కరీంనగర్: కరీంనగర్లో ఒక ముస్లిం యువతి ప్రవర్తనతో స్థానికులు హడలెత్తిపోయారు. కరీంనగర్ సవరణ్ స్ట్రీట్లోని ఖబరస్థాన్లో తల్లి సమాధి దగ్గరే ఒక యువతి రెండు రోజుల పాటు ఎదురుచూస్తూ ఉండిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి కూడా ఆ యువతి స్మశానంలోనే ఉండిపోయింది. అంతేకాదు.. తల్లి సమాధి ముందు ప్రార్థిస్తూ కనిపించింది. అలా స్మశానంలో ఉండకూడదని.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని స్థానికులు ఎంత చెప్పినా ఆ యువతి పట్టించుకోలేదు. ఎంతచెప్పినా వినకపోవడంతో స్థానికులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇవాళ (మంగళవారం) ఉదయం వెళ్లి చూడగా అప్పటికే ఆ యువతి సమాధి దగ్గరే కనిపించింది. ఇవాళ ఉదయం తనంతట తానే అక్కడ నుంచి వెళ్లిపోయింది. తల్లిపై విపరీతమైన ప్రేమానురాగాలు పెంచుకున్న సదరు యువతి తన తల్లి లేని చోట ఉండలేనని చెప్పి సమాధి దగ్గర వచ్చి కూర్చోవడం.. రాత్రుళ్లు తల్లిని తల్చుకుంటూ.. ఆమెతో మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తూ సమాధి దగ్గరే పడుకోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
సదరు యువతిని ఓదార్చిన స్థానికులు అక్కడ నుంచి వెళ్లాలని ఆ యువతిని కోరారు. అయితే.. స్థానికులు అందరూ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనంతట తానే ఆ యువతి అక్కడ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
