నేటి నుంచి పంచాయతీ కార్యదర్శుల నిరాహార దీక్షలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జీతాల పెంపుపై జీఓ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను  కారోబార్‌‌‌‌, బిల్ కలెక్టర్లతో భర్తీ చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ డిమాండ్‌‌‌‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి 7వ తేదీ వరకు కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలు చేపట్టాలని, 9న కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సు బుధవారం జరిగింది.

యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ‘జీతాలపై జీవో ఇవ్వకుండా సీఎం చేస్తున్న ఉత్తుత్తి ప్రకటనలు కార్మికుల కడుపు నింపవు. 30 రోజుల యాక్షన్ ప్లాన్ ఉన్నందునే సఫాయి కార్మికుల జీతాలు పెంచుతున్నట్టు  ప్రకటన చేశారు. కార్మికులు కోరుకుంటున్నది ప్రకటనలు కావు, జీఓలు. గ్రామ జ్యోతి, మన ఊరు–మన ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ సమయంలోనే కార్మికులు, వారి జీతాలు గుర్తుకొస్తున్నాయి. తర్వాత పట్టించుకోవట్లే. గతంలో రెండు సార్లు ఇలాంటి ప్రకటనలే చేశారు. ఈ సారి నమ్మి మోసపోం.’ అన్నారు. 8 నెలలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న శాలరీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు కలిసి పోరాడాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates