ట్ కాలేదని అసెంబ్లీ లాబీల్లో రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. వారం రోజుల్లో సెక్రటేరియట్ నుంచి శాఖల షిఫ్టింగ్​​ప్రారంభించేందుకు జీఏడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖలవారీగా ఫైళ్ల క్రమ సంఖ్య నోట్ చేసుకోవడం, వాటిని స్కాన్ చేయటం, హార్డ్ డిస్క్ లో సమాచారం నిక్షిప్తం చేసే పక్రియ కొనసాగుతోంది. ఈ ఫైళ్లను బీఆర్కే భవన్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్ షిఫ్టింగ్, కూల్చివేత పై హైకోర్టులో పలు పిటిషన్లు విచారణ లో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి తుది తీర్పులు రాకముందే సెక్రటేరియట్ షిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

Latest Updates