కరోనా గుప్పిట్లో దేశం : రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్లు, కర్ఫ్యూలు

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల్లో మరోసారి లాక్ డౌన్లు, 144సెక్షన్లు అమలవుతున్నాయి. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 90 లక్షల యాభై వేలు దాటగా.. రికవరీ రేటు 93 శాతానికి పైగా ఉంది. అయినా సరే కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోవడంతో దేశంలో ప్రధాన పట్టణాల్లో కరోనాపై ఆంక్షలు మొదలయ్యాయి.  ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, భోపాల్‌ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినం చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

ఢిల్లీలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలు కావడంతో మాస్కు ధరించకపోతే రూ.2 వేల ఫైన్ తో పాటు శుభకార్యాలకు 50 మంది అతిథులకు మాత్రమే అనుమతించింది ప్రభుత్వం .  ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేకున్నా రూల్స్‌ అతిక్రమిస్తే చర్యలు తప్పవని  హెచ్చరించారు.

ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో డిసెంబరు 31 వరకు పాఠశాలలు మూసివేయడం, లోకల్‌ రైళ్ల ప్రయాణాల్ని నిలిపివేస్తున్నట్లు మహరాష్ట్ర సర్కార్ తెలిపింది.

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు. నవంబరు 23 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పరిస్థితుల్లో వాటిని అమలు చేయలేమని తెలిపింది.

 నవంబరు 21 నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ విధిస్తున్నట్లు తెలిపిన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

నవంబరు 21 నుంచి అన్ని జిల్లాల్లో సెక్షన్‌ 144 విధిస్తూ రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్  వెల్లడించారు. జిల్లా పరిపాలనాధికారాలన్నీ జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

 

 

Latest Updates