అధిక ఫీజులు వ‌సూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల‌ యజమాన్యాలు ఎట్టి పరిస్థితిలో ఫీజులు పెంచరాదని, లాక్ డౌన్ నేప‌థ్యంలో
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన స‌మీక్ష‌లో.. అధిక ఫీజులు వసూలు చేస్తే ఆయా పాఠ‌శాల‌ల యొక్క‌ ప్రభుత్వ అనుమతుల రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామ‌ని  ప్రయివేటు పాఠశాలలను ఆమె హెచ్చ‌రించారు. సంవత్సరం ఫీజులు ఒకేసారి చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేయవద్దన్నారు. కోవిడ్19 కారణంగా తల్లిదండ్రులు అదాయాన్ని కోల్పోయిన సందర్బంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులు తమ విలువైన సమయం కోల్పోకుండా 6 నుండి 10వ తరగతి వరకు టిసాట్ ద్వారా డిజిటల్ పాఠాలు ప్రసారమ‌వుతాయ‌ని మంత్రి తెలిపారు. టీ శాట్‌ ద్వారా రోజుకో సబ్జెక్ట్‌ డిజిటల్‌ పాఠాల బోధన జరుగుతుందన్నారు. www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఈ-పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ నెల 21 నుండి ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టు కు సంబంధించిన డిజిటల్ పాఠాలు ప్రసార‌మ‌వుతాయ‌న్నారు.

Latest Updates