నిండా ముంచిన వారే నష్టాలను భరించాలి

sfio-recommends-action-against-auditors-action-for-recovery-of-losses
  • నిందితుల నుంచే వసూలు చేయాలి
  • ఆడిటర్ల పని పట్టండి
  • వారిపై కఠిన చర్యలు తీసుకోండి
  • అంతర్గత విచారణకుఆదేశించండి
  • ఐఎల్‌ఎఫ్‌ఎస్‌‌ కేసులో ఎస్‌‌ఎఫ్‌ఐఓ సిఫార్సులు

ఐఎల్‌ ఎఫ్‌ ఎస్‌ ను నిండా ముంచిన మేనేజ్‌మెంట్‌ మాజీ సభ్యుల నుంచి, ఆడిటర్ల నుంచి నష్టాల మొత్తాన్ని వసూలు చేయాలని, కంపెనీల చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ ఎఫ్‌ ఐఓ ప్రభుత్వానికి సూచించింది. అక్రమాలను గుర్తించడంలో ఆలస్యం ఎందుకు అయిందో తెలుసుకోవడానికి ఆర్‌‌బీఐ విచారణ అవసరమని, ఇక నుంచి ఇలాంటి కుంభకోణాలు జరగకుండా చూడడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది.

న్యూఢిల్లీ:ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లీజింగ్‌‌ అండ్‌‌ ఫైనాన్సియల్‌‌ సర్వీసెస్‌‌ (ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌) కుంభకోణం కేసులో మరో ట్విస్ట్‌‌! కంపెనీ దివాలా తీయడానికి కారకులైన ఆడిటర్లపై, మేనేజ్‌‌మెంట్‌‌ మాజీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీరియస్‌‌ ఫ్రాడ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీస్‌‌ (ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరి నుంచి నష్టాల మొత్తాన్ని రాబట్టాలని స్పష్టం చేసింది. ఎస్ఎఫ్‌‌ఐఓ ఈ కేసులో ఇది వరకే పలువురిపై కేసులు నమోదు చేయడమేగాక కంపెనీ మాజీ బాసులను కూడా అరెస్టు చేయడం తెలిసిందే. లోపాలను గుర్తించడంలో ఎందుకు ఆలస్యం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్‌‌బీఐతో అంతర్గత విచారణ జరిపించాలని కూడా కోరింది. కంపెనీని నిండా ముంచిన మాజీ బాసులపై కంపెనీ చట్టం ప్రకారం ప్రస్తుత యాజమాన్యం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ అనుబంధ సంస్థ ఐఎఫ్‌‌ఐఎన్‌‌లో భారీ కుంభకోణానికి తొమ్మిది మంది కోటరీయే కారణమని ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ మొదటి చార్జిషీట్‌‌లో స్పష్టంగా తెలిపింది. వీళ్లు ఆడిటర్లతో, కొందరు ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లతో కుమ్మక్కయి మోసాలు చేశారని ఆరోపించింది. ఐఎఫ్‌‌ఐఎన్‌‌ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపిన ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ.. మిగిలిన సబ్సిడరీల్లో అక్రమాలపైనా దర్యాప్తు జరుపుతోంది. ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌కు ప్రస్తుతం 93 వేల కోట్ల అప్పులు ఉన్న సంగతి తెలిసిందే.

ఆర్‌‌బీఐ హెచ్చరిస్తే బాగుండేది..

‘‘ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్‌‌బీఐ 2015లోనే హెచ్చరించింది. ఐఎఫ్‌‌ఐఎన్‌‌లో రూల్స్‌‌ను అతిక్రమించారని తెలిపింది. నెట్‌‌ ఓన్డ్‌‌ ఫండ్స్‌‌ లెక్కలు కూడా సరిగ్గా లేవని స్పష్టం చేసింది. అయితే జరిమానాలు మాత్రం విధించలేదు. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ఆర్‌‌బీఐ అప్పుడే తగిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేదే కాదు. అక్రమాలను గుర్తించడంలో ఆలస్యం ఎందుకు అయిందో తెలుసుకోవడానికి ఆర్‌‌బీఐ అంతర్గత విచారణ అవసరం. ఇక నుంచి ఇలాంటి కుంభకోణాల జరగకుండా నిరోధించడానికి ఆర్‌‌బీఐ తగిన విధాన నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ పేర్కొంది.

