రైతులను గౌరవిస్తే మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది

ముంబై: రైతులను గౌరవిస్తే ప్రధాని మోడీ ఖ్యాతి మరింత పెరుగుతుందని శివసేన సూచించింది. కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన స్పందించింది. సుప్రీం నియమించిన కమిటీలోని నలుగురూ నిన్నటి వరకు కొత్త చట్టాలపై వాదించిన వారేనని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన రాసుకొచ్చింది.

‘రైతుల ఉద్యమంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ప్రవేశించారని ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న సుప్రీం కోర్టు చెబుతోంది. ప్రభుత్వం ఇలా చెప్పించడం షాక్‌‌కు గురి చేస్తోంది. ఒకవేళ ఖలిస్థాన్ మద్దతుదారులు ఆ నిరసనల్లో పాల్గొంటే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. సర్కార్ ఈ ఉద్యమాన్ని ముగించాలని భావిస్తున్నట్లు లేదు. రైతుల నిరసనలను స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ వాడుకోవాలని చూస్తోంది. ఈ ఉద్యమానికి దేశద్రోహ మకిలిని అంటించాలని యత్నిస్తోంది. స్వాతంత్ర్యానంతరం ప్రజలు ఉవ్వెత్తున, క్రమశిక్షణతో చేస్తున్న ఉద్యమం ఇదే. ఇలాంటి అన్నదాతల ధైర్యసాహసాలు, మొండితనాన్ని ప్రధాని మోడీ మెచ్చుకోవాలి. అగ్రి చట్టాలను రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ మంచి పేరును గడించాలి. మోడీ పెద్దగా ఆలోచించండి’ అని సామ్నాలో శివసేన సూచించింది.

Latest Updates