గుడి మెట్లపై బిచ్చమెత్తి.. రూ. 8 లక్షల విరాళం

బిచ్చగాళ్లు అనగానే చిన్నచూపు ఉంటుంది. బిచ్చమెత్తుకుంటూ ఎవరైనా ఎదురుపడితే కొందరు చిరాకుగా చూస్తారు. కానీ, గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడే ఓ ఆలయానికి ఏకంగా 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అతడు ఇచ్చిన ఆ డబ్బుతో గుడిని అభివృద్ధి చేయడంతో పాటు ఓ గోశాల కూడా నిర్మించామని చెబుతున్నారు ఆలయ అధికారులు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 73 ఏళ్ల యాదిరెడ్డి అనే వృద్ధుడు అక్కడ ఓ సాయిబాబా గుడికి ఏడేళ్లుగా విరాళాలు ఇస్తున్నాడు. గతంలో రిక్షా తొక్కి జీవనం సాగించిన ఆయన ముసలితనం కారణంగా మోకాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు రావడంతో దేవాలయాల దగ్గర బిచ్చమొత్తుకోసాగాడు. ఇలా వస్తున్న డబ్బులన్నీ తనకు అవసరం లేదని, తన తిండి ఖర్చులకు పోనూ మిగిలినదంతా సాయిబాబా ఆలయానికి ఇచ్చేస్తున్నానని చెబుతున్నాడు.

‘‘యవ్వనంలో ఉండగా 40 ఏళ్ల పాటు రిక్షా తొక్కి జీవనం బతుకుబండిని నడిపా. వయసు పెరిగే కొద్దీ శరీరం సహకరించక తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చమెత్తుకుంటున్నా. నాకు డబ్బులు వెనకేసుకోవాలన్న ఆశ లేదు. తినడానికి ఉంటే చాలు. ఏడేళ్ల క్రితం ఒకసారి వచ్చిన డబ్బులో రూ.1 లక్ష సాయిబాబా గుడికి విరాళంగా ఇచ్చా’ అని చెప్పాడు యాదిరెడ్డి.

ఆలయానికి డబ్బు విరాళం ఇచ్చిన తర్వాత తన ఆదాయం మరింత పెరిగిందని తెలిపాడు యాది రెడ్డి. గుడికి డబ్బులు ఇచ్చిన విషయం తెలిశాక చాలా మంది తనను గుర్తుపడుతున్నారని, వాళ్లంతా ఇస్తున్న డబ్బంతా తానేం చేసుకుంటానని అంటున్నాడు. తనకు వచ్చే డబ్బంతా దేవుడికే ఇచ్చేస్తానని చెబుతున్నాడు. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ఒక మొత్తంగా కూడబెట్టి గుడికి అందజేస్తున్నానని తెలిపాడు.

Septuagenarian beggar donates Rs 8 lakh to temple in Vijayawada

ఆలయ అధికారులు కూడా యాది రెడ్డిని మెచ్చుకుంటున్నారు. ఆయన చేసిన సహాయంతో గుడిలో చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆలయానికి అనుబంధంగా ఓ గోశాల కూడా నిర్మించామని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన రూ.8 లక్షలు ఇచ్చాడని తెలిపారు. దేవుడిపై ఆయనకు ఉన్న భక్తి భావానికి ఇది నిదర్శనమని, అయితే తాము ఎవరినీ విరాళాలు ఇవ్వాలని అడగమని, భక్తులే తమ శక్తి కొద్ది ఇస్తుంటారని చెప్పారు ఓ అధికారి.

Latest Updates