బజార్​ బేజార్​..మళ్లీ సెన్సెక్స్‌‌‌‌ డౌన్‌‌‌‌

  • బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌‌‌‌లో ఒత్తిడి
  • 470 పాయింట్లు పతనం
  • తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
  • యెస్ బ్యాంక్ 15.52 శాతం క్రాష్

ముంబై : బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌‌‌‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కిందికి జారాయి. సెన్సెక్స్ 470 పాయింట్ల మేర నష్టపోయింది. ఒకానొక దశలో 626 పాయింట్ల వరకు పడిన సెన్సెక్స్ చివరికి 470.41 పాయింట్ల నష్టంతో 36,093.47 వద్ద క్లోజైంది. ఇంట్రాడే కనిష్ట స్థాయిగా 35,987.80 మార్కును తాకింది.   నిఫ్టీ కూడా 135.85 పాయింట్ల నష్టంతో 10,704.80 వద్ద క్లోజైంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా తగ్గిపోయాయి. పన్ను వసూళ్లు తగ్గడం మార్కెట్‌‌‌‌పై ప్రభావం చూపింది. సెప్టెంబర్ 17 వరకు పన్ను వసూళ్లు కేవలం  4.7 శాతమే పెరిగాయి. ఫుల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో పన్ను వసూళ్లు 17.5 శాతం పెంచుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. పన్ను వసూళ్లు తగ్గడంతో ఎకనామిక్ స్లోడౌన్‌‌‌‌ మరింత పెరుగుతుందని భయాందోళనలు  వ్యక్తమవుతున్నాయి.  ఆల్టికో డిఫాల్ట్ కావడం, బ్యాంక్‌‌‌‌లకు క్రెడిట్ నెగిటివ్‌‌‌‌కు దారి తీస్తుందని మూడీస్ రిపోర్ట్ చెప్పడంతో యెస్ బ్యాంక్ షేర్లు భారీగా 15.52 శాతం పడిపోయాయి.

రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఇది బాగా రుణాలిచ్చిన విషయం తెలిసిందే. ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌లు కూడా ఈ రంగానికి రుణాలిచ్చాయి. ఈ బ్యాంక్‌‌‌‌ల షేర్లు గురువారం ట్రేడింగ్‌‌‌‌లో 3.59 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌లో టాటా స్టీల్, మారుతి, ఎస్‌‌‌‌బీఐ,ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్, టెక్ మహింద్రా, ఓఎన్‌‌‌‌జీసీ, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, టీసీఎస్ షేర్లు కూడా 3.66 శాతం వరకు పడిపోయాయి. మరోవైపు గ్లోబల్‌‌‌‌గా ఆయిల్ ధరలు తగ్గినా.. ఇండియన్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. ఆర్థిక వృద్ధి అంత బాగా లేకపోవడంతో సెంటిమెంట్ స్తబ్దుగానే ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.అమెరికా ఫెడరల్ రిజర్వ్‌‌‌‌ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారినట్టు విశ్లేషకులు చెప్పారు.  2008 నుంచి వడ్డీ రేట్లను ఈ మేర తగ్గించడం ఇది రెండోసారి. బుధవారం కేబినెట్‌‌‌‌ మీటింగ్ అనంతరం ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రకటనలు ఇన్వెస్టర్లను పెద్దగా మెప్పించలేకపోవడం కూడా సెంటిమెంట్‌‌‌‌ను దెబ్బతీసింది. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుండటంతో, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఈ మీటింగ్‌‌‌‌లో ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌పై ఉన్న జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. అదేవిధంగా హోటల్స్, సిమెంట్, స్టీల్, శానిటరీ వేర్స్ వంటి ప్రొడక్ట్‌‌‌‌లపై కూడా జీఎస్టీ కౌన్సిల్ రేట్లను తగ్గించనుందనే అంచనాలున్నాయి.

తగ్గిన మార్కెట్ క్యాప్…

తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్ల సంపద కూడా అలానే తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్‌‌‌‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్‌‌‌‌ క్యాపిటలైజేషన్ రూ.1,65,437.91 కోట్లు తగ్గిపోయి రూ.1,38,54,439.41 కోట్లకు చేరుకుంది. ఎఫ్‌‌‌‌ఐఐల అమ్మకాలు కొనసాగడం, ఫెడ్‌‌‌‌ రేట్ల తగ్గింపు, ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్లోడౌన్‌‌‌‌ వంటివి మార్కెట్‌‌‌‌ను కిందకు పడేశాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.

సిగరెట్ షేర్లకు 3 శాతం నష్టం…

ఈ–సిగరెట్లను బ్యాన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడంతో బుధవారం ర్యాలీ జరిపిన సిగరెట్ల షేర్లు కూడా గురువారం కిందకు పడిపోయాయి. గాడ్‌‌‌‌ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ కంపెనీల షేర్లు 3 శాతం వరకు నష్టపోయాయి. గాడ్‌‌‌‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు 2.81 శాతం, ఐటీసీ షేర్లు 3.5 శాతం వరకు నష్టాలు పాలయ్యాయి. అయితే మరో రెండు పొగాకు కంపెనీల స్టాక్స్‌‌‌‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. గోల్డెన్ టుకాబో షేర్లు  4.19 శాతం, వీఎస్‌‌‌‌టీ ఇండస్ట్రీస్ షేర్లు 0.21 శాతం పెరిగాయి.

 

దేశీయ స్టాక్ మార్కెట్‌‌‌‌లో నెలకొన్న అమ్మకాల తాకిడితో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు నష్టపోయింది. 10 పైసలు బలహీనపడిన రూపాయి 71.34 వద్ద క్లోజైంది. 71.36 వద్ద ప్రారంభమైన రూపాయి 71.06 వద్ద గరిష్ట మార్క్‌‌‌‌ను,71.37 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.

బంగారం ధర తగ్గింది

న్యూఢిల్లీ : ఈ మధ్యన భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధానిలో రూ.270 తగ్గి రూ.38,454 వద్ద రికార్డైంది.  బంగారానికి బలహీనమైన ఇన్వెస్ట్‌‌మెంట్ సెంటిమెంట్‌‌ ఉండటంతో ధరలు తగ్గినట్టు హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యురిటీస్ సీనియర్ ఎనలిస్ట్(కమోడిటీస్) తపన్ పటేల్ అన్నారు. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌లో కూడా బంగారం ధరలు ఫ్లాట్‌‌గా ఒక ఔన్స్‌‌కు 1,497 డాలర్లుగా నమోదయ్యాయి. ఒక ఔన్స్‌‌కు1,500 డాలర్ల కంటే తక్కువగా స్పాట్ గోల్డ్ ధరలు ట్రేడింగ్ అవడంతో దేశీయంగా కూడా గోల్డ్ ధరలు తగ్గినట్టు పేర్కొన్నారు. మరోవైపు వెండి ధరలు కూడా కేజీకి రూ.380 తగ్గి రూ.47,310గా నమోదయ్యాయి.

Latest Updates