అమావాస్య రోజు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తం?

వచ్చే నెల 11న ముహూర్తం ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్
ఆ రోజు అమావాస్య కావడంతో సెంటిమెంట్ ఇబ్బంది
డేట్ మార్చాలంటూ పలువురు కార్పొరేటర్ల డిమాండ్

హైదరాబాద్,వెలుగు: బల్దియా పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా..! మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా.. లేదా..!! ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా మరో తేదీన కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారా..!!!  అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు గతేడాది డిసెంబర్ 1న నిర్వహించగా,  అదే నెల 4న రిజల్ట్​వచ్చింది. గెలుపొందిన కొత్త కార్పొరేటర్లు వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశించారు. కానీ వారి ఆశలపై ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. రిజల్ట్​ వచ్చిన రెండు నెలల తర్వాత కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ఫిబ్రవరి 11న ఉదయం11 గంటలకు ముహూర్తం ఫిక్స్​ చేసింది. అయితే ప్రమాణస్వీకారం చేసేందుకు చాలామంది కార్పొరేటర్లు ఇష్టపడడంలేదు. అదే రోజు అమావాస్య కావడంతో వద్దంటూ పలువురు కార్పొరేటర్లు కోరుతున్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా తేదీని ప్రకటిస్తూ తమ సెంటిమెంట్​పై దెబ్బకొడుతుందని అంటున్నారు.  ఏ చిన్న శుభకార్యమైనా అమావాస్య రోజు నిర్వహించరని,  అలాంటప్పుడు కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేయిస్తరా ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు అదేరోజు చేస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. వారు మాత్రం వేదపండితులతో ముహూర్తాలను చూపించుకుంటారని, తమను అమావాస్య రోజున ప్రమాణం చేయించాలని చూడటం సరికాదంటున్నారు.

మేయర్, డిఫ్యూటీ మేయర్

ఎన్నికైనా ఉంటుందా…

కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం అనంతరం అదే రోజు మధ్యాహ్నం 12: 30నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుందా ? లేక తేదీని ఏమైనా మారుస్తారా? అనేది హాట్ టాఫిక్ అయింది. ఒకవేళ మారిస్తే గనుక అమావాస్యే కారణం కానుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేయరు. దీంతో  ఈ తేదీపై కొందరు కార్పొరేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత  వస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి ఫూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో  మేయర్ ఎన్నికపై కూడా ఉత్కంఠత నెలకొంది. టీఆర్ఎస్​ 56, బీజేపీ 48, ఎంఐఎం 44,కాంగ్రెస్​2 సీట్లు గెలుపొందాయి. అయితే బీజేపీ తరపున గెలిచిన  లింగోజిగూడ కార్పొరేటర్ ఆకస్మిక మృతితో ఆ పార్టీ సంఖ్య 47కి చేరింది.

డేట్​ మార్చాలె

ఎన్నికల రిజల్ట్​వచ్చిన రెండు నెలలకు చేయిస్తున్న ప్రమాణ స్వీకారం కూడా మంచి ముహూర్తానికి కాదు.  ఏ చిన్న శుభకార్యమైనా చేయాలంటేనే ఎన్నో ముహూర్తాలు చూస్తాం. అలాంటిది కార్పొరేటర్​ గా ప్రమాణ స్వీకారం అమావాస్య నాడు  ఎలా చేస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించి ప్రమాణ స్వీకారం తేదీని ఒక రోజు ముందైనా, లేదా ఫిబ్రవరి12న నైనా నిర్వహించాలి.

 – దేవర కరుణాకర్, గుడిమల్కాపూర్​కొత్త కార్పొరేటర్

వారైతే చేస్తరా..?

అమావాస్య రోజు ప్రమాణం చేయించేందు కు ఎలక్షన్​ కమిషన్​ డేట్​ని ఫిక్స్​ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ విధంగా చేస్తోంది.  అదే అమావాస్య రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ప్రమాణం చేస్తారా ?  కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఎప్పుడో గెలిచిన మమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత కూడా మంచి ముహూర్తం లేకుండా ప్రమాణం చేయిస్తామనం మంచిది కాదు. డేట్​ని మార్చాలె.

      – బి.పద్మావెంకట్​రెడ్డి,బాగ్ అంబర్ పేట్ ​కొత్త కార్పొరేటర్

Latest Updates