వీడిన శంషాబాద్ మహిళ మర్డర్ మిస్టరీ

shamshabad-woman-murder-case-mystery-solved
  • ఈ నెల 11న బండరాయితో కొట్టి హత్య
  • నిందితుడిని అరెస్టు చేసిన ఆర్జీఐఏ పోలీసులు

శంషాబాద్,వెలుగు:తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మీడియా సమావేశంలో ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్, సీఐ రామకృష్ణ వివరాలను వెల్లడించారు. ఫరూక్ నగర్ కు చెందిన వల్లెపు శ్రీను(42) శంషాబాద్ లో ఉంటూ ప్లాస్టిక్ సామాన్లు, కాగితాలు ఏరి అమ్మేవాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పద్మమ్మ అలియాస్ కోటమ్మ తన భర్తతో గొడవలు రావడంతో శంషాబాద్ కు వచ్చి అక్కడే ఉంటోంది. కోటమ్మకు శ్రీనుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్నిరోజులుగా సహజీవనం చేస్తున్నారు.

శ్రీను, కోటమ్మ మధ్య కూడా తరచూ గొడవలు జరిగేవి. దీంతో కోటమ్మను ఎలాగైనా చంపాలని శ్రీను ప్లాన్ వేశాడు. ఈ నెల 11న మద్యం తాగిన శ్రీను..కోటమ్మను మెహిదిగార్డెన్ వద్ద గల స్మశానానికి కాగితాలు ఎరుదామని తీసుకెళ్లాడు. అక్కడ బండరాయితో కోటమ్మ తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం కోటమ్మ డెడ్ బాడీని ముళ్లపొదల్లో పడేసి శ్రీను అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన మందుబాటిల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ మందు బాటిల్ ను శ్రీను రాళ్లగూడలోని సప్తగిరి వైన్స్ లో కొన్నట్టు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. గురువారం శ్రీను శంషాబాద్ లోని లేబర్ అడ్డా దగ్గర ఉండగా..పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కోటమ్మను తానే హత్య చేసినట్టు విచారణలో శ్రీను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీనుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు.

Latest Updates