ఎ షార్ట్ ఫిలిం బై శంక‌ర‌య్య‌

Shankaraiah who has 60 plus Directing Telugu Short Films

శంకరయ్య… అరవై ఏళ్ల వయసులో కెమెరా పట్టాడు. సమాజం ఆలోచించేలా సందేశాత్మక చిత్రాలు తీస్తున్నాడు. ప్రతిభకు వయసు అడ్డు కాదని నిరూపిస్తు న్నాడు. లేటు వయసులో షార్ట్  ఫిలిం తీయడమే ఒక విశేషం అయితే..అది ‘ఉత్తమ సందేశాత్మక చిత్రం’గాగుర్తింపు పొందడం మరో విశేషం. ఇంతకీ శంకరయ్య తీసిన షార్ట్​ ఫిలిం ఏంటి? ఈవయసులోనూ షార్ట్​ ఫిలిం తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..?

శంకరయ్యది నల్లగొండ జిల్లా, నార్కట్​పల్లి మండలం గోపాలపల్లి. చదివింది పదో తరగతి. అయినా సామాజిక విలువలు బాగా తెలిసినవాడు. సాధారణరైతు. చిన్నప్పుడే వీధి నాటకాలపై ఇష్టం పెంచుకున్నాడు. ఎక్కడ  నాటకాలు వేస్తే… అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అలా నాటకాలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. నాటకాలు చూసి స్టేజీ ఆర్టిస్టుగా మారాడు. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే నాటకాలు వేసేవాడు. మూఢ నమ్మకాలు, సామాజిక స్థితిగతులపై  నాటకాలు వేసి సమాజ నిర్మాణంలో తన వంతు పాత్ర  పోషించాడు. ఆ తర్వాత నాటకాలు కనుమరుగు కావడంతో  కుటుంబం, వ్యవసాయ పనులకు పరిమితమయ్యాడు. దురదృష్టవశాత్తు పక్షవాతం బారిన పడి, కొన్నాళ్లు మంచం పట్టాడు. కొడుకులు ట్రీట్​మెంట్​ ఇప్పించడంతో రోగం నయమైంది. అయినా నాటకాలపై మనసు చంపుకోలేదు. 45 రోజులపాటు కఠిన ఉసవాస దీక్ష చేసే అయ్యప్ప స్వాముల గురించి ‘అయ్యప్పఅందరివాడు’,  బావా మరదళ్ల చిలిపి ఆటలు, పడుచు పిల్లల కొంటె ప్రేమను గుర్తు చేసే ‘ఏం పోరి’ ఆల్బమ్స్​ తీశాడు.

ఆల్బమ్స్​ తీసిన శంకరయ్య మనసు అప్పట్నించి షార్ట్​ఫిలిం ​ వైపు మళ్లింది. ప్రేమ కారణంగా తల్లిదండ్రులను దూరంచేసు కోవడం ఏమిటి?  ప్రేమతో ఒక్కటైన ప్రేమికులు చిన్న చిన్న తగాదాల వల్ల విడిపోతే? అనుకోని సంఘటనలు ఏమైన జరిగితే ‘వారి భవిష్యత్తు ఏమవుతుంది’… ఇవన్నీ శంకరయ్యను ఆలోచిం పజేసాయి. చుట్టుపక్కల ఊళ్లలో పదిహేను కుటుంబాలు అధ్యయనం చేశాడు. ఒక కథ రాసుకున్నాడు. షార్ట్​ ఫిలిం తీయాలనుకున్నాడు. అనుకున్న వెంటనే లక్షరూపాయలు ఖర్చు  చేసి మరి ‘ఓ యువత ఆలోచించాలి’ షార్ట్​ ఫిలిం తీశాడు.

కథేంటంటే…

అయనో ఉన్నతాధికారి. ఇద్దరు బిడ్డలు. చిన్న కూతురు సువర్ణ.  రాజు అనే వ్యక్తి ఆ ఇంట్లో డ్రైవర్ . అటు అధికారికి, ఇటు కుటుంబ పనుల్లో ఆసరాగా ఉంటాడు రాజు. కూతురు సువర్ణను ప్రతిరోజు కాలేజీ దగ్గర డ్రాప్​ చేసే వాడు. ఈ క్రమంలో సువర్ణ డ్రైవర్ ను ప్రేమిస్తుంది. రాజు కూడా సువర్ణను ఇష్టపడతాడు. ఇదే విషయం తండ్రికి చెప్పడంతో ‘డ్రైవర్ తో పెళ్లా.. నేనుచచ్చినా ఒప్పుకోను’ అంటూ కరాఖండీగా చెప్తాడు. అంతే ఆ మరుసటి రోజే సువర్ణ డ్రైవర్ తో పారిపోయి పెళ్లి చేసుకుంటుంది. తండ్రి మాత్రం కూతురు జ్ఞాపకాలతోను బతుకుతుంటాడు. కొన్నాళ్ల తర్వాత సువర్ణకు ఇద్దరు పిల్లలు పుడతారు. జీవితం సాఫీగా సాగిపోతున్న క్రమంలో అనుకోని ఒక కుదుపు.

సువర్ణ, పిల్లలను బైక్ పై తీసుకెళ్తున్న రాజు రోడ్డు ప్రమాదంలోమరణిస్తాడు. దాంతో సువర్ణ, పిల్లలు రోడ్డున పడతారు. సువర్ణ మానసికంగా కుంగిపోతుంది. రోడ్డుపై బతుకీడుస్తుంది. పిల్లలు అనాథలవుతారు. ఒక్క సువర్ణే కాదు.  ప్రేమ పెళ్లి చేసుకునే యువత అనుకోని ఘటనల వల్ల తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి వె ళ్లలేక మనోవేదన పడుతున్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలు కూడా అనాథలవుతున్నారు. ఈ వ్యవస్థ మార్పు కు పెద్దలు, పిల్లలుఆలోచిం చాలనే ప్రయత్నమే ఈ షార్ట్​ ఫిలిం.

ఉత్తమ చిత్రంగా..

మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ ‘జిల్లా ఫిలిం అసొసియేషన్ ’ లఘు చిత్రాల ఎంట్రీలను ఆహ్వానించింది. ఈ పోటీల్లో దేశగాని శంకరయ్య తీసిన షార్ట్​ఫిలిం ‘ఉత్తమ సందేశాత్మక చిత్రం’గా ‘ఓ యువత ఆలోచించాలి’ నిలిచింది. ఎంతోమంది కవులు, ప్రజాప్రతినిధులు శంకరయ్యను సన్మానిం చారు. “నాటకాలు నా జీవితంలో భాగమయ్యాయి. దాంతో తెలియకుం డా సినిమాలపై ఆసక్తి పెరిగింది. సినిమా కలను నిజం చేసుకునేందుకు ఈ షార్ట్​ఫిలిమ్స్​ తీస్తు న్నా. ‘ఓ యువత ఆలోచించాలి’ లాంటి సందేశాత్మక కథలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. త్వరలో వాటన్నిం టినీ లఘు చిత్రాలుగా మారుస్తా”అంటాడు శంకరయ్య.

Latest Updates