‘4’ కు మొనగాడు!

యువరాజ్‌‌ నుంచి మొదలుపెడితే.. విజయ్‌‌ శంకర్‌‌ వరకు..! మధ్యలో దాదాపు 12 మంది.. అలా వచ్చారు.. ఇలా వెళ్లారు..! కానీ ఒక్కరు కూడా భరోసా ఇవ్వలేకపోయారు..! మధ్యలో తెలుగుతేజం అంబటి రాయుడు కొన్నాళ్లు స్థిరంగా ఆడినా.. ప్రయోగాల దెబ్బకు వెనుకబడిపోయాడు..! రెండేళ్లు.. ఎన్నో చేర్పులు.. మరెన్నో కూర్పులు.. అవకాశాలు దక్కక కొంత మంది.. ఆడలేక కొంత మంది.. అలా వదిలి వెళ్లిపోయిన టీమిండియా ‘నాలుగో స్థానం’లో  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ కుదురుకున్నట్లేనా..? ఇన్నాళ్లూ కఠిన పరీక్షగా నిలిచిన ‘నాలుగు స్థంబాలాట’కు ఈ ముంబై కుర్రాడు ముగింపు పలికినట్టేనా..? ప్రస్తుతానికి  ‘యస్‌‌’ అని అనుకుంటున్నా.. ఫ్యూచర్‌‌ ఏంటనేది కాలమే నిర్ణయించాలి..!!

వెలుగు క్రీడావిభాగం

ప్రపంచ క్రికెట్‌‌‌‌లో టీమిండియా అనగానే ఠక్కున గుర్తొచ్చేది బలమైన బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌. లెజెండ్స్‌‌‌‌ వెళ్లిపోయిన ప్రతిసారి ఆ  స్థానాలను అద్భుతంగా భర్తీ చేసే కుర్రాళ్లూ రావడంతో ఇప్పటివరకు ఇండియా లైనప్‌‌‌‌ చెక్కు చెదరలేదు. కానీ గత రెండేళ్లుగా టీమ్‌‌‌‌లో ఒక స్థానానికి మాత్రం కుదురుగా ఆడే బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ దొరకలేదంటే అతిశయోక్తి కాదు. అదే నంబర్‌‌‌‌ ‘4’. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి అలసిపోయారు. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆశలు గల్లంతయ్యాకా.. శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ రూపంలో సరికొత్త మొనగాడిని వెతికి పట్టుకున్నారు. మరి శ్రేయస్‌‌‌‌ ఆ స్థానానికి సరిపోయాడా? లేదా చూద్దాం..!

క్లిష్టమైన పాత్ర..

బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఎంత ముఖ్యమో.. దానికంటే బలమైన మిడిలార్డర్‌‌‌‌ ఉండటం అత్యవసరం. ఈ మిడిలార్డర్‌‌‌‌కు మూల స్థంభం నాలుగో నంబర్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌. అటు టాప్‌‌‌‌, ఇటు మిడిల్‌‌‌‌కు సంధానకర్తగా వ్యవహరించాలి. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ వేసే పునాదిపై బలమైన పరుగుల బిల్డింగ్‌‌‌‌ను నిర్మించాలి. కొత్త, పాత బంతులను సమర్థంగా ఎదుర్కొవాలి. కొన్నిసార్లు టాప్‌‌‌‌ విఫలమైనా.. అన్నీ తానై  మ్యాచ్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాలి. ఇలాంటి సందర్భాల్లో మ్యాచ్‌‌‌‌ పరిస్థితిని అంచనా వేసే నైపుణ్యం ఉండాలి. కిందిస్థాయిలో వచ్చే సహచరులకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఏ బౌలర్‌‌‌‌ ఎలాంటి బంతులు వేస్తున్నాడు? ఏ టైమ్‌‌‌‌లో రన్‌‌‌‌రేట్‌‌‌‌ పెంచాలి? ఎవరిపై ఎదురుదాడి చేయాలి? ఫినిషింగ్‌‌‌‌ ఎలా ఉండాలి? ఇలా ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ ముందుకెళ్లాలి. అదే సమయంలో వ్యక్తిగత ఫెర్ఫామెన్స్‌‌‌‌ను కూడా నిరూపించుకోవాలి. అవసరమైనప్పుడు దూకుడుగా, అవకాశం లేనప్పుడు నిలకడగా, రకరకాల పాత్రలను పోషించాలి. చంచల మనస్తత్వం కాకుండా స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించాలి. ఇప్పుడు న్యూజిలాండ్‌‌‌‌తో తొలి వన్డేలో శ్రేయస్‌‌‌‌ ఆటలో ఇవన్నీ కనిపించాయి.

