వింబుల్డన్: సెమీఫైనల్స్ కు సెరెనా 12వ సారి

అమెరికా వెటరన్‌‌‌‌ స్టార్‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో 12వ సారి వింబుల్డన్‌‌‌‌ మహిళల సింగిల్స్‌‌‌‌ సెమీఫైనల్స్‌‌‌‌ చేరింది. 24 గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌తో మార్గరెట్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ పేరిట ఉన్న రికార్డు సమం చేయడానికి రెండు విజయాల దూరంలో నిలిచింది.  మహిళల సింగిల్స్‌‌‌‌ విభాగంలో మంగళవారం జరిగిన క్వార్టర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో సెరెనాతో పాటు విజయాలు సాధించిన సిమోనా హలెప్‌‌‌‌(రొమేనియా),  స్వితోలినా(ఉక్రెయిన్‌‌‌‌), బార్బొర స్ట్రికోవా(చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌) కూడా సెమీస్‌‌‌‌ చేరారు. 37 ఏళ్ల సెరెనా క్వార్టర్స్‌‌‌‌లో 6–4, 4–6, 6–3తో  అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అలిసన్‌‌‌‌ రిస్క్‌‌‌‌(అమెరికా)పై పోరాడి గెలిచింది.11వ సీడ్‌‌‌‌ సెరెనాకు వింబుల్డన్‌‌‌‌లో ఇది 97వ విజయం. ఈ మ్యాచ్‌‌‌‌లో 19 ఏస్‌‌‌‌లు సంధించిన సెరెనా రెండు అనవసర తప్పిదాలు చేసింది. మరో వైపు యాష్లే బార్టీకి షాకిచ్చి క్వార్టర్స్‌‌‌‌ చేరి సెరెనాకు సవాల్‌‌‌‌ విసిరిన అలిసన్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో ఒకేఒక్క ఏస్‌‌‌‌ కొట్టి, ఆరు అనవసర తప్పిదాలు చేసింది. ఇంకో మ్యాచ్‌‌‌‌లో మాజీ వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌,  ఏడో సీడ్‌‌‌‌ సిమోనా హలెప్‌‌‌‌ 7–6(7–4), 6–1తో  జాంగ్‌‌‌‌ షుయ్‌‌‌‌(చైనా)పై విజయం సాధించింది. ఓ దశలో 1–4తో వెనకబడ్డ హలెప్‌‌‌‌ పుంజుకుని మ్యాచ్‌‌‌‌ గెలిచింది. వింబుల్డన్‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌ చేరడం హలెప్‌‌‌‌కు ఇది రెండో సారి. మరో మ్యాచ్‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌ స్వితోలినా 7–5, 6–4తో కరోలినా ముచోవా(చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌)పై సునాయాస విజయం సాధించి సెమీస్‌‌‌‌ చేరగా. ఇంకో మ్యాచ్‌‌‌‌లో బార్బొర స్ట్రికోవా 7–6(7–5), 6–1తో 17వ సీడ్‌‌‌‌ కొంటా(బ్రిటన్‌‌‌‌)పై గెలిచి సెమీఫైనల్‌‌‌‌ చేరింది.

సెరెనాకు ఫైన్‌‌‌‌..

సెరెనా విలియమ్స్‌‌‌‌కు వింబుల్డన్‌‌‌‌ నిర్వాహకులు మంగళవారం పది వేల అమెరికన్‌‌‌‌ డాలర్ల జరిమానా విధించారు. ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో భాగంగా టోర్నీ జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్‌‌‌‌ క్లబ్‌‌‌‌లోని కోర్ట్‌‌‌‌ను  రాకెట్‌‌‌‌తో కొట్టి స్వల్పంగా ధ్వంసం చేసింది. దీంతో సెరెనా ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపిన అధికారులు క్రమశిక్షణ చర్యల కింద జరిమానా విధించారు.

Latest Updates