ఊర్లు టౌన్లు సొంత లాక్ డౌన్..కరోనా పెరగడంతో జనం సెల్ఫ్ రూల్స్

 • పల్లెల్లో పాజిటివ్ కేసు వస్తే ఊరంతా షట్​డౌన్
 • అవసరమైతేనే బయటికిరావాలంటూ డప్పు చాటింపులు
 • కేసులు వచ్చిన ఊళ్లకు రాకపోకలు బంద్​
 • రూల్స్​పాటించనివారికి ఫైన్లు
 • టౌన్లలో మధ్యాహ్నం వరకే షాపులు ఓపెన్
 • హైదరాబాద్​లో పనిగంటలు
 • కుదించుకున్న హోల్​సేల్ వ్యాపారులు

దేశవ్యాప్తంగా పూర్తి లాక్​డౌన్​ ముగిసిన తర్వాత జనం అంతా రోడ్ల మీదికి రావడంతో అందరిలో కరోనా భయం నెలకొంది. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి ఎలా వైరస్​ అంటుకుంటుందోనన్న ఆందోళన పెరిగింది. కేసులు కూడా పెరుగుతున్నాయి. రోజూ జీహెచ్​ఎంసీతో పాటు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఊళ్లు, టౌన్లలోని లోకల్​బాడీస్​ సెల్ఫ్​ లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాయి. ఇందులో ఆయా ఊళ్ల సర్పంచులు, మున్సిపాలిటీల​ చైర్​పర్సన్లు యాక్టివ్ రోల్​ పోషిస్తున్నారు. ఆఫీసర్ల సాయంతో జనం స్ట్రిక్ట్​గా కొవిడ్​ రూల్స్​ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఊళ్లలో ఎవరికైనా పాజిటివ్​ వస్తే మూడు రోజుల నుంచి వారం పాటు ఊరు ఊరంతా క్వారంటైన్ అవుతోంది. అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు డప్పు చాటింపుతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా హోటళ్లను పూర్తిగా మూసివేయిస్తున్నారు. ఐసోలేషన్​లో ఉన్నవారికి సర్పంచులు, చైర్​పర్సన్లు స్వయంగా నిత్యావసరాలు అందిస్తున్నారు.

జిల్లాల్లో పెరుగుతున్న కేసులు..

లాక్డౌన్ సడలింపుల తర్వాత జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. మే 6న వైన్స్, తర్వాత ఇతర షాపులు తెరుచుకోవడం, ప్రజారవాణా ప్రారంభమవడంతో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. జూన్ 1 నుంచి స్పీడ్ పెరిగింది. మొదట్లో గ్రీన్‌ జోన్లుగా ప్రకటించిన జిల్లాల్లోనూ ఇప్పుడు భారీగా కేసులు నమోదవుతున్నాయి. మే తొలివారంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల ద్వారా రెండో విడత కేసులు మొదలయ్యాయి. వీళ్లను గవర్నమెంట్ క్వారంటైన్కు కాకుండా హోం క్వారంటైన్ చేయడంతో లోకల్ స్ర్పెడ్ జరిగింది. రాష్ట్రంలో తొలికేసు నమోదైన మార్చి1 నుంచి మే 31వరకు మూడు నెలల్లో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో 700కుపైగా పాజిటివ్ కేసులు రాగా, జూన్1 నుంచి కేవలం 18 రోజుల్లో 600కుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 84 మంది చనిపోయారు. ఇక ప్రస్తుతం కరోనా పాజిటివ్ పేషెంట్లనూ హోం ఐసోలేషన్ చేస్తుండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పల్లెల్లో స్ట్రిక్ట్​

