పనులు ఆగినా.. మొక్కలు ఎండినా..  సర్పంచులపై వేటు

 సీఎం ఆదేశాలతో రంగంలోకి కలెక్టర్లు

హరితహారం, పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం పేరిట షోకాజ్ లు

వారం రోజుల్లో 200 మందికి నోటీసులు

ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్న సర్పంచులు

వెలుగు, నెట్​వర్క్:  ఊరిలో హరితహారం కింద నాటిన మొక్కలు ఎండినా, పల్లె ప్రగతి కింద శ్మశాన వాటికలు, డంప్​యార్డులు గడువులోగా నిర్మించకున్నా సర్పంచులకు తాఖీదులు అందుతున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ముందుగా షోకాజ్​నోటీసులు ఇస్తున్న కలెక్టర్లు.. సరైన వివరణ ఇవ్వని వారిని సస్పెండ్​ చేస్తున్నారు. ఫీల్డ్ లెవల్​లో సమస్యలను పట్టించుకోకుండా కేవలం సీఎం చెప్పారనే కారణంతో తమను మాత్రమే బాధ్యులను చేయడం ఏంటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

ఫీల్డ్ లెవల్​లో ఎన్నో సమస్యలు

పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా శ్మశానవాటిక, డంప్ యార్డు నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డంపింగ్ యార్డుకు రూ.2.5 లక్షలు, వైకుంఠధామానికి రూ.12 లక్షలు ఈజీఎస్​ ఫండ్స్ నుంచి కేటాయిస్తున్నారు. పంచాయతీరాజ్, డీఆర్డీఏ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా, సర్పంచులు, కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి డంప్ యార్డు వద్ద తడి, పొడి చెత్తను వేరుచేసే సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీల కోసం గ్రీన్​షెడ్స్ నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉపాధి నిధులనే మళ్లిస్తున్నారు కాబట్టి ఫండ్స్‌కు​కొరత లేదు. అయితే ఫీల్డ్ లెవల్​లో సమస్యల వల్ల వీటి నిర్మాణం​ ఆలస్యమవుతోందని సర్పంచులు అంటున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేక చాలా గ్రామాల్లో డంప్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల రెవెన్యూ ఆఫీసర్లు చూపుతున్న భూములు వివాదాస్పదంగా ఉంటున్నాయి. పనులు ప్రారంభించేందుకు వెళ్లేవారిని గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. కొందరు తమ ఏరియాలో డంప్​యార్డుల ఏర్పాటుకు ఒప్పుకోవడం లేదు. చాలా గ్రామాల్లో ఇసుకకు పర్మిషన్ ఇవ్వకపోవడం, కూలీల కొరత కారణంగా పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు.

85 శాతం బతకాల్సిందే

హరితహారం కింద నాటిన మొక్కల్లో కచ్చితంగా 85 శాతం బతకాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మొక్కలు నాటి, సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులపై పెట్టింది. కానీ ఏ గ్రామంలోనూ 30 నుంచి 40 ‌‌శాతానికి మించి మొక్కలు బతకడం లేదు. కేవలం నీళ్లు లేకపోవడం వల్లే మొక్కలు ఎండిపోవడం లేదని సర్పంచులు అంటున్నారు. ఎదగని మొక్కలను హడావుడిగా నాటాల్సి రావడం, గాలివానలకు ట్రీగార్డ్స్​తొలగి పశువులు మేయడం వల్ల సమస్య వస్తోందని, వాటికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు.

ఆకస్మిక తనిఖీలు.. అక్కడికక్కడే నోటీసులు..

