హార్దిక్‌ ప్లేస్​ పై కన్నెయ్యలేదు

హైదరాబాద్​, వెలుగు: ఇండియా టీ20 జట్టులో హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయాలని తాను అనుకోవడం లేదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశం తరఫున మంచి పెర్ఫామెన్స్‌‌ చేసేందుకు ప్రయత్నిస్తానని యువ ఆల్‌రౌండర్‌‌ శివం దూబే అంటున్నాడు. ‘పాండ్యా గైర్హాజరీలో వచ్చిన ఈ అవకాశం జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుకోవడం లేదు. నాకు దేశానికి ఆడేందుకు చాన్స్‌‌ వచ్చిందంతే. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. బంగ్లాతో సిరీస్‌‌లో చివరి టీ20లో మూడు వికెట్లు మినహా నేను పెద్దగా రాణించింది లేదు. అయినా జట్టులో అందరూ నన్ను ఎంకరేజ్​ చేస్తున్నారు. కెప్టెన్‌ , టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సపోర్ట్‌‌ నాకు మరింత కాన్ఫిడెన్స్‌‌ ఇస్తోంది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నా. డ్రెస్సింగ్​ రూమ్‌లో చాలా రిలాక్స్‌‌డ్‌గా ఫీల్‌ అవుతున్నా’అని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఒక ఆల్‌రౌండర్‌‌ సక్సెస్‌ కావాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యమని, దాన్ని కాపాడుకోవడం కష్టమని దూబే అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో విండీస్‌ బలమైన జట్టు అయినప్పటికీ ఈ సిరీస్‌లో ఇండియా ఈజీగా గెలుస్తుందన్నాడు. ‘ఈ ఫార్మాట్‌లో విండీస్‌ మంచి జట్టు కానీ, ఈ సిరీస్‌ కోసం మేం బాగా ప్రిపేరయ్యాం. వరల్డ్‌‌ క్రికెట్‌లో ఇండియా ఇప్పుడు బెస్ట్‌‌ టీమ్‌. మేం సిరీస్‌ను కచ్చితంగా గెలుస్తాం’ అని దూబే చెప్పుకొచ్చాడు.

Latest Updates