ఏజ్‌‌‌‌‌‌‌‌ 29 .. అవార్డ్స్‌‌‌‌‌‌‌‌ 115

లేస్తే ఆటలంటడు. బడికి బంకు కొడతడు. పెద్దయితే ఏమయితడోనని ఈ సిద్దిపేట పోరడిని చూసి పెద్దోళ్లందరూ అనుకునేటోళ్లు. ఒకటి నుంచి పదో తరగతి చదివే సరికి 13 స్కూల్స్‌‌‌‌ మార్పించిన్రు.  ఏమన్న మారతడేమోనని ఆశపడ్డ అమ్మానాన్నలకు నిరాశే మిగిలింది. కొడుకుని ఎట్లయినా ఇంజినీర్‌‌‌‌ చేయాలని కలలు కంటున్న తల్లిదండ్రుల ఆశలకు గండికొట్టి ఓ అర్ధరాత్రి గోడదూకి పారిపోయిండు. ఇల్లుదాటి ఆగమైతడనుకున్న ఆ పోరడు ‘పోకిరి’ సినిమా డైరెక్టర్‌‌‌‌ పూరీకి దగ్గరైండు.

బిగ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ మీద బిగ్‌‌‌‌ హోప్‌‌‌‌ పెట్టుకుని కలలు కంటూ కాలాన్ని వృథా చేయకుండా, సాధించాలనే తపనతో షార్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌తో గొప్ప సందేశమిచ్చిండు. సిద్ధిపేట వయా హైదరాబాద్‌‌‌‌ మీదుగా మొదలైన ఈ జైత్రయాత్ర అక్కడితో ఆగలే. ఎన్నో దేశాల్లో శభాష్​ అన్నరు. అవార్డులు ఇచ్చిన్రు. 115 అవార్డులు జమయినయ్​. ‘న్యూయార్క్‌‌‌‌ ఫిలిం ఫెస్టివల్‌‌‌‌, మియామీ, బెర్లిన్‌‌‌‌, లాటిట్యూడ్‌‌‌‌’ లాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్​లో ‘వారెవా’ అనిపించుకున్నడు. ప్రపంచ సైనికుల హృదయాలను గెలుచుకున్న ఈ సందేశం అవార్డుల కంటే ఎక్కువ. సిద్ధిపేట, హైదరాబాద్‌‌‌‌లో ఆటలు, అల్లరి, చదువు, సినిమాతో సాగిన సిద్దిపేట హీరో శ్రవణ్‌‌‌‌ గజభీంకర్‌‌‌‌ బయోస్కోప్‌‌‌‌ ఈ కథనం.

పదిహేను నిమిషాల షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌. ఇద్దరు సైనికుల మధ్య పెరిగిన స్నేహం ఆత్మీయంగా ఎదిగిన తీరుని చూసి ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది. ఈ స్నేహానికి నేపథ్యం.. 1947 అనంతర పరిణామాలు. జమ్మూ, కశ్మీర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకునేందుకు పోయిన భారత సైనిక బలగాల్లోని ఇద్దరు సైనికుల మధ్య అల్లిన ఒక కల్పిత కథ ఇది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన గిరిజన తిరుగుబాటుదారులు ఆ ఇద్దరు సైనికుల (మోహన్‌‌‌‌‌‌‌‌, కిషోర్‌‌‌‌‌‌‌‌)పై కాల్పులు జరుపుతారు. కిషోర్‌‌‌‌‌‌‌‌ వాళ్లని నిలువరిస్తాడు. ఈలోగా మోహన్‌‌‌‌‌‌‌‌ మరణిస్తాడు. మోహన్‌‌‌‌‌‌‌‌ జ్ఞాపకాలను కిషోర్‌‌‌‌‌‌‌‌ నెమరువేసుకుంటాడు.

ఇంటి నుంచి ‘గెట్‌‌‌‌ అవుట్‌‌‌‌’..

సినిమా కలలు కంటూ ఒకే ఒక్క ఛాన్స్‌‌‌‌ అంటూ స్టూడియోలకు తిరగకుండా తనకున్న ఆసక్తికి కొంచెం మెరుగులు దిద్దుకోవాలనుకున్నడు శ్రవణ్‌‌‌‌. శ్రవణ్‌‌‌‌ తెలుగు యూనివర్సిటీలో చేరిండు. ‘స్క్రీన్‌‌‌‌ రైటింగ్‌‌‌‌’ వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌కి మాటల రచయిత పరుచూరి వచ్చిండు. ఆ తర్వాత ఆయన దగ్గరే అసిస్టెంట్‌‌‌‌గా చేరిండు. తను చిన్నప్పుడు ఇంట్లోవాళ్ల మీద పేరడీ పాటలు కడుతూ ఉండేవాడు. అమ్మ కష్టాలు, ఇద్దరు తమ్ముళ్ల ఇష్టాల మీద అల్లే పాటలు ఇంట్లో వాళ్లందరినీ నవ్వించేవి.

