సామాన్య ప్రజల పట్ల కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది

క‌రీంన‌గ‌ర్: తెలంగాణకు చెందిన ఒక వీరుడు అమరుడైతే ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంత గౌరవం ఇచ్చారో అర్థం అవుతుందన్నారు కాంగ్రెస్ నేత‌, మాజీమంత్రి ష‌బ్బీర్ అలీ. శుక్ర‌వారం కామారెడ్డి జిల్లాలోని సత్య గార్డెన్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా నిరుపేదలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్ చైనా బార్డర్లో 20 మంది సైనికులు మృత్యువాత పడటం బాధాకరమైన విషయం అన్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతి చెందితే.. గవర్నర్ లాంటి వాళ్ళు స్వయంగా వెళ్లి నివాళులర్పించినా ..సీఎం కేసీఆర్ కు మాత్రం సమయం లేదన్నారు ష‌బ్బీర్ అలీ.

హరికృష్ణ, విజయనిర్మల లాంటి సినిమా వాళ్ళు చనిపోతే.. గంటల తరబడి సమయం కేటాయించిన సీఎంకు, సైనికుని కోసం సమయం దొరకలేదన్నారు. ఎంతటి వారికైనా కరోనా వస్తే, గాంధీకి వెళ్లాలని సూచించిన కేసీఆర్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా వస్తే యశోధకు పంపిస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజల పట్ల కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ధి ఉందొ తెలుస్తుందన్నారు.
ప్రాణహిత చేవెళ్ల పథకం కోసం 6 సంవత్సరాలలో 211 కోట్లు చెల్లించారని..ఇంకా 100 సంవత్సరాలు అయినా ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా లేదన్నారు. లక్ష 80 వేలతో కాళేశ్వరం చేపట్టినా.. ఒక్క ఎకరానికి నీరివ్వని కేసీఆర్, కేవలం 2 వేల కోట్ల నిధుల ప్యాకేజి 20, 21, 22కు కేటాయిస్తే 2 లక్షల ఎకరాలకు నీరందించి చూపిస్తామ‌న్నారు.

ప్రాణహిత చేవెళ్ల పథకం పూర్తి చేయడమే నా చిరకాల కోరికని.. 2 లక్షల ఎకరాలకు నీరిచ్చిన తర్వాతనే తుదిశ్వాస వదులుతాన‌న్న ష‌బ్బీర్ అలీ.. దానికోసం ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా అన్నారు. రాష్ట్రంలో ఇంకా 36 శాతం రైతులకు రైతుబంధు అందలేదని.. రైతులకు విత్తనాలు సకాలంలో అందక ప్రైవేట్ వ్యక్తుల వద్ద విత్తనాలు కొంటున్నారని తెలిపారు. ఆ విత్తనాలు నకిలివని తేలితే, మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. పదిహేను వందల కరోనా సహాయం అందించి.. విద్యుత్ బిల్లుల ద్వారా వడ్డీ వ్యాపారానికి సీఎం కేసీఆర్ తెరలేపారన్నారు ష‌బ్బీర్ అలీ.

Latest Updates