ఇటీవల సీఎం ఆదేశాలతో జిల్లాల్లో కలెక్టర్లు, డీపీవోలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొక్కలు ఎండినా, నిర్మాణాలు పూర్తి కాకున్నా పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం అక్కడికక్కడే సర్పంచులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. సమాధానం సంతృప్తికరంగా లేకుంటే సస్పెండ్ చేస్తున్నారు. కేవలం మొక్కలు ఎండిపోయాయనే కారణంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేశంను కలెక్టర్ ఆరు నెలలు సస్పెండ్ చేశారు. ఈ జిల్లాలో మొత్తం 14 మంది సర్పంచులకు నోటీసులిచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటిదాకా ఏకంగా 165 మంది సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. వారం వ్యవధిలో వరంగల్ రూరల్ జిల్లాలో 25 మందికి నోటీసులు ఇవ్వగా, నడికూడ మండలం పులిగిల్ల, గీసుగొండ మండలం సూర్య తండాకు చెందిన ఇద్దరు ఉప సర్పంచులను సస్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఆరుగురికి, సంగారెడ్డి జిల్లాలో 8 మందికి, మహబూబాబాద్ జిల్లాలో 46 మందికి, వరంగల్ అర్బన్ జిల్లాలో 10 మంది సర్పంచులకు షోకాజ్​నోటీసులు అందాయి. నాగర్​కర్నూల్ జిల్లాలో 18 మందికి, సూర్యాపేట జిల్లాలో ఒక సర్పంచ్​కి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆఫీసర్ల తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు.

85 శాతం బతకాల్సిందే

హరితహారం కింద నాటిన మొక్కల్లో కచ్చితంగా 85 శాతం బతకాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మొక్కలు నాటి, సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులపై పెట్టింది. కానీ ఏ గ్రామంలోనూ 30 నుంచి 40 ‌‌‌‌శాతానికి మించి మొక్కలు బతకడం లేదు. కేవలం నీళ్లు లేకపోవడం వల్లే మొక్కలు ఎండిపోవడం లేదని సర్పంచులు అంటున్నారు. ఎదగని మొక్కలను హడావుడిగా నాటడం, గాలివానలకు ట్రీగార్డ్స్​తొలగి పశువులు మేస్తున్నాయని, వాటికి తమను బాధ్యులను చేస్తే ఎలా అని వాపోతున్నారు.

సమస్య సాల్వ్  చేయకుండా నోటీసులా?

మా ఉప్పునుంతల మండల కేంద్రంలో పాత శ్మశాన వాటికను వైకుంఠధామంగా చేసే పనులకు.. పక్కన ఉండే రైతులు అడ్డుతగులుతున్నారు. తహసీల్దార్ వేరే స్థలం చూస్తే గ్రామస్తులు వద్దంటున్నారు. దాన్ని పరిష్కరించకుండా మమ్మల్ని బాధ్యులను చేసి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం?

– కట్టా సరిత అనంతరెడ్డి, ఉప్పునుంతల సర్పంచ్, నాగర్​కర్నూల్​ జిల్లా

భూమి చూపుతలేరు

మా ఊరిలో శ్మశానవాటిక పనులు నడుస్తున్నాయి. డంపింగ్ యార్డుకు స్థలం లేదు. ఇండ్ల దగ్గర భూమి చూస్తే గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. రెవెన్యూ అధికారులు అర ఎకరా స్థలం చూపారు. అక్కడికి వెళ్లేందుకు కాలిబాట కూడా లేదు. వేరే భూమి చూపిస్తలేరు. అధికారులేమో షోకాజ్ నోటీస్​ ఇచ్చారు.

– బాలకిష్టమ్మ, రాంపూర్ సర్పంచ్, లింగాల మండలం, నాగర్​కర్నూల్​జిల్లా

కరెంట్, నీటి సౌలత్ లేదు

శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో కనీసం కరెంట్, నీటి సౌకర్యం లేదు. అందరినీ ఒప్పించి రోడ్డు ఏర్పాటు చేసి, పోల్స్ పాతి కరెంట్ తెచ్చాం. నీళ్ల కోసం బోర్ వేశాం. ఈలోపే షోకాజ్​  వచ్చింది.

– గుగులోతు పద్మ, సర్పంచ్, చంద్యాతండా, మహబూబాబాద్ జిల్లా

Latest Updates