పరుచూరి దగ్గర రెండు సంవత్సరాలు పనిచేసిండు. 2010లో డైరెక్టర్‌‌‌‌ పూరీని కలిసిండు. పరుచూరి దగ్గర చేశావు కాబట్టి రైటర్‌‌‌‌గా పనిచేయమన్నడు పూరి. కానీ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా చేయాలని శ్రవణ్‌‌‌‌ కోరిక. ఆ కోరిక అప్పుడు తీరలేదు. రూమ్‌‌‌‌లో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి సహకారం లేదు. తనకాళ్ల మీద తాను నిలబడేందుకు ఏ చిన్న పని దొరికినా వదలకుండా కథలు, మాటలు రాస్తూ ఖర్చుల కోసం సంపాదించిండు. లైఫ్‌‌‌‌ అలా మూడేళ్లు నడిచింది.

అర్ధరాత్రి పలాయనం

ఓ రోజు షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌కు పోయిండు. ఎస్కలేటర్‌‌‌‌ మీద జారి పడిండు. కాలు విరిగింది. విషయం తెలిసి అమ్మానాన్న ఇంటికి తీసుకుపోయిన్రు. మనసు సినిమాలపై ఉంది. ఎట్లయితేంది పిలగాడు ఇంటికి చేరిండు. వీడిని ఓ దరికి చేర్చాలని ఆలోచిస్తున్నరు ఇంట్లోవాళ్లు. ఇది తనకు ఇష్టం లేదు. ఓ రోజు ఫ్రెండ్‌‌‌‌కి ఫోన్‌‌‌‌ చేసి అర్ధరాత్రి రావాలని చెప్పిండు. చెప్పినట్లే ఫ్రెండ్‌‌‌‌ వచ్చిండు. అర్ధర్రాతి చప్పుడు చేయకుండా, ఎవరికీ చెప్పకుండా ఫ్రెండ్‌‌‌‌ బైకెక్కి చెక్కేసిండు. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిండు శ్రవణ్‌‌‌‌. ‘ఏక్‌‌‌‌ నిరంజన్‌‌‌‌’ సినిమా షూటింగ్‌‌‌‌ పటాన్‌‌‌‌ చెరువు దగ్గర ప్రారంభమవుతోంది. అక్కడికిపోయి పూరీని కలిసిండు. ఇప్పుడు అవసరం లేదు. నెక్ట్స్‌‌‌‌ సినిమాకు చెబుతలే అన్నడు. చెప్పినట్లే ‘నేను నా రాక్షసి’ సినిమాకు అసిస్టెంట్‌‌‌‌గా తీసుకున్నడు. అట్లా సినిమా కలలు కంటూ, సినిమా జీవితంలోకి అడుగుపెట్టిండు. నాలుగేళ్లపాటు సినిమా పాఠాలు ప్రాక్టికల్‌‌‌‌గా నేర్చుకున్నడు.

శ్రవణానందం

ఫీచర్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ తీయాలని శ్రవణ్‌‌‌‌ ఆలోచిస్తున్నడు. ముందు కథను రెడీ చేద్దాం. ఆ తర్వాత మిగతా విషయాలని ఆలోచిస్తున్నడు. ఫీచర్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవకాశాలు రాక చాలా మంది ఇంటిదారి పడతారు. వేరే పనేమీ లేకుండా ఉండే ఇలాంటి వాళ్లని ‘సినిమా పిచ్చోళ్లు’ అని ప్రపంచమంతా అంటుంది. ఆ పిచ్చిలో ఉన్న శ్రవణ్‌‌‌‌ తనేమిటో ప్రూవ్‌‌‌‌ చేసుకోవాలని  2014లో ‘మెహబూబ్‌‌‌‌ 143’ అనే షార్ట్‌‌‌‌ఫిల్మ్‌‌‌‌ తీసిండు. ఆ తర్వాత ‘మళ్లీ కలుద్దాం’ పేరుతో ఇంకో షార్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ తీసిండు. ఇది లవ్‌‌‌‌ అండ్‌‌‌‌ రివేంజ్‌‌‌‌ స్టోరీ. ఈ స్టోరీలో ఓ అమ్మాయిని డాన్‌‌‌‌ చంపేస్తడు.

ఆ అమ్మాయి అన్న మీద రివెంజ్‌‌‌‌ తీర్చుకోవాలని ఆమెను హత్య చేస్తడు. ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి డాన్‌‌‌‌ని చంపి, రివేంజ్‌‌‌‌ తీర్చుకుంటాడు. ఎన్ని జన్మలైనా మనం కలిసే ఉంటామనే నమ్మకంతో తర్వాత జన్మలో ఆమెను చేరుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటడు. ‘మళ్లీ కలుద్దాం’ షార్ట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ రెండు ‘సైమా అవార్డ్స్‌‌‌‌’ గెలిచింది. ఈ గెలుపు శ్రవణ్‌‌‌‌కు టానిక్‌‌‌‌లా బలాన్నిచ్చింది. ఆ మనోబలంతో రాసిన ‘1947 టూ సోల్జర్స్‌‌‌‌’ శ్రవణ్‌‌‌‌ పట్టుదలెంత గట్టిదో నిరూపించింది. ఏజ్‌‌‌‌ 29. గెలిచిన అవార్డులు 115. కథే కాదు ఈ సినిమాకు డైరెక్టరే కాదు ఎడిటర్‌‌‌‌, రైటర్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ కూడా శ్రవణే. ఈ సక్సెస్‌‌‌‌ చూశాక, చాలా మంది మెచ్చుకున్నరు. అమ్మానాన్నలు హ్యాపీగా ఫీలైనరు.- నాగవర్ధన్‌‌‌‌ రాయల

Latest Updates