మాన‌వ‌త్వం చాటుకున్న పోలీస్

ఓ హెడ్ కానిస్టేబుల్ మాన‌వ‌త్వం చాటుకున్నారు. రోడ్డుపై ఉన్నటువంటి అనాథ వ్యక్తికి తాను తెచ్చుకున్న భోజనాన్ని తినిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్ర‌కాశ్.. శుక్రవారం రాత్రి కరోనా మహమ్మారిని అరికట్టడానికి మండల పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నాడు. రాత్రి తాను తెచ్చుకున్న భోజనాన్ని తిందామని రోడ్డు పక్కనే గల షాపు ముందుకు వెళ్ళాడు.

కానీ అక్కడ ఓ అనాథ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అక్కడికి వెళ్లిన ప్రకాష్ ఆ వ్యక్తిని అన్నం తిన్నావా అని అడుగగా.. అతను రెండు రోజుల నుండి భోజనం చేయలేదని తెలిపాడు. వెంట‌నే ప్రకాష్ తాను తెచ్చుకున్న భోజనాన్ని ఆ వ్యక్తికి తినిపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి పోలీస్, డాక్టర్లు ఇంటికి వెళ్లకుండా రాత్రింబ‌ళ్ళు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి స‌మ‌యంలో తాను తిన‌కుండా అనాథ క‌డుపు నింపిన‌ ప్రకాష్ ను శామీర్ పేట‌ పోలీసులు, పట్టనవాసులు అభినందించారు.

Latest Updates