‘4’ లో షైన్‌‌‌‌

కెరీర్‌‌‌‌ ఆరంభం నుంచి శ్రేయస్‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌లో అన్ని స్థానాల్లో ఆడాడు. 3, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌‌‌‌కు దిగినా.. నాలుగో స్థానంలో ఎక్కువగా రాణించాడని స్టాట్స్‌‌‌‌ చెబుతున్నాయి. వన్డేల్లో ఈ ముంబై ప్లేయర్‌‌‌‌ ఇప్పటివరకు 16 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. మూడో స్థానంలో మూడు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడి 54 సగటుతో162 రన్స్‌‌‌‌ చేశాడు. నాలుగో స్థానంలో 6 ఇన్నింగ్స్‌‌‌‌లో 284 రన్స్‌‌‌‌ చేశాడు. సగటు 56.80. ఐదో స్థానంలో 5 ఇన్నింగ్స్‌‌‌‌లు ఆడినా 188 రన్స్‌‌‌‌ చేశాడు. సగటు 37గా  ఉంది. ప్రతి స్థానంలో రెండు చొప్పున హాఫ్‌‌‌‌ సెంచరీలు చేసినా.. సెంచరీ మాత్రం నాలుగో స్థానంలో ఆడినప్పుడే సాధించడం విశేషం. ఇక టీ20ల్లో మూడో స్థానంలో 4 ఇన్నింగ్స్‌‌‌‌ ఆడి 111 రన్స్‌‌‌‌ చేస్తే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చి 8 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 50 సగటుతో 250 రన్స్‌‌‌‌ చేశాడు. ఐదో స్థానంలో 7 ఇన్నింగ్స్‌‌‌‌ ఆడినప్పటికీ 17 రన్సే చేశాడు. స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌ విషయంలోనూ నాలుగో స్థానంలో 151.52గా ఉంది.  ఓవరాల్‌‌‌‌గా స్టాట్స్‌‌‌‌ను బట్టి చూస్తే నాలుగో స్థానానికి శ్రేయస్‌‌‌‌ సరైన ప్లేయర్‌‌‌‌ అని చెప్పొచ్చు. కానీ ఫ్యూచర్‌‌‌‌లో ఇలాగే ఆడతాడా?

నేర్చుకునేతత్వం..

అందరి ప్లేయర్ల మాదిరిగా శ్రేయస్‌‌లో కొన్ని బలహీనతలు ఉన్నా..వాటిని అధిగమించేందుకు ఎక్కువగా శ్రమిస్తాడు. ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకుంటాడు. దీనికితోడు అనుభవజ్ఞుల అండ, దేశవాళీలో ముంబైకి ఆడటం, ఐపీఎల్‌‌లో ఢిల్లీకి కెప్టెన్‌‌గా వ్యవహరించడం వల్ల చాలా విషయాల్లో పరిణతి సాధించాడు. పాంటింగ్‌‌, సచిన్‌‌, ద్రవిడ్‌‌, గంగూలీ, ఆప్టన్‌‌ వంటి లెజెండ్స్‌‌ ఇచ్చిన సలహాలను తూచ తప్పకుండా పాటిస్తాడు. వీరిని చూసే పోరాడే తత్వాన్ని ఒంట బట్టించుకున్నానని అయ్యర్‌‌ ధీమాగా చెబుతాడు. వారి అనుభవాలను తన ఆటలోనూ చూపెడుతుంటాడు. ఇక ఫిట్‌‌నెస్‌‌ విషయంలోనూ ఈ ముంబై కుర్రాడికి ఢోకా లేదు. కెరీర్‌‌ ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు చాలా ధృడంగా మారాడు. ఏ డ్రైవ్‌‌ అయినా అలవోకగా కొట్టేస్తుంటాడు. సిక్సర్లు కూడా నీళ్లు తాగినంత సులువుగా బాదేస్తుంటాడు. కాబట్టి ఇప్పటికైతే నాలుగో నంబర్‌‌కు శ్రేయస్‌‌ మొనగాడే.

Latest Updates