ఆకలి బాధకు పసిగుడ్డును అమ్మాలనుకుంది

ఆకలి బాధకు పసిగుడ్డును అమ్మాలనుకుంది

ఇద్దరు పిల్లల కడుపు నింపలేక నెల రోజుల పాపను అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చిందా తల్లి. వచ్చిన డబ్బులు కనీసం పెద్దపాపకైనా ఉపయోగపడతాయని భావించింది. రూ. 20 వేలకు పాపను ఇచ్చేస్తానని.. తీసుకోమని ఇంటింటికి తిరిగి ప్రాధేయపడింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన గంగ జ్యోతి(23)కి అదే గ్రామంలో మేస్ర్తీ పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన నవీన్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు  ఐదేళ్ల  క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నవీన్, గంగజ్యోతి దంపతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో కూలి పని చేసుకుంటూ నివసించారు. నవీన్ మద్యానికి బానిసై  ప్రతిరోజు భార్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. వీరికి మొదటి సంతానంగా నేహా(5) జన్మించింది. పాప పుట్టిన రెండు నెలలకే నవీన్ ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి రూ.2 లక్షలకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి గంగజ్యోతి ఒప్పుకోలేదు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత సంవత్సరం గంగజ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. 5 నెలల గర్భంతో ఉన్నప్పుడు నవీన్ భార్య, కూతురును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటి నుంచి గంగజ్యోతి కూతురు నేహాతో ఆర్మూర్ బస్టాండ్ లో భిక్షాటన చేస్తూ.. అదే బస్టాండ్​లో రాత్రికి తలదాచుకుంటోంది. నెల రోజుల క్రితం ఆర్మూర్ బస్టాండ్​లోనే ప్రసవించింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు తాగించడానికి డబ్బులు లేక అవస్థలు పడింది. ప్రయాణికుల వద్ద బిక్షాటన చేస్తూ అలాగే కాలం వెళ్లదీస్తోంది. బిక్షాటనతో ఇద్దరు పిల్లల పోషణ భారమైంది. మూడు రోజుల నుంచి గంగజ్యోతితో పాటు కూతురు నేహా కేవలం నీళ్లు తాగి ఆకలితో అలాగే ఉంటున్నారు.  పసిబిడ్డకు హోటళ్లలో ప్రాధేయపడి పాలు అడిగి తాగిపించింది.  బిక్షాటనతో ఇద్దరు పిల్లలను పోషించలేనని, పసిబిడ్డను అమ్మి వచ్చిన డబ్బుతో పెద్దమ్మాయిని పోషించుకుంటానని, పసిబిడ్డకు ఓ మంచి ఇల్లు దొరుకుతుందని నిర్ణయించుకుంది. ఆదివారం మెట్ పల్లి పట్టణంలోని కళానగర్ లో పాపను రూ. 20 వేలకు అమ్ముతానని ఇంటింటికి తిరిగి చెప్పింది. ఎవరైనా కొనుక్కోవాలని ప్రాధేయపడింది. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై కిరణ్ కుమార్ గంగజ్యోతి, పిల్లలను పోలీస్​స్టేషన్ కు తరలించారు. ఐసీడీఎస్, సఖి ఆఫీసర్లకు సమాచారం అందించారు. కొన్ని గంటలవరకు సదరు శాఖ ఆఫీసర్లు స్పందించకపోవడంతో పోలీసులు వారి వాహనంలో జగిత్యాల ఐసీడీఎస్ కు తీసుకెళ్లి అప్పగించారు. పసిపాప అమ్మకంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.