ఎల్జీ పాలిమర్స్ సంస్థకు సుప్రీం లో చుక్కెదురు

ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాంట్‌ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. విచార‌ణ కోసం నియ‌మించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

అయితే ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీని పై ఏపీ హైకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దర్యాప్తు చేస్తున్నాయని ఈ సమయంలో తాము విచారణ జరపలేమని స్పష్టం చేసింది. హైకోర్టు, ఎన్జీటీలో విచార‌ణ ముగిసిన త‌ర్వాతే సుప్రీం కు రావాల‌ని తెలిపింది. ఎల్.జి. కంపెనీ అధికారులకు ప్లాంట్ లో కి వెళ్లి వచ్చేందుకు అనుమతులు మంజూరు చేసినా హైకో‌ర్టు ఆదేశానుసారం విచారణకు సహకరించాలని సంస్థ‌ అధికారులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది.

Latest Updates