బ్యాటింగ్ కొత్త కాదు..2020లో నేనేంటో చూపిస్త

న్యూఢిల్లీ: మొదట వేలి గాయం.. తర్వాత మెడ వాపు.. ఆపై కంటి గాయం.. ఆఖర్లో మోకాలికి దెబ్బ.. ఇలా వరుస గాయాలతో డీలా పడ్డ టీమిండియా ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌.. రాబోయే ఏడాదిని కొత్తగా ఆరంభిస్తానని చెప్పాడు. ఈ ఏడాది చాలా బాధాకరంగా ముగిసిందన్నాడు. ఫామ్‌‌లో ఉన్నా లేకపోయినా.. తన క్లాస్‌‌ మాత్రం పర్మినెంట్‌‌ అని తెలిపాడు. ‘ఇది నాకు కొత్త ఆరంభం. ఈ ఏడాది వరుస గాయాలతో ఇబ్బందిపడ్డా.. కొత్త ఏడాది వరకు అన్నింటి నుంచి బయటపడ్డా. రాహుల్‌‌ ఫామ్‌‌లో ఉండటం చాలా సంతోషం. వచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను సత్తా చాటాల్సిన అవసరం వచ్చింది. ఆటలో గాయాలనేవి చాలా సహజం. వాటిని ఆమోదించాల్సిందే. వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌‌ చేయడం నాకు కొత్త కాదు. కాబట్టి ఆరంభించి ఆగిపోవడం నాపై ఎలాంటి ప్రభావం చూపదు. నా క్లాస్‌‌ శాశ్వతం. పరుగులు కూడా చేస్తా’ అని ధవన్‌‌ పేర్కొన్నాడు. లంకతో టీ20 సిరీస్‌‌ తనకు చాలా కీలకమన్నాడు. ఆసీస్‌‌తో సిరీస్‌‌కు ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉంటామన్నాడు. ఆ సమయంలో టీమ్‌‌ ఎంపిక అతిపెద్ద సవాలని ఈ ఢిల్లీ బ్యాట్స్‌‌మన్‌‌ చెప్పాడు. టెస్ట్‌‌ టీమ్‌‌లో ఉన్నా లేకపోయినా.. ఆట ఎలా ఆడాలో తనకు తెలుసని చెప్పిన గబ్బర్‌‌.. మూడు ఫార్మాట్లలో ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో మోకాలి గాయానికి గురైన ధవన్‌‌.. ప్రస్తుతం హైదరాబాద్‌‌పై రంజీ మ్యాచ్‌‌ ఆడనున్నాడు.

 

Latest Updates