ఐదో సారి నేపాల్ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడు

ఐదో సారి నేపాల్ ప్రధానిగా కాంగ్రెస్ అధ్యక్షుడు

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు 74 ఏళ్ల షేర్ బహదూర్ దేవ్‌బా  ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) ప్రకారం నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే వివరాలను మాత్రం తెలిపలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్‌బా పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈయన ఇప్పటికే నాలుగుసార్లు నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలను నిర్వహించారు. తాజాగా ఐదోసారి కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ దేవ్‌బా ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సుప్రీం కోర్టు రాష్ట్రపతి బిద్యా దేవి భండారీని సోమవారమే ఆదేశించింది.

గతేడాదిలో నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సిఫారసుతో.. రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంటును రద్దుచేశారు. పార్లమెంటును రద్దు చేస్తూ రాష్ట్రపతి బిద్యాదేవీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం తప్పుబట్టింది. తిరిగి పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశాలను జారీ చేసింది. చివరకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో నేపాల్‌ ప్రధానిగా షేర్‌ బహదూర్‌ దేవ్‌బా నియమితులయ్యారు.