సెన్సెక్స్‌‌కు పండుగే పండుగ

  • బ్రేక్ లేకుండా బుల్ పరుగులు
  • ఆల్‌‌టైమ్ హైలో సెన్సెక్స్​
  • భారీగా విదేశీ నిధుల రాక

సెన్సెక్స్‌‌కి దీపావళి జోష్ కంటిన్యూ అవుతోంది. పండుగ సందడిలా.. ఆ రోజు నుంచి ఇన్వెస్టర్లను దలాల్‌‌స్ట్రీట్ మురిపిస్తూనే ఉంది. వరుసగా ఐదు రోజులు… బ్రేక్ లేకుండా బుల్‌‌ పరుగులు పెట్టింది. గురువారం ఆల్‌‌టైమ్‌‌కి కూడా చేరేసింది. 40,392 వద్ద సెన్సెక్స్ ఆల్‌‌ టైమ్ గరిష్ట మార్క్‌‌ను తాకింది. దసరా నుంచి  సెన్సెక్స్ దాదాపు 2,860 పాయింట్ల మేర పెరగడం విశేషం.

ముంబై : వరుసగా ఐదో రోజు మార్కెట్ పండుగ చేసుకుంది. గ్లోబల్‌‌‌‌గా వస్తోన్న సంకేతాలు బాగుండటం.. ఇండెక్స్‌‌‌‌ల్లోని హెవీ వెయిట్‌‌‌‌ స్టాక్స్‌‌‌‌గా పేరున్న కంపెనీల షేర్లు లాభ పడటంతో మార్కెట్ పైకి ఎగిసింది. అక్టోబర్ నెల చివరి రోజున 40,392 వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని చేరుకున్న సెన్సెక్స్… చివరికి 77.18 పాయింట్ల లాభంతో 40,129.05 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 11,945 పాయింట్లకు చేరుకుంది. చివరికి 33.35 పాయింట్ల లాభంతో 11,877.45 వద్ద ముగించింది. ప్రారంభంలో సెన్సెక్స్ 340 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల వరకు ఎగిసింది. కానీ ట్రేడింగ్ చివరన మాత్రం ప్రారంభ లాభాలు కాస్త తగ్గించుకుంది.  అక్టోబర్ నెల ఎఫ్‌‌‌‌ అండ్ ఓ సిరీస్‌‌‌‌ గడువు తీరుతుండటంతో, చివరి గంట ట్రేడింగ్‌‌‌‌లో మార్కెట్‌‌‌‌ ఒడిదుడుకులకు గురైంది. విదేశీ నిధులు భారీగా మార్కెట్‌‌‌‌లోకి వచ్చాయి.

అక్టోబర్ నెలలో సెన్సెక్స్ 3.8 శాతం, నిఫ్టీ 3.5 శాతం లాభపడ్డాయి.  జూన్ 4న 40,312 వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని చేరుకున్న తర్వాత వంద రోజులకు మళ్లీ సెన్సెక్స్ ఆల్‌‌‌‌ టైమ్ గరిష్ట మార్క్‌‌‌‌ను తాకింది. ఇదంతా కూడా ఇండెక్స్ హెవీ వెయిట్స్ వల్లనే సాధ్యమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 9 శాతం, ఏసియన్ పేయింట్స్ 28 శాతం, హెచ్‌‌‌‌యూఎల్‌‌‌‌  19 శాతం, బజాజ్ ఫైనాన్స్ 15 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు 3.79 శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్‌‌‌‌కు 90.82 పాయింట్ల లాభం అందించింది ఇదే. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌‌‌‌బీఐ షేర్లు కూడా 7.69 శాతం పెరిగాయి. ఓ గ్లోబల్‌‌‌‌ ఇన్వెస్టర్ నుంచి 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,500 కోట్ల) ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫర్ రావడంతో యెస్ బ్యాంక్ షేర్లు భారీగా పెరిగాయి. ఈ బ్యాంక్ షేర్లు 35 శాతం వరకు లాభపడి, చివరికి 24.03 శాతం లాభంతో క్లోజయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలో యెస్ బ్యాంక్ షేర్లే టాప్ గెయినర్. ఎస్‌‌‌‌బీఐ, ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్‌‌‌‌తో పాటు సెన్సెక్స్‌‌‌‌లో టాటా మోటార్స్, హెచ్‌‌‌‌సీఎల్ టెక్ షేర్లు కూడా లాభపడ్డాయి.

