ఈ ట్యాక్సీవాలా.. మానవత్వానికి ప్రతిరూపం

సాయమంటూ ఎవరు పిలిచినా  పరుపరుగున అక్కడికి చేరుకుంటాడు.  రోజంతా సంపాదించిన ఐదూ పది వాళ్ల చేతికిచ్చి ధైర్యం చెప్తాడు. అంతటితో ఊరుకోకుండా, ఉరువాడా మొత్తం తిరిగి వాళ్లకోసం డబ్బు పోగుచేస్తాడు. గూడు లేక ఎండనక, వాననక ఇబ్బందులు  పడే వాళ్ల కోసం దగ్గరుండి ఇళ్లుకట్టిస్తాడు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఉన్నదంతా పోగేసి సాయం చేస్తాడు. అలాగని పెద్ద ధనవంతుడేం కాదు ఒక మాములు మధ్యతరగతి ట్యాక్సీ డ్రైవర్​. తనకున్నంతలోనే నలుగురికీ సాయపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఈ 61 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్​ పేరు వర్గీస్​ జోసఫ్​ తోంపిలేతు. 25 సంత్సరాలుగా కొన్ని వేల కుటుంబాలని ఆర్థికంగా ఆదుకున్న ఈయన గురించి  మరిన్ని విషయాలు…

తన స్వార్థాన్ని పక్కనపెట్టి ఎన్నో కుటుంబాలకి అండగా నిలిచిన వర్గీస్​ జోసఫ్​ సొంత రాష్ట్రం కేరళ. పేదరికం కారణంగా చిన్నతనం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాడు జోసఫ్​. తన  కడుపునింపడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాల్ని దగ్గర్నుంచి చూశాడు. పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసి వాళ్లని ఆర్థికంగా నిలబెట్టాలని  చిన్నప్పట్నుంచి కలలు కన్నాడు. కానీ, పేదరికం అతని  చదవుకి  అడ్డుకట్ట వేసింది. దాంతో చేసేందేంలేక ఇరవైయేళ్ల వయసులో ట్యాక్సీ డ్రైవర్​గా మారాడు. కొన్నేళ్ల పాటు కారుని అద్దెకి తీసుకుని నడిపి నాలుగు డబ్బులు పోగయ్యాక సొంతంగా వెహికిల్​ కొనుకున్నాడు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నాళ్లకే ఆ కారు అమ్మి మళ్లీ  ఇతరుల బండ్లకి డ్రైవర్​గా మారాడు. ఆ ట్యాక్సీ తోలే క్రమంలో కంటపడిన కొన్ని దృశ్యాలే జోసఫ్​ని సోషల్​ సర్వీస్​ వైపు నడిపించాయి.

ఏదైనా చేయాలనుకున్నాడు

ట్యాక్సీ డ్రైవర్​ అవడం వల్ల  ఎప్పుడూ రోడ్లపై  కారుతో పరుగులు పెట్టేవాడు జోసఫ్​. రోజుకి సిటీ అంతా రెండుమూడు రౌండ్లు  వేసేవాడు. ఆ క్రమంలో సరైన గూడులేక ఇబ్బందులు పడుతున్నవాళ్లు తరచూ కంటపడేవాళ్లు. ఎండకి, వానకి పిల్లలు పడే అవస్థలు చూసి చలించిపోయాడు జోసఫ్​. మొదట్లో అలాంటి వాళ్ల తారసపడ్డప్పుడు  వందోరెండొందలో  చేతిలోపెట్టేవాడు. కానీ, రానురాను వాళ్ల సమస్యలకి తనిచ్చే డబ్బు ఏమాత్రం సరిపోవడంలేదని తనలోతానే దిగులుపడ్డాడు. వాళ్లకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. మురికివాడల్లో తిరిగి చేతిలో  డబ్బులేక ఇంటి నిర్మాణాన్ని మధ్యలో వదిలేసిన వాళ్లకి సాయం చేయడం మొదలుపెట్టాడు. తన కుటుంబ  అవసరాలకి సరిపడా డబ్బులుంచుకుని  మిగిలిన సంపాదనంతా  పేదలకి ఇళ్లు కట్టడానికి ఉపయోగించాడు.

సాయం అందించారు

డీజిల్ ఖర్చులకి తోడు అద్దె ట్యాక్సీ అవడంతో రోజుకి మూడొందలు మాత్రమే చేతికొచ్చేవి జోసఫ్​కి. ఆ డబ్బులో  ఒక ఇల్లు పూర్తి చేయడానికి మూడునాలుగేళ్లు  పట్టింది. అలాంటి ఇళ్లు  తన చుట్టు పక్కల ఏరియాలో కొన్ని వందలు ఉండటంతో ఫండ్స్​ రైజ్​ చేయడం మొదలుపెట్టాడు జోసఫ్​. స్కూల్స్​​, కాలేజీలకి వెళ్లి విద్యార్ధుల్ని తమకు చేతనైనంత సాయం చేయమని అడిగాడు. వాళ్లంతా పాజిటివ్​గా రెస్పాండ్​ అయ్యి తోచినంత సాయం చేసేవాళ్లు. పేదలకోసం జోసఫ్ చేస్తున్న మంచి పనుల్ని గమనించి కొందరు ఇరుగుపొరుగు వాళ్లు కూడా సహకరించారు. కొన్ని సంస్థలు కూడా జోసఫ్​ ఆలోచనలకి అండగా నిలిచాయి. దాంతో గడిచిన 25 ఏళ్లలో దాదాపు 30కి పైగా ఇళ్లు కట్టడంలో హెల్ప్​ చేశాడు ​జోసఫ్​.

ఇవే కాదు

కేవలం ఇళ్ల నిర్మాణాలే కాదు ఎవరికి ఏ ఆపద వచ్చినా  ముందుంటాడు జోసఫ్​. ఆర్థిక సమస్యల వల్ల మెడికల్​ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్న వాళ్లకి కూడా అండగా ఉంటాడు.  రీసెంట్​గా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 16 ఏళ్ల అమ్మాయి కోసం రెండ్రోజుల్లో ఆరులక్షల యాభై వేలు కలెక్ట్​ చేశాడు జోసఫ్. అంతేకాదు కొన్ని వందలమంది పిల్లల్ని చదివిస్తున్నాడు కూడా. ఆర్థిక స్తోమత వల్ల ఆడపిల్ల పెళ్లి చెయ్యలేకపోతున్న  తల్లిదండ్రులకి కూడా అండగా నిలుస్తున్నాడు..

ఇదే ముఖ్యం

వందరూపాయలతో మన కడుపునిండుతుందంటే రెండువందల రూపాయలు జేబులో ఎందుకు. ఆ డబ్బుతో  మరొకరి ఆకలి తీర్చొచ్చు, చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడే ఓ ప్రాణాన్ని కాపాడొచ్చు. పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయొచ్చు.  ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేస్తే పేదవాళ్లకి ఆకలి చావులు కాస్తయినా తగ్గుతాయి. అందుకే  నా అవసరాలకి సరిపడా ఉంచుకుని మిగతాదంతా అవసరం ఉన్నవాళ్లకి ఇస్తున్నా. సాయం అందుకున్నప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే సంతోషం కొన్ని కోట్లు పెట్టినా కొనలేం అంటున్నాడు జోసఫ్​.

Latest Updates