వలస కూలీలు ఎల్లిపోయిరి..పనులెట్ల!

రాష్ట్రంలో వరి మస్తు పండింది.. పుట్ల కొద్దీ వడ్లు వచ్చినయ్..రైతులు పంటను మార్కెట్కు తీస్కపోతున్నరు..కానీ అక్కడ హమాలీల కొరత.. లాక్డౌన్ఎత్తేస్తే పనులు మొదలుపెడదామని కన్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు చూస్తున్నాయి..కానీ వర్కర్లు లేరు. సడలింపులు ఇస్తే హోటళ్లు తెరుద్దామని ఓనర్లు అనుకుంటున్నారు… కానీ వండేటోళ్లు, వడ్డించేటోళ్లు లేరు..ఇట్లా ఒకట్రెండుకాదు..రాష్ట్రం నుంచి దాదాపు 6లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో..అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రానైట్ఇండస్ట్రీ దాకా ఎన్నో రంగాలపై ఎఫెక్ట్ ప‌డే పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్రంలో అన్ని రంగాల్లో కార్మికుల కొరత
లాక్ డౌన్ తో సొంతూళ్లకు సగం మంది
ఇక్కడ మిగిలినోళ్లు 6.50 లక్షల మంది
సడలింపులు వస్తే ఇంకింత మంది అటే!
ఇప్పటికే వ్యవసాయ పనులపై ప్రభావం
వడ్లు కొనుడులో జాప్యానికి కారణమిదే
లాక్ డౌన్ ఎత్తేయగానే కన్ స్ట్ర‌క్షన్, బిజినెస్,
మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు సమస్యలు
మున్ముందు మరింతగా ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో రాష్ట్రంలో లక్షలాది మంది వలస జీవులకు ఉపాధి పోయింది. బతుకు బండి నడవలేదు..పూట గడవడం కష్టమైంది.. దీంతో మూట ముల్లె సర్దుకున్నారు. లారీల్లో కొందరు.. సైకిళ్ల‌పై కొందరు..నడుస్తూ కొందరు.. సొంత ఊళ్ల‌కు బయలుదేరారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొంత మంది సరిహద్దుల్లో, షెల్టర్ల‌లో గడుపుతున్నారు. లాక్డౌన్ ఎత్తేస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్లీ వస్తారో రారో తెలియదు. వచ్చినా.. ఎప్పుడు వస్తారో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వలస కార్మికులపై ఆధారపడ్డ రంగాలన్నింటిపై తీవ్ర ప్రభావం పడనుంది. లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. బిల్డింగ్ కన్ స్ట్ర‌క్షన్, వుడ్ వర్క్, హోటల్ బిజినెస్, ప్రైవేటు కంపెనీలు, మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఇప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది మంది కార్మికుల లోటు.. ఈ వ్యాపార రంగాలన్నింటినీ కుదిపేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ సెక్టార్లో కూలీల కొరత వేధిస్తోంది. వరి నాట్ల దగ్గర నుంచి వడ్లు మిల్లుకు చేరేదాకా వలస కూలీలది ప్రధాన పాత్ర. వీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు.

13 లక్షల మందికిపైనే..

రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మందికిపైగా వలస కార్మికులున్నట్లు అంచనా. లాక్డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే 6 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిన సర్వేలో 6.47 లక్షల మంది ఉన్నట్లు తేలింది. వీళ్ల‌లో కూడా చాలా మంది లాక్డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే సొంత ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు సిద్ధమవుతున్నారు.

హమాలీలు లేక వడ్ల‌ లారీలు కదలట్లే

పంట చేతికొచ్చే సీజన్లో వలస కూలీల కొరత పెద్ద దెబ్బ. వరి కోతల టైమ్లో హార్వెస్టర్ల డ్రైవర్లు, మెకానిక్లతో పాటు హమాలీలు కీలకం. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలంటే.. బస్తాల లోడింగ్, అన్ లోడింగ్ కు హమాలీలే ఆధారం. రాష్ట్రంలో ఒక్క బిహార్కు చెందిన హమాలీలే సుమారు 50 వేల మంది పని చేసే వారని మిల్లర్లు చెప్తున్నారు. హోలీ పండుగకు ముందు సొంతూళ్లకు వెళ్లిన వారు లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి రాలేదు. ఈ సీజన్లో ఒడిశా, జార్ఖండ్, ఏపీకి చెందిన మరో 20 వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు రావాల్సి ఉండగా వారు కూడా రాలేకపోయారు. దీంతో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగానే ధాన్యం కొనుగోళ్లు స్లోగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రోజుకు రూ.2 వేల కూలి, భోజనం, వసతి కల్పిస్తామని బీహార్, జార్ఖండ్లోని హమాలీలతో
మాట్లాడుతున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అవసరమైతే స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేసి వాళ్లను రప్పించేందుకు ప్రయత్నాలు చేశామని వివరించారు. హమాలీల కొరతతో ధాన్యం రవాణా స్తంభించిందని, ఎక్కడికక్కడే లారీలు మిల్లుల వద్ద ఆగిపోతున్నాయని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు.

వీటిపైనా ప్రభావం ఎక్కువే

హైదరాబాద్ నగరంలోని సెలూన్స్ లో ఎక్కువ మంది మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరు సుమారు 20 వేల మంది ఉంటారని అంచనా. అలాగే ఫుట్వేర్ రంగంలో 40 వేలు, బ్యాంగిల్స్ తయారీలో మరో 20 వేలు, ఐస్ క్రీమ్స్ కంపెనీల్లో 40 వేలు, మగ్గం వర్క్ లో 60 వేల మంది వరకు పనిచేస్తున్నారు. కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్స్, మార్బుల్ వర్కర్స్, ఫాల్స్సీలింగ్, ఇంటీరియర్ డిజైన్ వర్కర్స్ 1 లక్ష 30 వేల మంది ఉంటారని అంచనా. వీరిలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలవారే ఎక్కువ. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్టార్ హోటల్స్ లో షెఫ్స్, కుక్స్, హెల్పర్స్, సప్లయిర్స్ గా 70 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 80% అస్సాం, మణిపూర్, ఒడిశా, మేఘాలయ వాళ్లే ఉన్నారు. వీళ్లలో చాలా మంది సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఈ రంగాలన్నీ లాక్ డౌన్ తర్వాత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Latest Updates