వంద రోజుల్లో ఎన్నో సంఘటనలు…

ఈ వంద రోజుల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్‌‌‌‌లో చాలా పరిణామాలే జరిగాయి. జూలైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌‌‌‌లో విదేశీ ఇన్వెస్టర్లకు ఏ మాత్రం నచ్చని పన్ను ప్రకటనలు.. ఆ తర్వాత కార్పొరేట్ వర్గ మెప్పుకోసం ప్రకటించిన ట్యాక్స్ కోత వంటివి చోటు చేసుకున్నాయి. ఈ వంద రోజుల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో యెస్ బ్యాంక్ షేర్లు 62 శాతం, టాటా స్టీల్ షేర్లు 21 శాతం, ఎస్‌‌‌‌బీఐ షేర్లు 20 శాతం, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్ షేర్లు 20 శాతం, ఓఎన్‌‌‌‌జీసీ షేర్లు 17 శాతం, ఇన్ఫోసిస్ షేర్లు 11 శాతం వరకు తగ్గాయి.  జూన్ 4 నుంచి అక్టోబర్ 30 వరకు 100 శాతం ర్యాలీతో బీఎస్‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ టాప్‌‌‌‌ గెయినర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. దీని తర్వాత రెలిగేర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజస్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గార్డెన్ రీచ్, దోలత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు లాభపడ్డాయి. కాక్స్ అండ్ కింగ్స్, హెచ్‌‌‌‌డీఐఎల్, డీహెచ్‌‌‌‌ఎల్‌‌‌‌ఎఫ్, సింటెక్స్ ఇండస్ట్రీస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, కాఫీ డే షేర్లు మాత్రం ఈ వంద రోజుల్లో 85 శాతం నుంచి 99 శాతం వరకు పడిపోయాయి.

వరుసగా మూడోసారి ఫెడ్ రేటు కోత…

క్యూ2 ఫలితాలు, ఫెస్టివల్ సీజన్‌‌లో కన్జూమర్ డిమాండ్ పెరగడం, ఎకానమీకి సపోర్ట్‌‌ చేయడం కోసం ప్రభుత్వ పాలసీలు సెన్సెక్స్‌‌కు పాజిటివ్‌‌గా ఉన్నాయని షేర్‌‌‌‌ఖాన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ సీనియర్ వీపీ, హెడ్ గౌరవ్ దువా చెప్పారు. ఈక్విటీ ఇన్వెస్టర్లపై పన్నులను తగ్గిస్తుందనే అంచనాలతో ఫారిన్ ఫండ్ ఇన్‌‌ఫ్లోస్ కూడా పెరిగాయి. బుధవారం రూ.7,192.42 కోట్ల నిధులను క్యాపిటల్ మార్కెట్‌‌లో ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా మూడో సారి బెంచ్‌‌మార్క్ వడ్డీ రేటును తగ్గించడం కూడా మార్కెట్‌‌లో కొనుగోళ్ల సెంటిమెంట్‌‌ను పెంచింది. ఆసియన్ షేర్లు కూడా లాభాల్లోనే నడిచాయి. హాంకాంగ్, సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌‌గా ముగిశాయి. షాంఘై మార్కెట్ మాత్రం నష్టాల్లో క్లోజైంది.

ఎక్కువ సంపద అందించింది బజాజ్ గ్రూపే..

దేశీయ ఈక్విటీ సూచీలు ఆల్‌‌ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరడంతో, బజాజ్ గ్రూప్ బాగా లాభపడింది. అత్యంత ఎక్కువ సంపద సృష్టించిన గ్రూప్‌‌గా ఇది నిలిచింది. ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు దీని మార్కెట్ విలువ 33.4 శాతం పైకి జంప్ చేసింది. అంబానీ, అదానీ, టాటా గ్రూప్‌‌లను సైతం బజాజ్ గ్రూప్ అధిగమించింది. 2019 తొలి 10 నెలల కాలంలో ఐదు బజాజ్ గ్రూప్ స్టాక్‌‌ల ఇన్వెస్టర్ల సంపద 17 శాతం నుంచి 53 శాతం వరకు పెరిగింది. ఇదే సమయంలో ఆరు అదానీ గ్రూప్ స్టాక్స్ కంబైన్డ్ మార్కెట్ విలువ 19.27 శాతం వరకు ఎగిసింది. విలువ పరంగా చూస్తే.. ముఖేష్ అంబానీ గ్రూప్‌‌కు చెందిన రెండు స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్‌‌‌‌ఐఐఎల్‌‌లు కంబైన్డ్ మార్కెట్ క్యాప్ రూ.2.19 లక్షల కోట్లు పెరిగి రూ.9.30 లక్షల కోట్లకు చేరుకుంది. టాటా గ్రూప్‌‌ 27 స్టాక్స్ విలువ రూ.11.83 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి టాటా గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద రూ.1.34 లక్షల కోట్లు పెరిగింది. తొమ్మిది ఆదిత్య బిర్లా గ్రూప్ స్టాక్స్ మాత్రం రూ.33,042 కోట్ల సంపదను పోగొట్టుకున్నాయి. అనిల్ అంబానీకి చెందిన ఏడీఏజీ గ్రూప్ సంపద కూడా రూ.15 వేల కోట్లు ఆవిరైంది.

Sensex hits all-time high of 40,392, Nifty trading above 11,900

Latest Updates