విషాదం.. అనుమానాస్పద స్థితిలో సీరియల్ నటి మృతి

హైద‌రాబాద్: తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. గత నాలుగు రోజులుగా శాంతి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్నవెంట‌నే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, శాంతి మృతి చెందిన విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతి ఎలా చనిపోయిందనే దానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఆమెది హత్యా..? ఆత్మహత్యా.? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. శాంతి స్వ‌స్థ‌లం వైజాగ్‌. ఆమె పలు సీరియల్స్‌లో నటించారు.

Latest Updates