నగల కోసం నలుగుర్ని హత్య చేసిన సీరియల్​ కిల్లర్​

Serial killer who murdered four people for jewelry in mahabubnagar
  • మహబూబ్​నగర్​లో భార్యాభర్తల ఘాతుకాలు
  • కల్లు తాగడానికి వచ్చే మధ్య వయసు మహిళలే టార్గెట్​

మహబూబ్​నగర్​ రూరల్​, వెలుగు: కల్లు తాగడానికి వచ్చే మహిళలే అతడి టార్గెట్​. ముందు మాట కలుపుతాడు. మాయమాటలు చెప్పి నమ్మిస్తాడు. కలిసి కల్లు తాగుతాడు. వాళ్లు కొంచెం మత్తులోకి జారగానే బైకుపై ఎవరూ లేని ప్రదేశాలకు తీసుకెళతాడు. చంపేసి వాళ్ల ఒంటి మీదున్న నగలను దోచేస్తాడు. వాటిని తెచ్చి భార్యకు ఇస్తాడు. ఆమె వాటిని అమ్మి డబ్బు తీసుకొస్తుంది. ఈ తరహాలోనే నలుగురిని చంపేసి నగలు దోచాడు మహబూబ్​నగర్​కు చెందిన ఎరుకలి శ్రీను. ప్రస్తుతం పోలీసులకు దొరికి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ వివరాలను మహబూబ్​నగర్​ ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం వెల్లడించారు. నేరాలకు సహకరించిన అతడి భార్య సాలమ్మనూ అరెస్ట్​ చేశారు.

బాలానగర్​ మండలం గండీడ్​కు చెందిన శ్రీను మద్యానికి బానిసై విలాసాలకు అలవాటు పడ్డాడు. అయితే, అప్పటికే నేర చరిత్ర ఉన్న అతడు డబ్బు సంపాదించేందుకు మధ్య వయసున్న మహిళలను టార్గెట్​ చేశాడు. మహబూబ్​నగర్​లోని శివశక్తి నగర్​లో ఉంటూ, కల్లు దుకాణాలకు వచ్చే ఆడవాళ్లపైనే టార్గెట్​ చేసేవాడు. మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లి చంపేసి నగలు, నగదు దోచుకునేవాడు. ఈ నెల 16న దేవరకద్ర మండలం డోకూరు గ్రామం వద్ద నవాబుపేట మండలం కుచ్కల్​ గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళను హత్య చేశాడు. భూత్పూర్​ మండలం కర్వెన గ్రామానికి చెందిన అంచె బాలమ్మ (45), కొత్తకోట అప్పరాల గ్రామానికి చెందిన ఒక మహిళ, మడ్జిల్ మండలం కొత్తపల్లి వాగులో ఇంకో మహిళను హత్య చేసి నగలు దోచుకున్నాడు. వాటిని అమ్మేందుకు అతడి భార్య సాలమ్మ సాయపడేది. నలుగురి నుంచీ దోచుకున్న నగల్లో దాదాపు రూ.లక్ష విలువైన బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనును ఏ1గా, భార్య సాలమ్మను ఏ2 నిందితులుగా కేసు నమోదు చేశారు.  మహిళలు, యువతులు, విద్యార్థినులు కొత్త వ్యక్తులను నమ్మొద్దని ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. జిల్లా వ్యాప్తంగా చీకటి ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు, కరెంట్​ ఏర్పాటు చేస్తామన్నారు.

Serial killer who murdered four people for jewelry in mahabubnagar

Latest Updates