ధవన్‌‌ దంచాల్సిందే..ఇవాళ శ్రీలంకతో రెండో టీ20

టీ20 వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా ఫైనల్‌‌ ఎలెవన్‌‌ ఎలా ఉండాలి? ప్రస్తుతానికి దీనిపై పెద్ద చర్చ అవసరం లేకపోయినా.. ఓపెనింగ్‌‌ విషయంలో మాత్రం కోహ్లీకి తలనొప్పులు తప్పేలా లేవు..! ఎందుకంటే రోహిత్‌‌ టీమ్‌‌లోకి వస్తే.. అతనికి జతగా రాహుల్‌‌, ధవన్‌‌లో ఎవర్ని ఎంచుకోవాలి? గాయాల నుంచి కోలుకున్న గబ్బర్‌‌ ఇంకా ఫామ్‌‌లోకి రాలేదు.. కానీ ఆసీస్‌‌ గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువ..! ఇక వయసు పరంగా, ఆటపరంగా, స్ట్రయిక్‌‌ రేట్‌‌ పరంగా ధవన్‌‌ కంటే సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న రాహుల్‌‌ను పక్కనబెట్టడం సాధ్యమేనా..? ఒకవేళ రాహుల్‌‌ను దాటేసి.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ప్లేస్‌‌ సుస్థిరం చేసుకోవాలంటే ధవన్‌‌కు ఇప్పుడు రెండు చాన్స్‌‌లు మిగిలి ఉన్నాయి..! ఈ నేపథ్యంలో నేడు శ్రీలంకతో జరగబోయే రెండో టీ20లో గబ్బర్‌‌ ఎలా ఆడతాడన్నది ఆసక్తితో పాటు ఒత్తిడిని కలిగిస్తోంది..!!

ఇండోర్‌‌: కొత్త ఏడాది విజయంతో బోణీ చేయాలన్న ఆశలకు వరుణుడు అడ్డుపడినా.. రెండో చాన్స్‌‌ కోసం టీమిండియా రెడీ అయ్యింది.  మంగళవారం శ్రీలంకతో జరిగే రెండో టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో తొలి మ్యాచ్‌‌ రద్దు కావడంతో.. సిరీస్‌‌పై పట్టు కోసం ఇరుజట్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బలం, బలగాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మ్యాచ్‌‌లో విరాట్‌‌సేన ఫేవరెట్‌‌ అన్నది సత్యం. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ కోసం కసరత్తులు చేస్తున్న ఇండియాకు ఇక మిగిలింది 14 మ్యాచ్‌‌లే. దీంతో టీమ్‌‌లో ఎన్నాళ్లుగానో సమస్యగా మారుతున్న ఓ రెండు, మూడు స్థానాల కోసం పర్‌‌ఫెక్ట్‌‌ ప్లేయర్స్‌‌ను ఎంచుకోవాలని విరాట్‌‌ ప్లాన్స్‌‌ వేస్తున్నాడు. ఇక సంధి దశలో కొట్టుమిట్టాడుతున్న లంకేయులు కూడా ఈ మ్యాచ్‌‌ విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ధవన్‌‌పై అధిక ఒత్తిడి..

ఓపెనింగ్‌‌ స్లాట్‌‌ కోసం రాహుల్‌‌తో గట్టిపోటీ ఎదుర్కొంటున్న ధవన్‌‌పై అధిక ఒత్తిడి నెలకొంది. లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌లో మంచి బ్యాట్స్‌‌మనే అయినా.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో అతని స్ట్రయిక్‌‌ రేట్‌‌ అనుకున్నంత మెరుగ్గా లేదు. గాయాలతో గతేడాది అంతంత మాత్రమే ఆడిన ధవన్‌‌.. రాబోయే రెండు మ్యాచ్‌‌ల్లో చెలరేగితేనే వరల్డ్‌‌కప్‌‌ బెర్త్‌‌ దక్కుతుంది. 2019లో 12 మ్యాచ్‌‌లు ఆడిన ధవన్‌‌ 110 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 272 రన్స్‌‌ మాత్రమే చేయడంతో ఆందోళన కలిగిస్తోంది. కానీ రాహుల్‌‌ గతేడాది ఆడిన 3 వన్డేలు, 3 టీ20ల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్‌‌ సెంచరీలు చేసి తిరుగులేని ఫామ్‌‌ను చూపెట్టాడు. ఇక ఒక్క బాల్‌‌ పడకుండానే గౌహతి మ్యాచ్‌‌ రద్దుకావడంతో.. రెండో టీ20 కోసం అదే జట్టును యధావిధిగా దించుతున్నారు. నాలుగైదు స్థానాల్లో శ్రేయస్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఎలా ఆడతారన్న ఆసక్తి కూడా మొదలైంది. పిచ్‌‌ను బట్టి ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడే చాన్స్‌‌ ఉంది. దీంతో మనీశ్‌‌ పాండే, శాంసన్‌‌ మరోసారి బెంచ్‌‌కు పరిమితంకానున్నారు. ప్రయోగాలు చేస్తామని చెబుతున్నా.. ఈ ఇద్దర్నీ ఆడించకపోవడం మరోసారి చర్చకు తావిస్తోంది. లంక టీమ్‌‌లో లెఫ్ట్​ హాండర్ల దృష్ట్యా కుల్దీప్‌‌, సుందర్‌‌ తుది జట్టులో ఉండొచ్చు. బుమ్రా, సైనీ, శార్దూల్‌‌ పేస్‌‌ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆల్‌‌రౌండర్‌‌గా శివమ్‌‌ దూబే మెరవాల్సి ఉంది. ఓవరాల్‌‌గా ఈ మ్యాచ్‌‌తో ఒకరిద్దరిపై తుది అంచనాకు వచ్చే చాన్స్‌‌ కనిపిస్తోంది.

