రికార్డుల మోతకు బ్రేక్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

 సెన్సెక్స్‌‌కు 248 పాయింట్ల నష్టం

ముంబై : మూడు రోజుల రికార్డుల మోతకు బ్రేక్‌‌ పడింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌‌కు పాల్పడటంతో బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 248 పాయింట్లు నష్టపోయింది. 300 పాయింట్ల మేర పడిపోయిన సెన్సెక్స్ చివరికి, 247.68 పాయింట్ల నష్టంతో 39,502.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 39,420.50 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. బీఎస్‌‌ఈ సెన్సెక్స్ మాదిరి నిఫ్టీ కూడా 67.65 పాయింట్లు నష్టపోయి 11,861.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ప్యాక్‌‌లో ఎస్‌‌బీఐ షేర్లు 3.29 శాతం మేర పడిపోయి బిగ్గెస్ట్ లూజర్‌‌‌‌గా నిలిచాయి. ఎస్‌‌బీఐ తో పాటు టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ షేర్లు కూడా నష్టాలు పాలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు, ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తాజాగా విక్రయిస్తోన్న ఈక్విటీల వల్ల మార్కెట్ నష్టాల బాట పటినట్టు ట్రేడర్స్ చెప్పారు. బ్యాంకింగ్, మెటల్, ఆటో స్టాక్స్‌‌ లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌‌కు పాల్పడినట్టు పేర్కొన్నారు. దీంతో బీఎస్‌‌ఈ మెటల్,ఆటో, బ్యాంకెక్స్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.97 శాతం వరకు నష్టపోయాయి. ఐటీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ట్రేడ్ వార్‌‌‌‌ గ్లోబల్ గ్రోత్‌‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి బంపర్ మెజార్టీతో గెలవడంతో స్టాక్ మార్కెట్ వరుసగా రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే.

3 రోజుల్లో 42 శాతానికి పైగా పతనం…

మన్‌‌పసంద్ బెవరేజస్ షేర్లు మూడు రోజుల్లో 42 శాతానికి పైగా పతనమయ్యాయి. జీఎస్టీ స్కాం ఎఫెక్ట్‌‌తో ఈ కంపెనీ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. రూ.40 కోట్ల జీఎస్టీ కుంభకోణానికి పాల్పడినందుకు గాను కంపెనీ టాప్ మేనేజ్‌‌మెంట్‌‌ను సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం స్టాక్ మార్కెట్ ముగింపులో మన్‌‌పసంద్ షేర్లు బీఎస్‌‌ఈలో 9.94 శాతం నష్టంతో రూ.63.40 వద్ద క్లోజయ్యాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో 10 శాతం నష్టపోయి రూ.63.45 వద్ద ముగిశాయి. మూడు రోజుల్లో బీఎస్‌‌ఈలో 42.36 శాతం మేర నష్టపోయాయి.

Latest Updates