‘ఇంట్లోనే ఉండండి..’ కోమాలో ఉండి కోలుకున్న మ‌హిళ‌

  •  కరోనాను జయించిన అమెరికా మహిళ
  •  9 రోజులు వెంటిలేటర్ పై, మరో 9 రోజులు ఐసీయూలో
  •  పరిస్థితిని అర్థం చేసుకోవాలని నిరసనకారులకు సూచన

మాడిసన్ (అమెరికా): అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కరోనాను జయించింది. 9 రోజులు కోమాలో ఉండి కోలుకుంది. తాను ఎలా బతికి బయటపడింది ఫేస్ బుక్ లో పోస్టులో వెల్లడించింది. లే బ్లూంబర్గ్ (35) అనే మహిళకు మార్చి 19న ఫ్లూ సింప్టమ్స్ కనిపించాయి. తర్వాత బాడీ పెయిన్స్ మొదలయ్యాయి. తర్వాత రుచి, వాసన చూసే గుణం కూడా కోల్పోయింది. కనీసం బాత్ రూమ్ కు కూడా వెళ్లే ఓపిక లేకపోవడంతో చివరకు భర్తకు విషయం చెప్పింది. వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించగా, ఆమెకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని డాక్టర్లు గుర్తించారు. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్ మెంట్ అందజేశారు.

నడవడం నేర్చుకుంటున్నా…

‘‘9 రోజులు మెడికల్లీ ఇండ్యూస్డ్​ కోమాలో ఉన్నాను. వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్ మెంట్ ఇచ్చారు. మరో 9 రోజులు ఐసీయూలో ఉన్నాను. నిజానికి ఇప్పుడు నేను మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను. రెండు వారాలు బెడ్ పైనే ఉండడంతో కండరాల క్షీణత వ్యాధి వచ్చింది. ఇప్పుడు నేను స్నానం చేయడానికి 45 నిమిషాలు పడుతోంది” అని బ్లూంబర్గ్ ఫేస్ బుక్ పోస్టులో తన ఆవేదనను పంచుకున్నారు.

కంప్లయింట్స్ కాదు.. థ్యాంక్స్ చెప్పండి

‘‘నేను బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.మీరందరూ ఇంట్లోనే ఉండండి. సేఫ్ గా ఉండండి. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ పాటించండి” అని బ్లూంబర్గ్ నిరసనకారులకు సూచించారు. అమెరికాలో లాక్ డౌన్ విధించడంపై చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిబంధనలు సడలించాలని, బిజినెస్ లు ఓపెన్ చేయాలని విస్కాన్సిన్ ప్రజలు గవర్నర్ ను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బ్లూంబర్గ్ నిరసనకారులకు మెసేజ్ ఇచ్చారు. ‘‘ఈ వ్యాధి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మీరు అర్థం చేసుకోవడం లేదు. గవర్నమెంట్ మన సంపాదన కోసం కాకుండా మన ఆరోగ్యం కోసం ఆలోచిస్తోంది. గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకుని ఇంట్లోనే ఉండండి. కంప్లయింట్స్ చేయడం మానేసి, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి” అని బ్లూంబర్గ్ అన్నారు. ‘‘మీరు హాస్పిటల్ పాలైతే మనీ ఎలా సంపాదిస్తారు. పైగా మెడికల్ బిల్లులతో మీరు మరింత అప్పు చేయాల్సి వస్తుంది. ఓ ఐదారంకెల బిల్లు కట్టాల్సి వస్తే.. అది ఇప్పుడున్న పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది’’ అని బ్లూంబర్గ్ హెచ్చరించారు.

Latest Updates