బీజేపీతో అజిత్ మంతనాలు ముందే తెలుసు

తెరవెనుక సంగతులు బయటపెట్టిన శరద్ పవార్​

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు దాదాపు నెలరోజులపాటు సాగిన హైడ్రామాపై ఎన్సీపీ చీఫ్ శరద్​ పవార్ తొలిసారి నోరువిప్పారు. మంగళవారం ఓ ఇంగ్లీష్​ చానెల్​తో మాట్లాడిన ఆయన తెరవెనుక రాజకీయాలను పూసగుచ్చినట్లు వివరించారు. బీజేపీతో అజిత్ పవార్ టచ్‌లో ఉన్నాడన్న సంగతి ముందే తెలుసని, హిందుత్వ పార్టీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనుకోలేదని పవార్ చెప్పారు. ‘‘అసెంబ్లీ రిజల్ట్​ను బట్టి మేం(ఎన్సీపీ–కాంగ్రెస్) ప్రతిపక్షంలోనే కూర్చో వాలని డిసైడయ్యాం . సీఎం సీటు విషయంలో బీజేపీతో గొడవపడ్డ శివసేన.. చివరికి తెగదెంపులు చేసుకుంటుందని మాత్రం నేను ఊహించలేదు. సేనతో పొత్తు పై కాంగ్రెస్ తర్జనభర్జన పడినా, సెక్యూలర్ హామీతో ముందుకొచ్చింది. ఆ రెండు పార్టీలూ నా మాటను గౌరవిస్తాయి. అయితే నవంబర్ 22న జరిగిన చర్చలో మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతలు మంకుపట్టు పట్టారు. కోపంతో నేను మీటింగ్ నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత అజిత్ పవార్‌కు కాంగ్రెస్ నేతలకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ‘ఇలాగైతే ఐదేండ్లు ప్రభుత్వాన్ని నడపటం కష్టం’ అంటూ అజిత్ కూడా బయటికెళ్లాడు. అదే రోజు రాత్రి బీజేపీ నేత ఫడ్నవిస్‌తో అజిత్ ఫోన్​లో మాట్లాడిన సంగతి నాకు తెలిసింది. తెల్లారేసరికల్లా సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారాలు జరిగిపోయాయి. గుసగుసల సంగతి ముందే తెలిసినా, అజిత్ ఇంత దూరం వెళతాడని మాత్రం నేను ఊహించలేకపోయా. ఆ తతంగానికి నా అనుమతి లేదని తెలిసిన వెంటనే ఎమ్మెల్యేలందరూ ఇంటికి తిరిగొచ్చారు . ప్రస్తుతం కూటమినేతలందరూ అజిత్‌ను గౌరవిస్తున్నారు. తను మళ్లీ తప్పు చేయడనే అనుకుంటున్నా” అని పవార్ వివరించారు.

మోడీ ఆ మాట చెప్పలేదు
మహారాష్ట్రలో బీజేపీతో ఎన్సీపీ కలవడమనే ఆప్షన్​పైనా చాలా రకాల ప్రయత్నాలు జరిగాయని శరద్​ పవార్ చెప్పారు. రైతు సమస్యలపై ప్రధాని మోడీతో నేను భేటీ కావడానికిముందే చాలా మంది బీజేపీ నేతలు తనతో మాట్లాడారని, ‘పవార్ కు రాష్ట్రపతి పదవి లేదా సుప్రియా సూలేకు కేంద్ర కేబి నెట్ లో చోటు’ అంటూ ఏవేవో ఊహాగానాలొచ్చాయని గుర్తుచేశారు. ప్రధాని మోడీతో చర్చలో మాత్రం ఈ అంశా లేవీ ప్రస్తావనకు రాలేదని, మహారాష్ట్రలో సపోర్ట్​ ఇవ్వండన్నమాట మోడీ అనలేదని ఎన్సీపీ చీఫ్ చెప్పారు. ‘‘జాతీయ రాజకీయాల్లో సహకరించాలని మాత్రమే మోడీ అడిగారు. ఐడియాలజీలు వేరు కాబట్టి అది కుదరదని చెప్పేశా. మహారాష్ట్ర వరకు బీజేపీతో కంటే శివసేనతో కలిసి పనిచేయడం చాలా ఈజీ. థాక్రే ఫ్యామిలీతో నాకున్న అనుబంధం అలాంటిది” అని పవార్ తెలిపారు.

Latest Updates