దోపిడి.. రూ.850 టెస్టుకు రూ.4 వేలు

  • టెస్టింగ్ సెంటర్ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రైవేట్ ల్యాబ్ కు పని అప్పగించి..పట్టించుకుంటలే

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టుల పేరుతో శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో ప్యాసింజర్లను దోచుకుంటున్నారు. రూ.850 విలువైన కరోనా ఆర్టీపీసీఆర్‌‌ టెస్టుకు రూ.4,200 వసూలు చేస్తున్నారు. ఫారిన్ నుంచి వస్తున్నోళ్లు కచ్చితంగా కరోనా టెస్టు చేయించుకొని, నెగెటివ్ వస్తేనే ఇంటికెళ్లాలి. లేదంటే వారం పాటు హోటల్‌‌ క్వారంటైన్‌‌లో ఉండాలని రూల్ ఉంది. ప్రతిరోజు వివిధ దేశాల నుంచి వందలాది మంది శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టుకు వస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో, ప్రైవేట్ ల్యాబే ప్యాసింజర్లకు దిక్కయింది. ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడున్న ప్రైవేట్‌‌ ల్యాబ్ లో టెస్టు చేయించుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. ఇదే అదునుగా ల్యాబ్ మేనేజ్ మెంట్ ఒక్కో ప్యాసింజర్ నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం రూ.4,200 వసూలు చేస్తోంది. 3 నుంచి 5 గంటల వ్యవధిలో రిపోర్టు ఇస్తోంది.

యాంటీజెన్ కూడా చేస్తలే…

ఎయిర్‌‌‌‌పోర్టులో ఆరోగ్య శాఖ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ, వారంతా కేవలం స్ర్కీనింగ్‌‌కే పరిమితమయ్యారు. యాంటీజెన్‌‌ టెస్టులు చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదు. మొబైల్ టెస్టింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేయడం లేదు. రోజుకు వేల సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే సత్తా ఉందని సర్కారే చెబుతోంది. సౌలతులు ఉన్నప్పటికీ, ఎయిర్‌‌పోర్టులో టెస్టులను ప్రైవేట్‌‌ల్యాబ్ కు ఎందుకు అప్పగించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రూ.850కే ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్ చేయాలని జీవో ఇచ్చిన సర్కార్‌‌‌‌, ఆ జీవోను ఉల్లంఘిస్తున్న టెస్టింగ్‌‌ సెంటర్‌‌‌‌పై చర్యలు తీసుకోకపోవడంపై ఆరోగ్యశాఖ సిబ్బందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం ఈ ప్రైవేట్‌‌ ల్యాబ్ ను మంత్రి ఈటల రాజేందరే ప్రారంభించారు. ఇక క్వారంటైన్ వసతి కల్పిస్తున్న హోటళ్లు కూడా భారీగా వసూలు చేస్తున్నాయి. వారానికి రూ.8 వేల నుంచి రూ.15 వేలు డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న కార్మికులు ఈ చార్జీలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా..తాము ఏమీ చేయలేకపోతున్నామని ఎయిర్‌‌‌‌పోర్టులో డ్యూటీ చేస్తున్న హెల్త్ స్టాఫ్‌‌ తెలిపారు.

Latest Updates