రూల్స్‌‌ పాటించని ‘సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్’ కంపెనీలు

ఆన్‌‌లైన్‌‌ సెల్ఫ్‌‌ డ్రైవ్‌‌ కార్ కంపెనీలు రూల్స్‌‌ బేఖాతర్‌‌ చేస్తున్నాయి. నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలతో బిజినెస్‌‌ నడిపిస్తున్నాయి. ఈ వ్యవహారం తెలిసినప్పటికీ ఆర్టీఏ అధికారులు ఇప్పటి దాకా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో సర్కార్‌‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం ఎన్నో కంపెనీలు గంటలు, రోజులు, నెలల వారీగా కార్లను రెంటుకు ఇస్తున్నాయి. డ్రైవింగ్ వచ్చిన వారు నచ్చిన కారును ఆన్‌‌లైన్‌‌లో బుక్‌‌ చేసుకొని తీసుకెళ్లొచ్చు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కార్లు ఇలా రెంటుకు నడుస్తున్నాయి. మోటార్‌‌ వెహికల్‌‌ చట్టం ప్రకారం కమర్షియల్‌‌ అవసరాలకు వాహనం ఉపయోగిస్తే ఎల్లో నంబర్ ప్లేట్‌‌ ఉండాలి. నాన్‌‌ కమర్షియల్‌‌ అయితే వైట్ నంబర్‌‌ ప్లేట్ ఉండాలి. అయితే కార్‌‌ రెంట్‌‌ కంపెనీలు రూల్స్‌‌ బ్రేక్ చేస్తూ వైట్‌‌ నంబర్‌‌ ప్లేట్‌‌తోనే వాహనాలు నడిపిస్తున్నాయి.

వైట్‌‌ నంబర్‌‌ ప్లేట్‌‌ వాహనాలు15 ఏళ్లకు ఒకసారి ఫిట్‌‌నెస్‌‌ టెస్ట్‌‌కు వెళ్లాలి. ఎల్లో ప్లేట్‌‌ వాహనాలను ప్రతి రెండేండ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్‌‌నెస్‌‌కు తీసుకెళ్లాలి. నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాల ఇన్సూరెన్స్‌‌ రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే… అదే ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వెహికల్స్‌‌కు ఇన్సూరెన్స్‌‌ రూ.25 వేలకు పైగా ఉంటుంది. కమర్షియల్‌‌ వాహనాలకు ఎక్కువ ట్యాక్స్‌‌ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇవేవీ చెల్లించకుండా కార్‌‌రెంట్‌‌ కంపెనీలు ఆన్‌‌లైన్‌‌లో దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నాయి.

ఆర్టీఏకు పట్టింపేదీ..?

మరోవైపు కార్‌‌ రెంట్‌‌ విధానంతో వేలమంది డ్రైవర్ల ఉపాధికి దెబ్బ పడుతోందని డ్రైవర్లు వాపోతున్నారు. ప్రస్తుతం ఉపాధి అంతంత మాత్రమే ఉందని, ఈ కార్‌‌ రెంట్‌‌ వల్ల మాకు డిమాండ్‌‌ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీలు రూల్స్‌‌ ఉల్లంఘిస్తుంటే ఆర్టీఏ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నాని క్యాబ్‌‌ యూనియన్లు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి దాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అధికారు పనితీరుకు అద్దంపడుతోందని విమర్శిస్తున్నాయి. ఈ విషయంపై జాయింట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కమిషనర్లను సంప్రదించగా తమ పరిధిలో లేదని చేతులు దులుపుకొంటున్నారు.

నిఘా పెట్టి, సీజ్‌‌ చేయాలి..

రాష్ట్రంలో కార్‌‌ రెంట్‌‌ బిజినెల్‌‌ రూల్స్‌‌కు విరుద్ధంగా నడుస్తోంది. కమర్షియల్‌‌ అవసరాలు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలు ఉపయోగించాల్సి ఉన్నా నాన్‌‌ట్రాన్స్‌‌పోర్ట్‌‌ బండ్లనే వాడుతున్నారు. దీనిపై ఆర్టీ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయడం లేదు. ఈ కంపెనీలపై నిఘా పెట్టి, రూల్స్‌‌ పాటించని బండ్లను సీజ్‌‌ చేయాలి.

  – సలావుద్దీన్‌‌, ట్యాక్సీ అండ్‌‌ డ్రైవర్స్‌‌ అసోసియేషన్‌‌ జేఏసీ చైర్మన్‌‌

Latest Updates