నా మాటే శాసనం

సింహా, లెజెండ్ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మరో సినిమా రూపొందుతోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ‘నువ్వొక మాటంటే శబ్దం .. అదే మాట నేనంటే శాసనం’ అంటూ బాలకృష్ణ పవర్‌ ఫుల్ డైలాగ్ చెప్పడాన్ని ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేశారు. సి.కల్యాణ్, శివలెంక కృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘సింహా,లెజెండ్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత మా కలయికలో వస్తున్న సినిమా కావడంతోఅంచనాలు సహజం. జనం మా నుండి ఆశిస్తున్నది ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ సినిమా కథలో కొత్తదనంతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉంది. నా ఆలోచనా విధానం, ఆవేశం నుండి బోయపాటి గారి కథలు పుట్టుకొస్తాయి .ఎం.రత్నం గారు చక్కని సంభాషణలిచ్చారు. రవీందర్ రెడ్డి లాంటి యువ నిర్మాతలు ఇండస్ట్రీకి రావాల్సిన అవసరముంది. మా కలయికలో ఇది చాలా మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నాను. ఉదయం జరిగిన ఎన్‌‌కౌం టర్ తో దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నాను . పోలీసులే ఆ భగవంతుడి రూపంలో నిందితులకు సరైన శిక్ష విధించారు. అందరికీ ఇదో గుణపాఠం కావాలి. మరోసారి ఎవరూ అలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా, అలాంటి ఆలోచనే రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి నా అభినందనలు’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘రవీందర్ రెడ్డి గారితో ఇది నా రెండో చిత్రం. గతంలో ‘జయ జానకి నాయక’ చేశాం. అలాగే బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ మూవీ. ఆ రెండు సినిమాలకి మించిన సినిమా చేసి నాభాధ్యతను నెరవేర్చుకుంటాను’ అని చెప్పారు.‘బాలకృష్ణ గారితో సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను . ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేలా ఈ సినిమాని నిర్మిస్తానని ప్రామిస్ చేస్తు న్నాను ’అన్నారు నిర్మాత రవీందర్ రెడ్డి. డైలాగ్ రైటర్ ఎం.రత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Updates