 • రాష్ట్రంలోకి కరోనా వచ్చిన తొలిరోజుల్లో ఊళ్లలో కొత్త వ్యక్తులెవరూ రాకుండా రోడ్లను మూసేసి, వైరస్​ను కట్టడిచేసిన పంచాయతీలు.. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ అలర్ట్​ అయ్యాయి. ఊర్లో ఎవరికైనా పాజిటివ్​ అని తెలిసిన వెంటనే వారిని, వారి కాంటాక్ట్స్​ను హోంక్వారంటైన్​ చేయడంతో పాటు స్వచ్ఛందంగా షట్​డౌన్​ పాటిస్తున్నాయి. కొద్దిరోజులు షాపులను, హోటళ్లను సర్పంచులు మూయిస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయిటికి రావద్దని గ్రామస్తులను ఆదేశిస్తున్నారు. షాపుల వద్ద ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేలా చూస్తూ, మాస్కులు లేనివారికి ఫైన్లు వేస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో 3 పాజిటివ్​కేసులు నమోదుకావడంతో సర్పంచ్​ కటకం శ్రీధర్​ ఈ నెల 15 నుంచి 17 వరకు అంటే 3 రోజులపాటు అక్కడ షట్ డౌన్ విధించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​లో తొలి కరోనా పాజిటివ్​ కేసు నమోదుకావడంతో అక్కడి సర్పంచ్ శ్రీపతిబాపు దుకాణాలు మూసివేయాలని చాటింపు వేయడంతో పాటు ఆదివారం నుంచి లాక్​డౌన్​ అమలుచేస్తున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఇటీవల ఓ మహిళకు కరోనా పాజిటివ్‌‌ రావడంతో గ్రామ ప్రజలు సెల్ఫ్‌‌ లాక్‌‌డౌన్‌‌ విధించుకున్నారు. ఆమెతో కాంటాక్ట్​ అయిన 70 మందిని హోం క్వారంటైన్ ​చేశారు. ఈ నెల 9 నుంచి నాలుగు రోజుల పాటు షాపులు మూసివేసి, జనం బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు. మెదక్​ జిల్లా రామాయంపేటలో ఇటీవలే ఒక వ్యాపారికి కరోనా పాజిటివ్​ రాగా, వెంటనే వ్యాపారి కుటుంబ సభ్యులతో పాటు అతడ్ని కలిసిన వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచి, మూడు రోజుల పాటు లాక్​డౌన్​ విధించారు. చిన్న, పెద్ద షాపులన్నీ మూసేశారు.
 • నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో అన్ని షాపులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు.
 • సిద్దిపేట జిల్లాలోని మూడు గ్రామాల్లో హోమ్‌‌ ‌‌ఐసోలేషన్‌‌లో ఉన్న వ్యక్తుల ఇండ్లకు ఎవరు వెళ్లకుండా సర్పంచులు చర్యలు తీసుకుంటున్నారు. హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలను సర్పంచ్‌‌‌‌లు, పంచాయతీ సిబ్బంది అందజేస్తున్నారు.
 • మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాత్ మర్చంట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెలరోజుల వరకు సాయంత్రం 5గంటలకే షాపులు మూసేయాలని గురువారం నిర్ణయించారు.
 • వనపర్తి జిల్లా కొత్తకోటలో సాయంత్రం 6 గంటలకే షాపులు క్లోజ్​ చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వ్యాపారులు ఈ నెల17 నుంచి ఒంటి గంట వరకే దుకాణాలు మూసేస్తున్నారు. వీణవంక మండల కేంద్రంలో జులై1 వరకు బార్బర్​ షాపులు తెరవబోమని నాయీబ్రాహ్మణులు ప్రకటించారు. పెద్దపల్లి పట్టణంలోని కిరాణా వర్తక సంఘం నాయకులంతా సెల్ఫ్​​ లాక్​ డౌన్​ విధించుకున్నారు. మధ్యాహ్నం 2గంటల కల్లా షాపులు మూసేస్తున్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 5 గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలని మున్సిపల్ కమిషనర్, చైర్​పర్సన్​ నిర్ణయించి అమలుచేస్తున్నారు. రామాయంపేట పట్టణంలో మున్సిపల్ చైర్​పర్సన్​ సూచనల మేరకు సోమవారం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. తూప్రాన్ పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే షాపులు నడిపేలా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, పాపన్న పేటగ్రామాల్లో మధ్యాహ్నం వరకే షాపులు మూసేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్​కర్నూల్​, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల్లో సాయంత్రం 5 గంటల వరకు షాపులు మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. షాప్స్, హోటల్స్ లో కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే యజమానులకు మున్సిపల్​ ఆఫీసర్లు ఫైన్ విధిస్తున్నారు. కూరగాయలు, మటన్ మార్కెట్లలో రద్దీ పెరగకుండా మున్సిపల్​ చైర్​పర్సన్లు, సర్పంచులు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

ఒక్కరోజే 352 మందికి కరోనా

Latest Updates