ప్రభుత్వ నిర్ణయంపై SGTల ఆగ్రహం

  • భాష పండిట్ లను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కు మారుస్తూ GO

తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా భాష పండితులను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కి మారుస్తానన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఈ నిర్ణయం భాషా పండితులకు మేలు చేస్తుందని ప్రభుత్వం  భావించింది. కానీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎస్జీటీలు కోల్డ్ వార్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 3న ఇచ్చిన జీవో నెంబర్ 17, 18 ద్వారా 2 వేల 487 భాషా పండితులు, వెయ్యి 47 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసింది. అప్పట్లో ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐతే దీనిపై కొందరు టీచర్లు హై కోర్టుకు వెళ్లడంతో కొన్ని మార్గదర్శకాలను హై కోర్టు కొట్టివేసింది. దీంతో ఆ పోస్టుల అప్ గ్రేడేషన్ నిలిచిపోయింది. ఇక తాజాగా జీవో నెంబర్ 15 ద్వారా మరో 6 వేల 143 పండితులు, 802 పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్  చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 8 వేల 630 భాషా పండిట్ గ్రేడ్ 2 పోస్టులు గ్రేడ్ 1 కి అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్  గ్రేడ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఐతే ఈ పోస్టులను భర్తీ చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ, తెలుగు లాంగ్వేజ్ లపై ట్రైనింగ్ ఉన్న తమకు రెండు దశాబ్ధాలుగా అన్యాయం జరుగిందని..తెలంగాణ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరిగిందంటున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 10 వేల మంది భాషా పండితులకు సమాన పనికి సమాన వేతనం దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వాల హాయాంలో 25 సంవత్సరాలు తమకు అన్యాయం జరిగిందంటున్నారు భాషా పండిట్స్. తెలుగు ప్రపంచ మహా సభల్లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని..రాబోయే సర్వీస్ రూల్స్ లోనూ తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పదోన్నతుల విషయంలోనూ తమకు ఇంక్రిమెంట్స్ పెరుగుతాయని ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఎస్జీటీలు ఎన్ని అడ్డంకులు తలపెట్టినప్పటికీ..ప్రభుత్వం భాషకే పట్టం కట్టిందంటున్నారు.

సెకండరీ గ్రేడ్ టీచర్స్ తామూ ఎవరికీ వ్యతిరేకం కాదంటున్నారు. పండిట్ లను ఉద్దేశించి ఇచ్చిన జీవోతో పదొన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు ఎస్జీటీలు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోతే…న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

Latest Updates