నేషనల్‌‌ ఫైనాన్సియల్‌‌ రిపోర్టింగ్‌‌ అథారిటీ (ఎన్‌‌ఎఫ్‌‌ఆర్‌‌ఏ), ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ చార్టర్డ్‌‌ అకౌంటెంట్స్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఐసీఏఐ) ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. అక్రమాలకు సహకరించిన బీఎస్‌‌ఆర్‌‌ అండ్‌‌ అసోసియేట్స్‌‌ ఎల్‌‌ఎల్‌‌పీ, డెలాయిట్‌‌, హాస్కిన్స్‌‌ అండ్‌‌ సెల్స్‌‌కు ఇక నుంచి ఆడిటింగ్‌‌ బాధ్యతలు అప్పగించకూడదని స్పష్టం చేసింది. లిక్విడిటీ లేక బకాయిలు చెల్లించలేకపోవడంతో గత ఏడాది తొలిసారిగా ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌లో కుంభకోణం బయటపడింది. ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ తొలిసారిగా  ముంబైలోని ప్రత్యేక కోర్టులో గత శుక్రవారం చార్జిషీట్‌‌ వేసింది. 30 మంది మేనేజ్‌‌మెంట్‌‌ సభ్యులు, ఆడిటర్లు నేరాలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది.   వీరిలో కంపెనీ మాజీ వైస్‌‌ చైర్మన్‌‌ హరి శంకరన్‌‌, ఐఎఫ్‌‌ఐఎన్‌‌ ఎండీ రమేశ్‌‌ బవా, డైరెక్టర్లు రవి పార్థసారథి, వైభవ్‌‌ కపూర్‌‌, కె.రామ్‌‌చంద్‌‌, ప్రముఖ వ్యాపారవేత్త సి.శివశంకరన్‌‌ కూడా ఉన్నారు. హరి, రమేశ్‌‌ను చాలా రోజుల క్రితమే ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ అరెస్టు చేయడం తెలిసిందే. నిందితులతో కుమ్మక్కయిన ఆడిటర్లు  ఖాతాలను తారుమారు చేసి, సమాచారాన్ని దాచిపెట్టారని అధికారులు ఆరోపించారు. ఉదయన్‌‌ సేన్‌‌, కల్పేశ్‌‌ మెహతా, సంపత్‌‌ గణేశ్‌‌ అనే ఆడిట్‌‌ పార్ట్‌‌నర్లతోపాటు ఆడిటింగ్‌‌ కమిటీ సభ్యులను, ఇండిపెండెంట్‌‌ డైరెక్టర్లను, శివ గ్రూప్‌‌ కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. ఇండియన్‌‌ పీనల్‌‌ కోడ్‌‌, కంపెనీల చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టారు. నేరపూరిత కుట్ర, మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌లో కుంభకోణం బయటపడ్డాక మార్కెట్లో లిక్విడిటీ సంక్షోభం తలెత్తింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ప్రముఖ బ్యాంకర్‌‌ ఉదయ్‌‌ కోటక్‌‌ నేతృత్వంలో కొత్త బోర్డును నియమించింది. అక్రమాల నిగ్గు తేల్చడానికి ఎస్‌‌ఎఫ్‌‌ఐఓను రంగంలోకి దింపింది. సంక్షోభం తలెత్తబోతుందన్న విషయం ఐఎల్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ యూనిట్ మేనేజ్‌‌మెంట్‌‌కు ముందే తెలుసని ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ ప్రకటించింది.

‘‘ఐఎల్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ అనుబంధ విభాగం ఐఎఫ్‌‌ఐఎన్‌‌.. శివ, ఏబీజీ, ఏ2జెడ్‌‌, పార్శ్వనాథ్‌‌ గ్రూప్‌‌ వంటి కంపెనీలకు భారీగా లోన్లు ఇచ్చింది. వీరిలో చాలా మంది అప్పులు చెల్లించలేదు. ఈ విషయం యాజమాన్యానికి తెలుసు. సీనియర్‌‌ అధికారులు ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వలేదు. ఈ అప్పులను మొండిబకాయిలుగా చూపకుండా ఆపేందుకు కుట్రపన్నారు. అసలు, వడ్డీ చెల్లించడానికి అవే కంపెనీలకు మళ్లీ అప్పులిచ్చారు. తనఖాగా ఏమీ పెట్టుకోకుండా లోన్లు మంజూరు చేశారు. ఇంత జరిగినా ఆడిటర్లు హెచ్చరించలేదు” అని ఎస్​ఎఫ్​ఐఓ స్పష్టం చేసింది.

Latest Updates