మాథ్యూస్‌‌ ఆడతాడా?

శ్రీలంక పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. అందుబాటులో ఉన్న సీనియర్లు ఒక్కరు కూడా సత్తా చూపించలేకపోతున్నారు. దీంతో టీమ్‌‌ మొత్తం ఒత్తిడికి లోనవుతోంది. గత మ్యాచ్‌‌కు ఎంపిక చేసిన టీమ్‌‌నే బరిలోకి దించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గౌహతిలో పక్కనబెట్టిన వెటరన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ మాథ్యూస్‌‌కు చాన్స్‌‌ ఇస్తారో లేదో చూడాలి. ఒషాడ ఫెర్నాండో, రాజపక్స, కుశాల్‌‌ ఈ మ్యాచ్‌‌లో కీలకంకానున్నారు. కెప్టెన్‌‌గా మలింగకు ఈ సిరీస్‌‌ కఠిన పరీక్ష. స్పెషలిస్ట్‌‌ బౌలర్‌‌గా తాను ప్రభావం చూపినా.. బ్యాటింగ్‌‌లో ఇండియా బౌలింగ్‌‌ను ఎదిరించే స్టార్లు లేకపోవడం అతిపెద్ద లోటు. ఆవిష్క, గుణతిలక శుభారంభం ఇస్తే పోటీని ఊహించొచ్చు. లేదంటే ఏకపక్ష పోరు తప్పదు.

జట్లు(అంచనా)

ఇండియా: కోహ్లీ(కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, అయ్యర్‌‌, పంత్‌‌, దూబే, జడేజా, ఠాకూర్‌‌, సుందర్‌‌, కుల్దీప్‌‌/చహల్​,  బుమ్రా.

శ్రీలంక: మలింగ (కెప్టెన్‌‌), అవిష్క, గుణతిలక, కుశాల్‌‌ పెరీరా, ఫెర్నాండో, రాజపక్స, ధనుంజయ, షనక, ఉడాన, హసరంగ, కుమార.

ఇది కొత్త ఏడాది. కొత్తగా మొదలుపెట్టాలని భావిస్తున్నా. మరింత ప్రభావవంతమైన బ్యాట్స్‌‌మన్‌‌గా రాణించేందుకు కృషి చేస్తా. టీమిండియాకు టీ20 వరల్డ్‌‌కప్‌‌ను అందించేందుకు ప్రయత్నిస్తా. గాయాలు ఆటలో భాగం. వాటి గురించి ఆందోళన అవసరం లేదు. నా కోసం, టీమ్‌‌ కోసం చాలా రన్స్‌‌ చేయాలనుకుంటున్నా. నేనెప్పుడూ పాజిటివ్‌‌గా ఆలోచిస్తా. సానుకూల దృక్పథంతోనే పరిస్థితులను స్వీకరిస్తా. గాయాల నుంచి కోలుకున్ననాకు శ్రీలంకతో టీ20 సిరీస్‌‌ గొప్ప అవకాశం.  ఈ సిరీస్‌‌లో భారీ స్కోర్లు చేసి సత్తా నిరూపించుకోవాలి. నా గేమ్‌‌ను మెరుగుపర్చుకునేందుకు నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా. కొత్త షాట్స్‌‌ ఆడాలని చూస్తుంటా. ప్రతి మ్యాచ్‌‌కు నా సన్నాహకాలు బాగుండేలా చూసుకుంటా. గ్రౌండ్‌‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తా. అప్పుడే బ్యాటింగ్‌‌లో రాణించగలుగుతాం. – ధవన్‌‌

Latest Updates