న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్.. వొడాఫోన్ ఐడియా మాత్రం సూప‌ర్ జంప్

రెండు మూడ్రోజులుగా లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ ఇవాళ న‌ష్టాల్లో స్టార్ట్ అయింది. శుక్ర‌వారం ఉద‌యం ఓపెనింగ్ లోనే 300 పాయింట్ల న‌ష్టంతో 31,896 సెన్సెక్స్ ట్రేడింగ్ మొద‌లైంది. అలాగే నిఫ్టీ 75 పాయింట్ల న‌ష్టంతో 9414 వ‌ద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంత‌ర్జాతీయంగా ప్ర‌తికూల సంకేతాల కార‌ణంగా మార్కెట్లు డౌన్ అయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయి 19వేల దిగువన 18,927.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రెండ్రోజులుగా లాభాల్లో న‌డిచిన యాక్సిస్ బ్యాంక్, బ‌జాజ్ ఫైనాన్స్, ఇండ‌సెండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, ఎస్బీఐ షేర్లు ఇవాళ కిందికి ప‌డిపోయాయి. అలాగే ఇన్ఫోసిస్, టాటా స్టీల్, మారుతీ వంటి కంపెనీలు కూడా న‌ష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

వొడాఫోన్ ఐడియా 14 శాతం జంప్..

స్టాక్ మార్కెట్స్ న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్న స‌మ‌యంలో వొడాఫోన్ ఐడియా షేర్ మాత్రం 14 శాతం పైకి ఎగ‌బాకింది. ఈ కంపెనీలో గూగుల్ పెట్టుబ‌డులు పెట్ట‌బోతోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో పాజిటివ్ గా ట్రేడ్ అవుతోంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల షేర్లు కూడా లాభాల్లో క‌నిపించాయి.

మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్చి క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు శుక్ర‌వారం సాయంత్రం మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన త‌ర్వాత విడుదల కానున్నాయి. క‌రోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జీడీపీ గ్రోత్ భారీగా క్షీణించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. డిసెంబ‌ర్ తో ముగిసిన క్వార్ట‌ర్ లో 4.7 శాతంగా ఉన్న వృద్ధి.. ఇప్పుడు 2.1 శాతానికి ప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజూకు పెరుగుతుండటం, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనాపై అమెరికా ఢీ అంటే ఢీ అంటుండ‌డం మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి.

Latest Updates