సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచయితగా, నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రావి కొండలరావు (88) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయనను హైదరాబాద్  బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపతున్నట్లు సమాచారం.

1932, ఫిబ్రవరి 11న ఈయన శ్రీకాకుళంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కూడా నాటకాలతో పాటు సినిమాలపై ఎక్కువగా ముక్కువ చూపించారు రావి కొండల రావు. ఆ ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చారు. దాదాపు 60 ఏళ్లుగా ఈయన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారు. 1958లో శోభ సినిమాతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది. ఆయన దాదాపు 600 సినిమాల్లో నటించారు.

మద్రాసు ఆనందవాణి పత్రికలో కొంతకాలం పాటు సబ్ఎడిటర్‌గా చేశారు రావి కొండలరావు. కొన్నాళ్ళు రమణ గారింట్లో ఉన్నారు. అలాగే మరికొన్నాళ్ళు కేరళ వెళ్ళి ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. రైటర్ నరసరాజు సిఫారసుతో కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్ ‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు సిఫారసుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.

ఆ తర్వాత నాటి సూపర్ హిట్లయిన దసరా బుల్లోడు, తేనె మనసులు సినిమాల నుంచి నేటి తరంలో కింగ్, వరుడు, ఓయ్ వంటి సినిమాల్లోనూ ఆయన నటించారు. గతంలో భైరవద్వీపం, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు సహనిర్మాతగానూ వ్యవహరించారు. రావి కొండలరావు అర్ధాంగి రాధా కుమారి కూడా తెలుగు నటిగా సుపరిచితురాలు. ఆమె 2012 లో కన్నుమూశారు. వారిద్దరూ భార్యా భర్తలుగా దాదాపు 150 సినిమాల్లో నటించారు.

రావి కొండలరావు మృతిపై తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Latest Updates